ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా.. ఓదార్పు యాత్ర అనే పేరు ప్రస్తావనకు వస్తే.. వైఎస్ జగన్ చేసిన యాత్ర గుర్తొస్తుంది. తన కుటుంబం పడిన దుఃఖాన్ని తట్టుకోలేక, ఇతర కుటుంబాలు పడ్డ బాధను తీర్చేందుకు, వారిని ఓదార్చేందుకు జగన్ బాధితుల ఇంటి గడప తొక్కారు. వారికి తానున్నాననే భరోసా ఇచ్చారు, చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సాయం కూడా అందించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఓదార్పు యాత్రలకి నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తండ్రి 'తీర్థ'యాత్రలు చేస్తుంటే.. తనయుడు ఎక్కడ ఏ చిన్న వివాదం ముసిరినా ఓదార్పు యాత్ర అంటూ ప్రత్యక్షమవుతున్నారు.
మొన్న ప్రొద్దుటూరు వెళ్లారు, నిన్న గురజాలకు వచ్చారు. కేవలం పరామర్శించి పోవడమే కాదు, శవయాత్రల్లో చివరి వరకూ ఉండి మరీ సీన్ పండించి పోతున్నారు చినబాబు.
ప్రకాశం జిల్లాలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని కూడా ఇలాగే పరామర్శించి వచ్చారు లోకేష్. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలని కూడా కదిలించి మరీ కన్నీరు పెట్టించి వచ్చారు. చూస్తుంటే.. శవ రాజకీయాలకు పేటెంట్ తీసుకునేట్టున్నారు లోకేష్.
వ్యక్తిగత తగాదాలు, కక్షలతో.. స్థానికంగా జరిగిన దారుణాలను ప్రభుత్వానికి అంటగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తండ్రీకొడుకులిద్దరూ. అటు దేవాలయాలపై దాడుల్ని 100, 200 అంటూ కౌంట్ పెంచుకుంటూ పోతున్నారు.
ఫలానా చోట దేవుడి పటంపై నుంచి పూలు కిందపడ్డాయి, ఇంకోచోట.. కొబ్బరి చిప్పను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు.. వీటన్నిటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం అనే స్టేజ్ వరకు వచ్చేశారు.
లోకేశం ఉగ్రరూపం.. బాలయ్యను మించిపోయేలా పంచ్ డైలాగులు..
నారా లోకేష్ కి ఇప్పిస్తున్న పొలిటికల్ ట్రైనింగ్ కాస్తా సినిమా స్టైల్ కి మారిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మామ బాలయ్యలా తొడగొట్టడం లేదు కానీ, అంతకుమించి అన్నట్టుగా రెచ్చిపోతున్నారు, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.
మేం తలచుకుంటూ ఎలా ఉంటుందో మాకే తెలియదు అంటూ.. దాచేపల్లిలో సినిమా డైలాగులు వల్లె వేశారు చినబాబు. ప్రసంగం మొత్తం సీఎం జగన్ కు వేలెత్తి వార్నింగ్ ఇస్తూనే కనిపించారు.
నిజంగా లోకేష్ లో ఇంత నటనా పటిమ ఉందా అని ఆశ్చర్యపోవడం అక్కడున్నవారి వంతు అయింది. తాత నటన వారసత్వంగా అబ్బి ఉంటుందని అనుకున్నవారు కూడా ఉన్నారు.
వ్యక్తిగత దాడుల్ని కూడా పూర్తిగా ప్రభుత్వంపై నెట్టేసి రాజకీయాలు చేయాలనుకోవడం టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనం. ఇకనైనా చినబాబు ఇలాంటి శవరాజకీయాలను పక్కనపెట్టి, పాతాళంలోకి పడిపోతున్న పార్టీ పరువుని కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.