జ‌గ‌న్‌కు ఆ మాత్రం తీరిక లేదా?

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ 12వ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం వేడుక‌ల్లో…

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ 12వ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండ‌డంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం వేడుక‌ల్లో పాల్గొన‌క‌పోవ‌డంపై కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ నాయ‌కుడికైనా పార్టీ ముఖ్య‌మ‌ని, అది బ‌లంగా ఉంటేనే అధికార‌మైనా, మ‌రొక‌టైనా అని గుర్తు చేస్తున్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొన‌కుండా కేవ‌లం ట్వీట్‌తో స‌రిపెట్ట‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ కూడా ఎక్క‌డా పార్టీ వేడుక‌ల్లో పాల్గొన్న దాఖ‌లాలు లేవు. తాడేప‌ల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుడైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన‌డం విశేషం.

అన్నిటికీ రామ‌కృష్ణారెడ్డే దిక్క‌య్యార‌ని, వైఎస్ జ‌గ‌న్ త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు కద‌ల‌డం లేద‌నే విమ‌ర్శలు సొంత పార్టీ నుంచి కూడా రావ‌డం గ‌మ‌నార్హం. పార్టీ ఆవిర్భావ వేడుక‌ను పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

“దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!” అని జ‌గ‌న్ ట్వీట్‌ చేశారు. 

స‌మాజ‌మే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని ప్ర‌జాస్వామ్యంలో చెప్పుకుంటాం. పార్టీకి కార్య‌క‌ర్త‌లే దేవుళ్లు. క‌నీసం పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ పాల్గొని వుంటే… ఆ కిక్కే వేరుగా ఉండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికారం అశాశ్వ‌త‌మ‌ని, పార్టీ శాశ్వ‌త‌మ‌ని, అలాంటిది ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొన‌లేనంత బిజీ జ‌గ‌న్‌కు ఏమొచ్చింద‌నే ప్ర‌శ్న‌లు మాత్రం స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.