ఎమ్బీయస్‍: అభినయానికి తోడు అరుదైన వ్యక్తిత్వం – జానకి

మార్చి  11     ఎమ్బీయస్‍:  అభినయానికి తోడు అరుదైన వ్యక్తిత్వం – జానకి Advertisement   ఈ ఏడాది పద్మశ్రీ వచ్చిన ‘షావుకారు’ జానకి చక్కటి అభినేత్రి మాత్రమే కాదు, అనేక విద్యలలో ఆరితేరిన జాణ.…

మార్చి  11     ఎమ్బీయస్‍:  అభినయానికి తోడు అరుదైన వ్యక్తిత్వం – జానకి

 

ఈ ఏడాది పద్మశ్రీ వచ్చిన ‘షావుకారు’ జానకి చక్కటి అభినేత్రి మాత్రమే కాదు, అనేక విద్యలలో ఆరితేరిన జాణ. కష్టాలెన్ని ఎదురైనా, ఒంటరి పోరాటం చేసి వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న ధీమంతురాలు. ఎప్పుడో వేసిన పాత్రలకై యిప్పుడు పద్మ అవార్డు యిస్తున్నారు అనుకోవడానికి లేదు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రాబోయే ‘‘అన్నీ మంచి శకునములే’’ సినిమాలో కూడా నటించబోతున్నారావిడ. ‘‘షావుకారు’’ (1950) సినిమాకై 1949లో 18 వ ఏట మేకప్ వేసుకున్న జానకి 2022లో కూడా నటిస్తున్నారంటే 72 ఏళ్ల సుదీర్ఘమైన కెరియర్ అన్నమాట. బహుశా ప్రపంచంలోనే యిది రికార్డు కావచ్చు! ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో, ఎన్నెన్నో పాత్రలు. హరివిల్లులోని రంగులకు మించిన వైవిధ్యభరితమైన భూమికలు!

నటీనటులకు విభిన్నమైన పాత్రలు వేసే అవకాశం వచ్చినపుడే వాళ్ల ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. నవరస నటుడు, నవరసనటి అని వేదికలపై, వ్యాసాల్లో పొగిడేస్తాం కానీ నవరసాలూ ఏమిటో చెప్పమంటే నాలుగైదు చెప్పాక ఆపై మనకు గానీ, ఆ కళాకారులకు గానీ తట్టవు. పోనీ అన్ని రసాలు కాదు, ముఖ్యమైన రసాలు మూడు, నాలుగైనా వేసే ఛాన్సు నటీనటులకు రాదు. మొదట్లో రకరకాల వేషాలు వేద్దామని ట్రై చేసినా, రెండు మూడు సినిమాలు వేసేసరికి రచయితలు, దర్శకనిర్మాతలు ఓ బ్రాండ్ కొట్టేస్తారు, ఓ చట్రం బిగించేస్తారు. ప్రేక్షకులు మీ దగ్గర్నుంచి యిదే ఎదురు చూస్తారండీ అంటూ ఆ పరిధిని దాటనివ్వరు. ‘వేరే రకమైన పాత్రలు నిభాయించడం మీకు చేతకాదని కాదు, కానీ రాణించలేరు. స్క్రీన్ మీద మీ పక్కనున్న తార లేదా తారడు మిమ్మల్ని డామినేట్ చేసేస్తాడు’ అంటూ నిరుత్సాహ పరుస్తారు.

ఇక అక్కణ్నుంచి నటుడు లేదా నటికి ఒకే రకమైన పాత్రలు వస్తూ వుంటాయి, ఒకే రకమైన నటన అలవాటవుతుంది. ఏ సన్నివేశంలో ఎలాటి హావభావాలు ప్రదర్శిస్తారో, డైలాగు ఏ విధంగా పలుకుతారో దర్శకుడికే కాదు, ప్రేక్షకుడికీ అలవాటై పోతుంది. కొంతకాలానికి మొనాటనీ కూడా వచ్చేస్తుంది. ఇదే అదనని మిమిక్రీ కళాకారులు వాళ్లను అనుకరించి అపహాస్యం చేస్తారు. అన్ని రకాల పాత్రలూ వేయాలనే ఉబలాటం కారెక్టరు నటుడికి మాత్రమే తీరుతుంది. గుమ్మడి ఉన్నారనుకోండి, రాజుగా, మంత్రిగా, సేనాధిపతిగా, కుంటి సైనికుడిగా, జమీందారుగా, పేదరైతుగా, కుట్రలు పన్నే గుమాస్తాగా, విద్యాధికుడిగా, తాగుబోతుగా.. ఏ పాత్రలోనైనా యిమిడిపోగలరు.

హీరోలకు అది కుదరదు. ‘‘తోడుదొంగలు’’ (1954)లో చలంకు తండ్రిగా ముసలి వేషం వేయాలని ఎన్టీయార్ ముచ్చటపడితే ఆ సినిమా ఆయనే తీసుకోవలసి వచ్చింది. ఎవార్డు వచ్చింది కానీ ప్రేక్షకులు చూడమనేశారు. ‘‘భీష్మ’’ (1962) సినిమాలో ఉత్తరార్థంలో ముసలివేషం వేస్తే చక్రపాణి గారి చేత చివాట్లు తినవలసి వచ్చింది. దాదాపు 50 ఏళ్ల వయసులో పెద్ద తరహా పాత్రలు వేసే సమయంలో ‘‘బడిపంతులు’’ (1972)లో ముసలి వేషం వేయడం కూడా సాహసమే అనుకున్నారు. ఎయన్నారైతే 55 ఏళ్ల వయసులో ‘‘త్యాగయ్య’’ పాత్ర ఆఫర్ వస్తే ‘ఓ పక్క రొమాంటిక్ పాత్రలు వేస్తూ మధ్యలో యిది వేస్తే ఆ సినిమాలు ఆడవు’ అంటూ తిరస్కరించారు. వయసు మీరిన పాత్రల్నే కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు వేయమన్నా హీరోహీరోయిన్లకు భయం, ప్రజలు ఆమోదించరని!

సావిత్రి గొప్ప అభినేత్రి అని అందరం ఒప్పుకుంటాం. కానీ ఆవిడ గయ్యాళి పాత్ర వేయగలిగారా? కనీసం అసూయగ్రస్తురాలైన భార్య పాత్ర…? పొగరుబోతు పాత్ర…? వేయలేరని కాదు, వేసే అవకాశం రాలేదని అనుకోవచ్చు, అవకాశం తెచ్చుకోలేదనీ అనవచ్చు. ఎందుకు? అంటే ఇమేజ్ ప్రాబ్లమ్! ఎస్. వరలక్ష్మి, జి. వరలక్ష్మి నెగటివ్ పాత్రలు వేయగలిగారు, ఎప్పుడు? వయసు మీరి, కారెక్టరు నటిగా మారాక! కానీ జానకి మాత్రం ప్రైమ్‌లో ఉండగానే అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగారు. ఆవిడ ఏదో మామూలు హీరోయిన్ కాదు, తెలుగులో ఎయన్నార్, ఎన్టీయార్, జగ్గయ్య, తమిళంలో శివాజీ, ఎమ్జీయార్, జెమినీ, కన్నడంలో రాజకుమార్, ఉదయకుమార్.. యిలా అగ్రశ్రేణి నటులందరి సరసనా 200 సినిమాల్లో హీరోయిన్‌గా వేసిన వేసిన స్టార్ హీరోయిన్.

అమాయకురాలిగా నటించి పేరు తెచ్చుకున్న నటి, మరో సినిమాలో గడుసుగా కనబడాలంటే అతి చేసేసే ప్రమాదం ఉంది. కానీ జానకి విషయంలో అది జరగలేదు. ఏ మేరకు వేయాలో అంతే వేశారు. అతి అంటే యింకో విషయం చెప్పాలి. తమిళ సినిమాల్లో కూడా వేషాలు వేసే మన తెలుగువాళ్లు అక్కడి ప్రేక్షకుల అభిరుచి మేరకు కాస్త హయ్యర్ గేర్‌లో నటించడం గమనించవచ్చు. అక్కడ వేసివేసి అలవాటు పడి, యిక్కడా అదే మోతాదుని మనకు రుచి చూపించడం జరిగింది. సావిత్రి, ఎస్.వరలక్ష్మి వంటి వారు మలి దశలో వేసిన సినిమాలలో యిది గమనించవచ్చు. జానకికి తెలుగులో కంటె తమిళంలోనే మార్కెట్ ఎక్కువ. అందునా శివాజీ మార్కు ఎమోషనల్ సినిమాలు అనేకవాటిలో ఆయనకు జోడీగా నటించారు. అక్కడ బాగా అలవాటు పడినా సరే, తెలుగుకి వచ్చేసరికి, మన కెంత కావాలో అంతటితోనే సరిపెట్టారు.

ఇంకో విషయం కూడా యిక్కడ చెప్పుకోవాలి. నటీనటులు తొలి రోజుల్లో ఆత్మవిశ్వాసంతో అండర్‌ప్లే చేస్తూంటారు. పోనుపోను వాళ్లకు ధైర్యం సన్నగిల్లి, అలా నటిస్తే ప్రేక్షకులకు అందదేమోనన్న భయంతో ఓవరాక్షన్ చేస్తూ వుంటారు. ఎన్టీయార్ నుంచి ఎస్వీయార్ దాకా అందరిలో యీ మార్పు చూడవచ్చు. కానీ జానకి మాత్రం తన తరహాను మార్చుకోలేదు. ఎప్పుడూ ఒకే ధీమాతో, ఒకే కన్విక్షన్‌తో వేషాలు వేస్తూ వెళ్లారు. సినిమా హీరోయిన్ అనగానే అందచందాలు, అంగసౌష్టవం ప్రాధాన్యత వహిస్తాయి. ఆ విభాగాల్లో జానకికి ఎక్కువ మార్కులు పడవు. కెవి రెడ్డిగారైతే ‘‘షావుకారు’’లో వేస్తున్నావు సరేలే కానీ, సినిమా పూర్తి కాగానే మీ ఊరెళ్లిపో. హీరోయిన్ కుండవలసిన లక్షణాలేవీ లేవు నీలో’ అనేశారు. ‘‘పాతాళభైరవి’’ కథానాయికగా ఆయన ఎంచుకున్న మాలతి వన్-ఫిల్మ్ వండర్ అయ్యారు. ఈవిడ కెరియర్ ప్రపంచ రికార్డు అధిగమించింది. అయితే ఆవిడ కళ్లలో, గొంతులో పలకని భావం లేదు. వాటి ద్వారానే అందర్నీ కట్టిపడేసిందావిడ. శోకమూర్తి పాత్రలు వేసినది తక్కువే. మన యింట్లో అమ్మాయిలాగ కనబడుతూనే చలాకీగా, హుషారుగా ఉండే పాత్రలు వేసి మెప్పించింది. రకరకాల నృత్యాలూ చేసి వన్నెలు కురిపించింది.

ఎత్తు తక్కువ కావడం చేతనో ఏమో, తెలుగు రంగంలో కంటె తమిళ రంగంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. దాని కారణంగా ఆవిడ మార్కెట్ విదేశాలకు కూడా విస్తరించింది. డబ్బు బాగా గడించి, సినిమాలు తీసేటంత స్తోమత వచ్చింది. హీరోయిన్ వేషాలు తగ్గాక కారెక్టరు పాత్రలకు అవలీలగా మారిపోయారు. గ్లామరస్ తల్లిగా, బామ్మగా కూడా రాణించి తన పారితోషికాన్ని పెంచుకున్నారు. ఎప్పుడూ ఔట్ ఆఫ్ ఫోకస్ కాలేదు. తమిళ సినీసీమ ఆవిణ్ని ఎప్పుడూ ఆదరిస్తూనే వుంది. ఇప్పుడు పద్మశ్రీ కూడా తమిళనాడు ప్రభుత్వం ద్వారానే వచ్చింది. అదీ యీవిడ ప్రమేయం లేకుండా, వాళ్లంతట వాళ్లే సిఫార్సు చేయడం వలన! తెలుగుకే అంటిపెట్టుకుని వుంటే యీ గౌరవం దక్కేదాన్న సందేహం రాకమానదు.

ఆవిడకు నటనతో పాటు అనేక విద్యలు వచ్చు. చిన్నపుడు రేడియో నాటకాలు వేశారు, సినీనటి అయ్యాక రంగస్థలంపై వేశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీషు, కన్నడలలో మంచి వాగ్ధాటి వుంది. వేదికపైన యాంకర్‌గా అసమాన ప్రతిభ చూపించారు. పాకశాస్త్రంలో ప్రవీణురాలు. కొంతకాలం పాటు వ్యాపారం చేసి, నష్టాల్లో ఉన్న ఒక హోటల్‌ను నిలబెట్టి, తన వ్యాపారకౌశలాన్ని సైతం నిరూపించుకున్నారు. ఆవిడ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే దక్షమహిళ (తెలుగులో చెప్పాలంటే కాంపిటెంట్ ఉమన్) అనే పదం తడుతుంది. తండ్రి విద్యాధికుడు, ఉన్నతోద్యోగి ఐనా, ఆవిడ జీవితంలో చాలా ఆటుపోట్లున్నాయి. ఒంటిచేత్తో సంసారాన్ని దిద్దుకోవలసి వచ్చింది. కానీ ఎన్నడూ కృంగిపోకుండా కష్టాలను ఎదుర్కుంటూనే వచ్చారు. ‘‘షావుకారు’’ (1950) సినిమాలో ఒక ముగ్ధకన్య వేషం వుందని తెలిసి, చంటిపిల్లను చంకనేసుకుని వెళ్లి వేషం అడిగారు. అదీ ఆవిడ ఆత్మస్థయిర్యం! ఆ తొలి సినిమా కారణంగానే ఆవిడ పేరు ముందు ‘‘షావుకారు’’ వచ్చి చేరింది.

ఆవిడ వేషాలు ఆవిడే సెలక్టు చేసుకుంది. తన వ్యవహారాలు తనే చక్కబెట్టుకుంది. ఒంటరి కదాని బెంబేలు పడలేదు. ఎవరికీ తలవంచలేదు. ధైర్యంగా ‘నా బతుకు నాది, ఎవరేమన్నా నాకేం లెక్క’ అని తలెత్తుకుని బతికింది. ఇప్పటికీ అంతే! ఆవిడ ధైర్యానికి ఉదాహరణగా ఒకటి రెండు సంఘటనలు చెప్తాను. 1972లో డిఎంకె పార్టీ నుంచి ఎమ్జీయార్‌ను బహిష్కరించినప్పుడు ఎమ్జీయార్ అభిమానులు రోడ్లమీదకు వచ్చి, నిరసన ప్రదర్శనలు చేశారు. దారిన వచ్చే వాహనాలను ఆపి ‘ఎమ్జీయార్ వర్ధిల్లాలి’ అని నినాదాలు యిప్పించారు. ఆ సమయానికి జానకి అలా వస్తూంటే ఆవిడ కారు కూడా ఆపి నినాదం యిమ్మన్నారు. దానితో పాటు ‘శివాజీ డౌన్‌డౌన్’ అని కూడా అనమన్నారు.

ఎమ్జీయార్‌కు కరుణానిధి రాజకీయ ప్రత్యర్థి అయితే, శివాజీ సినిమాల్లో ప్రత్యర్థి. శివాజీ పక్కన యీవిడ చాలా సినిమాల్లో వేశారు. మంచి స్నేహితురాలు. పైగా ‘‘ఒళి విళక్కు’’ (1968) సినిమా సందర్భంగా ఎమ్జీయార్‌తో జానకికి పేచీ వచ్చింది. ఈ కారణాల చేత వాళ్లు జానకిపై ఫోకస్ చేసి, ఒత్తిడి పెట్టారు. అయితే యీవిడ ‘ఎమ్జీయారే కాదు, శివాజీయే కాదు, ఎవరికైనా సరే వర్ధిల్లాలి అనే చెప్తాను, తప్ప ఎవర్నీ డౌన్‌డౌన్ అనను’ అని సమాధానం చెప్పారు. వందలాది ఆవేశపరులైన యువకులు కారు మీద పడి కర్రలతో దబదబ బాదుతూ వుంటే, వాళ్లు చెప్పినది చేయనని చెప్పడానికి ఎంత గట్స్ కావాలి! ఈవిడకున్నాయి. వాళ్లు ఒప్పుకోలేదు. శివాజీ డౌన్‌డౌన్ అనాల్సిందే అన్నారు. ఈవిడ కుదరదంది. ఆ గలభాలో ఈవిడ ముక్కుకు గాయమై, రక్తం కారింది కూడా. అయినా తగ్గేదేలే..!

‘‘ఒళి విళక్కు’’ గొడవేమిటంటే, ‘‘ఫూల్ ఔర్ పత్థర్’’ (1966) అని హిందీలో సినిమా వచ్చింది. ధర్మేంద్ర ఒక రౌడీ. ఒక వూరికి వెళ్లి రోగగ్రస్తురాలై, ఓ యింట్లో ఒంటరిగా మిగిలిన వితంతువు మీనాకుమారిని రక్షించి తెస్తాడు. ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె కోలుకుని, యితను స్వతహాగా మంచివాడని గమనించి, తన ప్రేమతో యితన్ని మంచిమనిషిగా మారుస్తుంది. చివర్లో యిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే ఓ క్లబ్ డాన్సర్ (శశికళ) తన తళుకుబెళుకులతో యితన్ని మారకుండా వుంచాలని చూస్తుంది. ఇతన్ని రౌడీ పనులకు వినియోగించే క్లబ్ యజమాని విలన్. ఆమె వ్యాంప్. దీన్ని తెలుగులో ‘‘నిండు మనసులు’’ (1967)గా ఎన్టీయార్, దేవిక, ఎల్.విజయలక్ష్మిలతో తీశారు. ఎమ్జీయార్ హీరోగా తమిళంలో రీమేక్ చేసే బాధ్యత జెమినీ అధినేత ఎస్.ఎస్. వాసన్ చేపట్టారు. బరువైన వితంతువు పాత్రను జానకికి యిచ్చి, వ్యాంప్ పాత్రను జయలలితకు యిచ్చారు.

అప్పటికే ఎమ్జీయార్, జయలలిత బంధం గట్టిపడింది. అందువలన వ్యాంప్ పాత్ర చివర్లో మంచిదై పోయినట్లు, ఎమ్జీయార్‌ను పెళ్లి చేసుకున్నట్లు మార్చేశారు. మరి జానకి పాత్రో? చివర్లో ఏదో రోగం వచ్చి చచ్చిపోయినట్లు, ఎమ్జీయార్ వచ్చి నుదుట బొట్టు పెట్టినట్లు చూపించారు. అయితే యీ మార్పులను జానకికి ముందుగా చెప్పలేదు. చెప్పవద్దని వాసన్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారు. హిందీ సినిమాలో లాగానే వుంటుందని జానకి ఒప్పుకున్నారు. చివర్లో కథ మార్చేశారని తెలిసింది. దీనికి తోడు టైటిల్స్‌లో సీనియరైన జానకి పేరు కింద వేసి, జూనియరైన జయలలిత పేరు పైన వేశారు. ఇది చూసి భగ్గుమన్న జానకి వాసన్‌ను నిలదీస్తే ‘ఐ యామ్ సారీ, ఎమ్జీయార్ నా మెడలు వంచాడు’ అన్నాడాయన. జానకి ఊరుకోలేదు. ఇది తప్పని ప్రకటన యిచ్చారు.

జయలలితకు కోపం వచ్చింది. నిజానికి ఆమె తల్లి సంధ్య, జానకి మంచి మిత్రురాళ్లు. చిన్నప్పుడు జానకి యింట్లో వాళ్ల పిల్లలతో కలిసి ఆడుకుంది కూడా. అయినా ఒక తమిళ పత్రికలో ఆత్మకథ రాస్తూ జానకిని నిందించింది. ఏ మాత్రం తగ్గకుండా జానకి సమాధానమిచ్చారు. కొన్ని దశాబ్దాలపాటు వారి మధ్య మాటలు లేవు. ‘‘దుశ్మన్’’ (1971) సినిమాను తమిళంలో ‘‘నీతి’’ (1972) పేర తీస్తూ మీనాకుమారి పాత్రను జానకికి, ముంతాజ్ పాత్రను జయలలితకు యిచ్చారు. సెట్స్‌పై మాట్లాడుకున్నారో లేదో తెలియదు. జయలలిత ముఖ్యమంత్రి ఐనా జానకి ఖాతరు చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత జయలలితే గతంగతః అనుకుని జయా టీవీలో కార్యక్రమాలు నిర్వహించమని కబురంపింది. ఓ కార్యక్రమంలో జానకి తనను మెచ్చుకుందని తెలిసి ఆత్మీయంగా లేఖ రాసింది. జానకి ఆదరంగా ప్రతిస్పందించారు.

ఇప్పుడు ఆవిడకు ‘పద్మశ్రీ’ సంపాదించి పెట్టిన అభినయకౌశలం గురించి కాస్త రాస్తాను. ఆవిడ తెలుగు, తమిళ, కన్నడాలలో కలిపి సుమారు 400 సినిమాల దాకా వేశారట. 1960, 70లలో ఏడాదికి సగటున 7-8 సినిమాలు వేస్తే, 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత 70 ఏళ్లు వచ్చేవరకూ ఏడాదికి సగటున 4-5 వేశారు. శివాజీ గణేశన్‌ను నటులకు నటుడని అంటారు. శోకపాత్రల్లో ఎమోషన్స్ పండించడంలో ఆయనకు సాటి లేదు. ఆయన పక్కన దీటుగా నటించి, మెప్పించిన దిట్ట జానకి.

స్త్రీ ప్రధానమైన సినిమాలను అవలీలగా తన భుజాలపై మోయగలనని ఆవిడ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. తల్లీకూతుళ్లుగా సుచిత్రా సేన్ ద్విపాత్రాభినయం చేసిన ‘‘ఉత్తర ఫల్గుణి’’ అనే బెంగాలీ సినిమాను ‘‘మమత’’ (1966) పేరుతో హిందీలో రీమేక్ చేస్తే దాన్ని జానకి ‘‘కావ్యతలైవి’’ (1970) పేరుతో కె బాలచందర్ దర్శకత్వంలో తమిళంలో తీశారు. రంగులరాట్నంలో తిరుగుతూ చిత్తస్థిమితం పోగొట్టుకుని, గర్భం ఎవరి వలన వచ్చిందో తెలియక అల్లాడిన స్త్రీ పాత్ర కేంద్రంగా కృష్ణన్-పంజు దర్శకత్వంలో రూపొందిన ‘‘రంగరాత్తినమ్’’కు కూడా ఆవిడే నిర్మాత. ‘‘కలక్టర్ జానకి’’కి మూలమైన ‘‘ఇరు కొడుగళ్’’ (1969)లో కలక్టరు పాత్రధారిణి జానకే! బాలచందర్‌ తన అభిమాన నటి జానకికి ఎన్నో క్లిష్టమైన పాత్రలిచ్చి ఆవిడలోని నటికి సవాళ్లు విసిరారు. ఆవిణ్ని, నాగేశ్‌ను ముఖ్యపాత్రల్లో పెట్టి ‘‘నీర్‌కుమిళి’’ వంటి సినిమాను హిట్ చేశారు.

‘‘దేవదాసు’’లో పార్వతి పాత్ర ఆవిడ వేయాల్సిందే. నిర్మాత డిఎల్ నారాయణతో చిన్న పేచీ వచ్చి ఆ పాత్ర సావిత్రికి వెళ్లి, ఆమెను తారాపథంలో నిలబెట్టింది. నారాయణ తన తదుపరి చిత్రం ‘‘కన్యాశుల్కం’’ (1955)లో గ్లేమరస్ మధురవాణి పాత్రను సావిత్రి కిచ్చి, ఏ గ్లామర్ లేని అమాయకపు వితంతువు బుచ్చమ్మ పాత్ర జానకికి ఆఫర్ చేస్తే ఆవిడ అతి స్పోర్టివ్‌గా అంగీకరించి, ఆ పాత్రలో జీవించేశారు. అమాయకపు పాత్రల్లో జానకి మెప్పించినట్లుగా మరెవరూ మెప్పించలేరేమో అనిపిస్తుంది. ‘‘పిచ్చిపుల్లయ్య’’, ‘‘ఏది నిజం?’’, ‘‘అక్కాచెల్లెలు’’ (పాండవులు పాండవులు తుమ్మెద పాట గుర్తుందా?), ‘‘భలేకోడళ్లు’’లో పెద్ద కోడలు.. యిలా ఎన్నో ఉన్నాయి. అన్యాయాన్ని ఎదిరించే స్త్రీ పాత్రలను కూడా జానకి సమర్థవంతంగా పోషించగలరని ‘‘రోజులు మారాయి’’, ‘‘ముందడుగు’’ చెప్తాయి.

ఆవిడ తొలిచిత్రం ‘‘షావుకారు’’ (1950) సాంఘికమైతే తొలి తమిళచిత్రం ‘‘వలైయాపతి’’ జానపదం. ఆవిడ వేసిన జానపదాల్లో ఎన్నదగినవి ‘‘సదారమె (కన్నడ)’’, ‘‘రేచుక్క-పగటిచుక్క’’ (యువరాణి), ‘‘రాజా మలయసింహ’’. ‘‘జయం మనదే’’ (విప్లవయువతి) ఉన్నాయి. పౌరాణికాల్లో కన్నడ సినిమా ‘‘మహిషాసుర మర్దిని’’ (దీనిలో మహిషుణ్ని యిష్టపడి, అతను కాదనడంతో రాజనర్తకిగా అవతార మెత్తి అతన్ని ముగ్ధుణ్ని చేసిన యువరాణి వేషం వేశారు), ‘‘వెంకటేశ్వర మహాత్మ్యం’’ (ఎరుకలసాని వేషం), ‘‘నాగుల చవితి’’ (హీరోయిన్‌పై పగబట్టిన అహంభావి దేవత వేషం) ఉన్నాయి. సాంఘికాలకు వస్తే కామెడీలలో ఎన్టీయార్ సరసన ‘‘వద్దంటే డబ్బు’’, రేలంగి సరసన ‘‘చరణదాసి’’, తంగవేలు సరసన ‘‘దేవాంతకుడు’’ తమిళ వెర్షన్ అయిన ‘‘నాన్ కండ స్వర్గం’’, సీనియర్ నటి అయ్యాక వచ్చిన ‘‘తాయారమ్మ-బంగారయ్య’’, ‘‘సంసారం ఒక చదరంగం’’ ఉన్నాయి.

క్లిష్టమైన భార్య వేషాలు వేయడంలో జానకి అందె వేసిన చేయి. భర్త నిరాదరణకు గురై బాధపడిన పాత్రలు ‘‘చెరపకురా చెడేవు’’, ‘‘మంచి మనసులు’’ (అంధురాలు)లో వేశారు. దీనికి పూర్తి కాంట్రాస్టుగా స్వేచ్ఛాప్రవృత్తితో, దూకుడుతో యిబ్బందులను కొని తెచ్చుకుని జీవితాన్ని చిందరవందర చేసుకున్న కాత్యాయని పాత్రను ‘‘భాగ్యరేఖ’’లో పోషించారు. ‘ఇంటిగౌరవం’’లో దుర్మార్గుడైన భర్త కొడుకుని కూడా పెడదారిన పెడుతూంటే అతన్ని ఎదిరించిన భార్యగా వేశారు. ‘‘బాటసారి’’ (తన పట్ల అనాసక్తుడైన భర్త బాధలో పాలుపంచుకోవాలని ఆరాటపడుతుంది), ‘‘మంచి కుటుంబం’’, (పిల్లల పెళ్లివేళ భర్తకు మరో భార్య ఉందని తెలిసి ఆమెకై వెతికి ఆమె తన చెల్లెలే అని తెలుసుకుంటుంది).. యిలా. భర్త దురలవాట్ల కారణంగా స్వార్థపరురాలై పోయిన వదినగా ‘‘ఉండమ్మా బొట్టు పెడతా’’లో వేశారు. ఇక ‘‘డాక్టర్ చక్రవర్తి’’ అయితే అల్టిమేట్. భర్త పట్ల పొజెసివ్‌నెస్‌తో మూర్ఖంగా హీరోయిన్ కాపురంలో చిచ్చుపెట్టిన భార్యగా చాలా బాగా ఒప్పించారు.

ఇవన్నీ ఒక యెత్తు, ‘‘పుదియ పరవై’’ (1964)లో వేసిన క్లబ్ సింగర్ పాత్ర రెండెత్తులు. తన పాట విని యిష్టపడి పెళ్లి చేసుకున్న ఒక మంచివాణ్ని తన వ్యసనాలతో, తన ప్రవర్తనతో విసిగించి, అతనిలోని కోపాన్ని వెలికితీస్తుంది. అతను కొట్టిన చెంపదెబ్బకు చచ్చిపోతుంది. దాన్ని అతను యాక్సిడెంటుగా చూపించి తప్పించుకుంటే, పోలీసులకు అనుమానం వచ్చి, సాక్ష్యాలు లేకపోవడం చేత అదే పోలికలతో ఉన్న గూఢచారిణి ఒకామెను అతని జీవితంలోకి ప్రవేశపెడతారు. ఆమె అమాయకంగా కనబడుతూ ‘ఇతనే నా భర్త’ అంటుంది. కాదుకాదని అంటూనే చివరకు అతను తన నేరాన్ని ఒప్పుకుంటాడు. ఈ రెండు పాత్రల్లోనూ జానకి నటన చిరస్మరణీయం. గ్లామరస్ డాన్సర్‌గా ఆమె తళుక్కుమన్నారు.

ఈ మహానటికి, ధీరమహిళకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆవిడ నటవైవిధ్యాన్ని చూపడానికి, బుచ్చమ్మగా వేసిన ‘‘కన్యాశుల్కం’’లో సీను  ‘‘అక్కాచెల్లెలు’’లోని పాండవులు తుమ్మెద పాట  ‘‘పుదియ పరవై’’ లోని ‘పార్త జ్ఞాపకం..’ పాట లింకులు యిస్తున్నాను. వీలుంటే చూడండి. (ఫోటో – (క్లాక్‌వైజ్) కన్యాశుల్కం, కావ్యతలైవి, పుదియ పరవై, ఎదిర్ నీచల్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]