ఐదు రాష్ట్రాలకు గాను నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించడంతో బీజేపీలో ఉత్సాహం రెట్టింపైంది. 2024లో కూడా తిరిగి తామే అధికారంలోకి వస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో పుష్కలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెడతామని బీజేపీ నేతలు ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా ఏపీకి చెందిన బీజేపీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారంలోకి వచ్చేందుకు దృష్టి పెడతామని ఆయన అన్నారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్‌లో ఉన్నట్టు ఆయన చెప్పారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఏ పార్టీ అయినా బలపడాలంటే ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు మారాల్సిందే. ఇందులో రెండో మాటకు స్థానం లేదు. అయితే తమ పార్టీలోకి వచ్చే వాళ్ల ఉద్దేశాలు, దురుద్దేశాలు ఏంటో బీజేపీ నేతలు గ్రహించాల్సి వుంది.
ఇప్పటికే బీజేపీలో చేరిన టీడీపీ ముఖ్య నాయకులు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో లోకానికి బాగా తెలుసు. బీజేపీలో ఉంటూ టీడీపీ ఎజెండా మోస్తున్న నేతలపై ప్రధానంగా బీజేపీ అధిష్టానం దృష్టి సారించాల్సి వుంది. పేరుకు తమ పార్టీలో ఉంటున్నా, మనసంతా చంద్రబాబు, టీడీపీ రాజకీయ ప్రయోజనాలపైనే అనే ఉంటోందని నిఖార్సైన బీజేపీ నేతలు మధనపడుతున్నారు.
ఒకప్పుడు బీజేపీ ఎదగకపోవడానికి ఒక్క పేరు మాత్రమే చెప్పేవారని, ఇప్పుడు అలాంటి వాళ్లు చాలా మంది తయారయ్యారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. బీజేపీలో కలుపు మొక్కలను తొలగిస్తే తప్ప ఆ పార్టీ ఏపీలో బతికి బట్ట కట్టదు. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే, బీజేపీకి అంత త్వరగా మంచి రోజులు వచ్చినట్టు.