ఒక్క ఫైట్ పెడితే బాగుండేది కదా ప్రభాస్!

రాధేశ్యామ్ సినిమా హిట్టయిందా లేక ఫ్లాప్ అయిందా? యావరేజ్ టాక్ తో నడుస్తోందా? సోషల్ మీడియాలో చర్చ ఇది కానేకాదు. చర్చ మొత్తం కొత్త టర్న్ తీసుకుంది. అది కూడా స్వయంగా ప్రభాస్ అభిమానుల…

రాధేశ్యామ్ సినిమా హిట్టయిందా లేక ఫ్లాప్ అయిందా? యావరేజ్ టాక్ తో నడుస్తోందా? సోషల్ మీడియాలో చర్చ ఇది కానేకాదు. చర్చ మొత్తం కొత్త టర్న్ తీసుకుంది. అది కూడా స్వయంగా ప్రభాస్ అభిమానుల మధ్యే ఈ చర్చ నడుస్తోంది. అదే ఫైట్ సీన్. అవును.. రాధేశ్యామ్ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదని బాధపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 

లవ్ స్టోరీ, క్లాస్ మూవీ కాబట్టి ఫైట్ పెట్టలేదని సర్దుకోవడానికి లేదక్కడ. ఫైట్ పెట్టే సందర్భం కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ ఎందుకు పెట్టలేదనేది అభిమానుల బాధ. నిజంగా ఫ్యాన్స్ బాధలో అర్థం ఉందనిపిస్తుంది.

సినిమాలో జగపతిబాబు చేయి చూసి జాతకం చెబుతాడు ప్రభాస్. జగపతిబాబుకు నచ్చని విషయాలు చెప్పి బయటకొచ్చేస్తాడు. ఆ సీన్ ను అక్కడితో కట్ చేస్తే సరిపోయేదు. జగపతిబాబు మనుషులు, ప్రభాస్ ను తరమడం, మన హీరో ఆ రౌడీల్ని కామెడీగా తప్పించుకోవడం చూపించారక్కడ. అదే ప్లేస్ లో కామెడీ అనుకునే ఆ సీన్లు తప్పించి, ఓ మాంఛి ఫైట్ పెడితే బాగుండేదనేది ప్రభాస్ అభిమానుల ఫీలింగ్.

నిజానికి కథ ప్రకారం ఆ సన్నివేశంలో ప్రభాస్ కు యాక్సిడెంట్ అవ్వాలి. అలా యాక్సిడెంట్ అయి, అతడు పూజాహెగ్డే పనిచేస్తున్న హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలి. అలాంటప్పుడు ఫైట్ పెట్టి యాక్సిడెంట్ అయ్యేట్టు చూపిస్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజన్లు. ఓ యాక్షన్ బ్లాక్ పెట్టే సందర్భం ఉన్నప్పటికీ మేకర్స్ దాన్ని ఉపయోగించుకోలేదని, ఫైట్ ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు రాధేశ్యామ్ సినిమా తొలి రోజు రన్ పూర్తిచేసుకుంది. నిన్న రిలీజైన ఈ సినిమాకు 79 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. పాండమిక్ తర్వాత ఇండియాలో హయ్యస్ట్ గ్రాసర్ తమ సినిమానే అంటూ క్లెయిమ్ చేసుకున్నారు.