సమ్మర్ బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు?

ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. విరూపాక్ష మినహా, సమ్మర్ బాక్సాఫీస్ లో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. మరి ఈ సమ్మర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు? జూన్…

ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. విరూపాక్ష మినహా, సమ్మర్ బాక్సాఫీస్ లో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. మరి ఈ సమ్మర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు? జూన్ లో వస్తున్న క్రేజీ మూవీస్ ఏంటి?

ఈనెల మొదటివారంలో ఏకంగా 7 సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీస్ మూడు మాత్రమే. దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న అహింస సినిమా వీటిలో ఒకటి. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న అహింస సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఈ సినిమాతో పాటు నేను స్టూడెంట్ సర్, పరేషాన్ అనే మరో 2 సినిమాలు కూడా వస్తున్నాయి. బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన సినిమా 'నేను స్టూడెంట్ సర్'. భాగ్యశ్రీ కూతురు అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. నాంది సతీష్ నిర్మించిన ఈ సినిమా ట్రయిలర్ తో ఆకట్టుకుంది. ఇక పరేషాన్ సినిమా ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. స్వయంగా రానా ఈ సినిమాను భుజానికెత్తుకున్నాడు. ఓవైపు తమ్ముడి సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ, మరోవైపు పరేషాన్ కు కూడా ప్రచారం చేస్తూ, సినిమాపై హైప్ పెంచుతున్నాడు.

రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో కూసింత అంచనాలతో వస్తున్న సినిమాలు ఈ మూడే. వీటితో పాటు చక్రవ్యూహం, ఐక్యూ, అభిలాష, బంగారు తెలంగాణ లాంటి సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.

రెండో వారంలో సిద్దార్థ్ నటించిన టక్కర్, విమానం సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాల్లో వేటిపై పెద్దగా అంచనాల్లేవు. టక్కర్ సినిమా పక్కా కమర్షియల్ మూవీ అంటున్నాడు సిద్దార్థ్. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని చెబుతున్నాడు. ఇక విమానం సినిమాలో అనసూయ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ లాంటి నటీనటులు ఉన్నప్పటికీ బజ్ అంతంతమాత్రంగానే ఉంది. ఈరోజు ట్రయిలర్ రిలీజైంది కాబట్టి హైప్ వస్తుందేమో చూడాలి.

ఈ నెల మూడోవారంలో థియేటర్లలోకి వస్తున్న సినిమా ఆదిపురుష్. జూన్ నెలలో వస్తున్న వన్ అండ్ ఓన్లీ బిగ్ మూవీ ఇదొక్కటే. ప్రభాస్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రచారం పీక్స్ కు చేరుకుంది. వరుసగా లిరికల్ వీడియోస్ వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు కూడా చేయబోతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ్ గా, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీఖాన్ రావణ్ గా కనిపించనున్నారు.

ఈ సినిమాతో పాటు నెలాఖరుకు వస్తున్న స్పై సినిమాపై కూడా అంచనాలున్నాయి. నిఖిల్ హీరోగా నటించిన సినిమా ఇది. ఎడిటర్ గ్యారీ, దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ జీవితం వెనక దాగున్న రహస్యాల్ని చర్చించారు. టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతానికి జూన్ లో షెడ్యూల్ అయిన సినిమాలు ఇవే. 23, 29 తేదీలకు మరిన్ని సినిమాలు షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. అయితే అందరి చూపు మాత్రం ఆదిపురుష్, స్పై సినిమాలపైనే ఉంది. వీటిలో ఏ సినిమా ఈ సమ్మర్ కు బ్లాక్ బస్టర్ ముగింపు ఇస్తుందో చూడాలి.