మాకు కూడా పోటీ ఉందంటున్న సీనియర్ నటి

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల మధ్య గట్టిపోటీ ఉంది. ఇక హీరోయిన్ల మధ్య పోటీ గురించి తెలిసిందే. ఏడాదికో హీరోయిన్ టాప్ లో ఉంటోంది. అయితే ఈ పోటీ కేవలం హీరోహీరోయిన్ల వరకు మాత్రమే…

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల మధ్య గట్టిపోటీ ఉంది. ఇక హీరోయిన్ల మధ్య పోటీ గురించి తెలిసిందే. ఏడాదికో హీరోయిన్ టాప్ లో ఉంటోంది. అయితే ఈ పోటీ కేవలం హీరోహీరోయిన్ల వరకు మాత్రమే పరిమితం కాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా ఇప్పుడు పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు తోడు, మాజీ హీరోయిన్లంతా ఒకేసారి తెరపైకి రావడంతో.. ఇప్పుడీ విభాగంలో కూడా పోటీ ఎక్కువైంది.

అమ్మ, అక్క, వదిన పాత్రలు చూడ్డానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ఆ పాత్రలు దక్కించుకోవడం చాలా కష్టంగా ఉందంటోంది ఒకప్పటి నటి ఇంద్రజ. ఈ పాత్రలకు కూడా స్టార్స్ తయారయ్యారని, తమకంటూ ఓ ప్రత్యేకత చూపించుకోకపోతే రాణించడం చాలా కష్టంగా ఉందంటోంది.

“న‌దియా, ఖష్బూ, రోజా, ఆమ‌ని, తులసి వారంతా మాకు సీనియ‌ర్లు. ర‌వ‌ళి, సంఘ‌వి మా త‌రం. మాకూ మంచి పాత్ర‌లు చేయాల‌నుంటుంది. అవ‌కాశాలు వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాం. కానీ చాలా మంది న‌టీమ‌ణులున్నారు. కాంపిటీషన్ వుంది. అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేసేవారు చాలా మంది వున్నారు. బెట‌ర్ అవ‌కాశం రావ‌డ‌ం కూడా అదృష్టమే.”

ప్రస్తుతం కథలు ఎంపిక చేసుకునే పొజిషన్ లో తను లేనని అంటోంది ఇంద్రజ. నటిగా సంతృప్తి అనేది ఉండదని, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ సాగడమే తన ముందున్న లక్ష్యమని చెబుతోంది. ప్రస్తుతం ఈ నటి తెలుగులో 3 సినిమాలు చేస్తోంది. రాజ్ తరుణ్ కు తల్లిగా ఆమె నటించిన స్టాండప్ రాహుల్ మూవీ విడుదలకు సిద్ధమైంది.