ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ఓవ‌రాక్ష‌న్‌…తెలంగాణ పోలీసుల వార్నింగ్‌!

తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి హైద‌రాబాద్‌లో ఓవ‌రాక్ష‌న్ చేశారు. తానో ఎమ్మెల్యే అని, అడ్డుకోవ‌డం ఏంట‌నే అహంకార ధోర‌ణిని ఆమె ప్ర‌ద‌ర్శించారు. కానీ ఆమె అతి తెలంగాణ పోలీస్ అధికారుల ఎదుట ప‌ని చేయ‌లేదు.…

తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి హైద‌రాబాద్‌లో ఓవ‌రాక్ష‌న్ చేశారు. తానో ఎమ్మెల్యే అని, అడ్డుకోవ‌డం ఏంట‌నే అహంకార ధోర‌ణిని ఆమె ప్ర‌ద‌ర్శించారు. కానీ ఆమె అతి తెలంగాణ పోలీస్ అధికారుల ఎదుట ప‌ని చేయ‌లేదు. శ్రీ‌దేవికి పోలీస్ అధికారులు చేయి చూపిస్తూ… హ‌ద్దుల్లో వుండాల‌ని హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ వీకెండ్స్‌లో టీడీపీకి చెందిన ఐటీ ఉద్యోగులు లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్ అంటూ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీ న‌గ‌ర్ వ‌ర‌కూ న‌ల్ల దుస్తులు ధ‌రించి మెట్రోలో ప్ర‌యాణించి నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి మియాపూర్ మెట్రో స్టేష‌న్‌కు చేరుకున్నారు.

సాధార‌ణ ప్ర‌యాణికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం స‌రైంది కాద‌ని, నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అనుమ‌తించ‌లేదు. పోలీసుల‌పై ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ద‌బాయింపున‌కు దిగారు. తాను తాడికొండ ఎమ్మెల్యేన‌ని, ఎలా అడ్డుకుంటార‌ని పోలీస్ అధికారుల్ని నిల‌దీశారు. ప్ర‌యాణికుల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకునే అనుమ‌తించ‌లేద‌ని చెబుతున్న పోలీస్ అధికారుల‌పై శ్రీ‌దేవి మ‌రింత‌గా రెచ్చిపోయారు.

దీంతో స‌హ‌నం న‌శించిన పోలీసులు… మీరేం పిఠాపురం జ‌మీందారి వంశానికి చెందిన మ‌హిళ కాద‌ని, తాడికొండ ఎమ్మెల్యే అయితే ఏంట‌ని శ్రీ‌దేవికి చేయి చూపిస్తూ ఓ పోలీస్ అధికారి ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఇది హైద‌రాబాద్ అని, రాజ‌కీయాలు ఏవైనా వుంటే ఆంధ్రాలో చేసుకోవాల‌ని శ్రీ‌దేవికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో శ్రీ‌దేవి ఖంగుతిన్నారు. చేసేదేమీ లేక నోర్మూసుకున్నారు.