నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఆయన సోదరి, మాజీ మంత్రి అఖిలప్రియకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెండు రోజుల క్రితం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల, ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్‌లైన భూమా బ్రదర్ అండ్ సిస్టర్‌కు బాబు బాగా తలంటారని తెలిసింది.
భూమా బ్రహ్మానందరెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగకపోవడం, రోజురోజుకూ నంద్యాలలో పార్టీ బలహీనపడుతుండడం, అలాగే ఆళ్లగడ్డలో అఖిలప్రియ, భూమా కిషోర్‌రెడ్డి మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఎందుకు చొరవ చూపడం లేదని బ్రహ్మానందరెడ్డిని బాబు నిలదీసినట్టు తెలిసింది. అఖిలప్రియ, కిషోర్‌రెడ్డి ఇద్దరూ తమ మాట వినే అవకాశం లేదని, అయినా కుటుంబ గొడవల్లో తాను తలదూర్చనని బ్రహ్మానందరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందని తెలిసింది.
కుటుంబ గొడవలను పరిష్కరించకపోవడం వల్ల అంతిమంగా రాజకీయాలపై ప్రభావం పడుతుందని, దాని వల్ల పార్టీ దెబ్బతినదా? అని చంద్రబాబు ప్రశ్నించగా, బ్రహ్మానందరెడ్డి నుంచి మౌనమే సమాధానం అయినట్టు తెలిసింది. ఇలా వుంటే కుదరదని, ఇప్పటి నుంచైనా యాక్టీవ్ కాకపోతే ఏం చేయాలో తనకు బాగా తెలుసని చంద్రబాబు చురకలంటించి బయటికి పంపించినట్టు తెలిసింది.
అనంతరం అఖిలప్రియతో జరిగిన సమావేశంలో బాబు తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఆళ్లగడ్డ టికెట్ తనకే అని ప్రకటించాలని అఖిలప్రియ పట్టుపట్టినట్టు సమాచారం. అఖిలప్రియ వైఖరిపై బాబు అసహనం ప్రదర్శించారని తెలిసింది. ప్రతి దానికి భూమా కుటుంబం అని చెబుతారని, నీ వెంట ఎంత మంది కుటుంబ సభ్యులున్నారో చెప్పాలని నిలదీసినట్టు తెలిసింది. భూమా కిషోర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సొంత చెల్లి మౌనికతో కూడా చివరికి విభేదాలున్నాయని, తమ్ముడు, భర్త తప్ప… ఎవరున్నారో చెప్పాలని బాబు ప్రశ్నించడంతో అఖిలప్రియ అవాక్కైనట్టు సమాచారం.
అలాగే చిన్నబ్బ నారాయణరెడ్డిపై దాడి, కిడ్నాప్ యత్నం, హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసులో జైలు పాలు కావడం, సొంత పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం ఘటనల గురించి అఖిలప్రియకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. నీ చేష్టల వల్ల ఆళ్లగడ్డతో పాటు కర్నూలు జిల్లాలో పార్టీ పరువు పోతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముందు నియోజకవర్గానికి వెళ్లి, అందరినీ కలుపుకెళ్లాలని, టికెట్ విషయమై ఎప్పుడు, ఎలా ప్రకటించాలో తనకు తెలుసని బాబు తేల్చి చెప్పినట్టు టీడీపీ వర్గాల నుంచి సమాచారం.
బాబు ఆగ్రహంతో అఖిలప్రియ చిన్నబుచ్చుకున్నట్టు తెలిసింది. అనంతరం తన గోడును బ్రహ్మానందరెడ్డి వద్ద వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. కానీ ఆళ్లగడ్డ టికెట్‌పై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడంతో అఖిలప్రియ ఆందోళనలో ఉన్నారు.