జాతకాలు, జ్యోతిష్యం నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. జాతకం 99శాతం కరెక్ట్ అంటూనే, విధిని ఎదిరించొచ్చని చూపించాడు. చేతిరేఖల కంటే, చేతలతోనే మన రాతను మనం రాసుకోవచ్చని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి రియల్ లైఫ్ లో ఈ దర్శకుడికి జాతకాలపై ఎలాంటి అభిప్రాయం ఉంది. నిజజీవితంలో జాతకాలు చెప్పేవాళ్లు 90శాతం మంది ఫ్రాడ్ అంటున్నాడు ఈ డైరక్టర్.
“రాధేశ్యామ్ కోసం చాలా కష్టపడ్డాను. జ్యోతిష్యానికి సంబంధించి చాలా పుస్తకాలు చదివాను. దాదాపు 7-8 ఏళ్లు నాకు అదే పని. చాలామంది నిపుణుల్ని కలిశారు. చాలామందితో మాట్లాడాను. ఆ ప్రాసెస్ లో నేను గమనించింది ఏంటంటే.. జాతకాలు చెప్పే వాళ్లలో 90శాతం మంది ఫ్రాడ్ ఉన్నారు. వాళ్లు చెప్పేదంతా ట్రాష్. కానీ ఓ 10శాతం మంది మాత్రం ఉన్నారు. వాళ్లు నన్ను సర్ ప్రైజ్ చేశారు. కొన్ని విషయాలు మనకు తప్ప, రెండో వ్యక్తికి తెలిసే ఛాన్స్ లేదు. అలాంటి విషయాల్ని కూడా వాళ్లు ఓపెన్ చేసి చెప్పారు. అతడికి ఎలా తెలిసిందో మనకు అంతుబట్టదు. అలా షాక్ ఇచ్చేవాళ్లు 10శాతం ఉన్నారు.”
ఇలా నిజజీవితంలో జాతకాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు రాధాకృష్ణకుమార్. జాతకాల్ని నమ్మడంలో తప్పు లేదంటున్న ఈ దర్శకుడు.. మానవ ప్రయత్నం లేకుండా జాతకాలు నిజం అవ్వవని చెప్పుకొచ్చాడు.
నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకొచ్చింది రాధేశ్యామ్ సినిమా. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ వినిపించింది. దీనిపై స్పందించిన దర్శకుడు, లవ్ సబ్జెక్ట్ కు మిక్స్ డ్ టాక్ రావడం కామన్ అన్నాడు. అమ్మాయిలకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని, ప్రేమతో సినిమా చూడాలని చెబుతున్నాడు.