చున్నీ లాగ‌డంపై…. బాబు స్పందించ‌రా?

మాజీ మంత్రి అఖిల‌ప్రియ త‌న చున్నీని సొంత పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి లాగ‌డం వ‌ల్లే ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనై దంతాలు ఊడిపోయేలా కొట్టార‌ని గ‌ర్వంగా చెబుతున్నారు. నంద్యాల‌లో లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించిన…

మాజీ మంత్రి అఖిల‌ప్రియ త‌న చున్నీని సొంత పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి లాగ‌డం వ‌ల్లే ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనై దంతాలు ఊడిపోయేలా కొట్టార‌ని గ‌ర్వంగా చెబుతున్నారు. నంద్యాల‌లో లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించిన సంద‌ర్భంలో టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల‌ప్రియ అనుచ‌రులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో అఖిల‌ప్రియ జైలుకెళ్లి వ‌చ్చారు.

బెయిల్‌పై విడుద‌లైన అఖిల‌ప్రియ ప్ర‌తిరోజూ మీడియాతో మాట్లాడుతున్నారు. త‌న చున్నీ లాగి అవ‌మానించిన ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. అలాగే త‌న‌కు జ‌రిగిన ప‌రాభ‌వంపై ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంటింటికి వెళ్లి ప్ర‌జ‌ల‌కు చెబుతాన‌ని ఆమె అంటున్నారు. మ‌హిళ‌ల‌ను ఎవ‌రు అవ‌మానించినా క్ష‌మించ‌రాని నేర‌మే. అయితే అఖిల‌ప్రియ ఎవ‌రిపై ప్ర‌చారం చేయాల‌నుకుంటోంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

అఖిల‌ప్రియ చెప్పింది నిజ‌మే అయితే ఆమెను టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అవ‌మానించారు. అలాంట‌ప్పుడు ఏవీ సుబ్బారెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ఒత్తిడి తేవాలి. మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన ఏవీ లాంటి నాయ‌కుడిని పార్టీ నుంచి త‌రిమేసే వ‌ర‌కూ ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ద్ద ఆందోళ‌న చేయాలి. ఆ ప‌ని చేయ‌కుండా వైసీపీ నేత‌లు, పోలీసుల‌పై నోరు పారేసుకుంటే వ‌చ్చే లాభం ఏంటి?

మ‌రోవైపు నంద్యాల‌లో ఏవీ, అఖిల‌ప్రియ వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌కు సంబంధించి టీడీపీ త్రిమెన్ క‌మిటీని నియ‌మించింది. అఖిల‌ప్రియ ఆరోపించిన‌ట్టు ఆమె చున్నీని ఏవీ లాగ‌లేద‌ని నివేదిక ఇచ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కానీ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలైన అఖిల‌ప్రియ ప్ర‌తిరోజూ మీడియా ముందుకొచ్చి… నా చున్నీ లాగాడు, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తుంటే, టీడీపీ అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

ఓ మ‌హిళా నాయ‌కురాలు త‌న పార్టీ నాయ‌కుడిపై తీవ్ర ఆరోప‌ణ‌లు  చేస్తుంటే చంద్ర‌బాబు, లోకేశ్ స్పందించ‌క‌పోవ‌డం బాధ్య‌తాయుత నాయ‌క‌త్వం అవుతుందా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. నిజానికి ఆమె ప్ర‌శ్నిస్తున్న‌ది, నిల‌దీస్తున్న‌ది కూడా టీడీపీ నాయ‌కత్వాన్నే అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికైనా అఖిల‌ప్రియ చున్నీ గొడ‌వ‌కు చంద్ర‌బాబు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవ‌స‌రం వుంది. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రిని అవ‌మానించిన ఏవీపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే, త‌మ‌ను ఎలా ప్ర‌శ్నిస్తార‌ని ప్ర‌త్య‌ర్థుల నుంచి నిల‌దీత‌లు ఎదుర‌య్యే ప్ర‌మాదం వుంది. అఖిల‌ప్రియ‌, ఏవీ మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించ‌క‌పోతే రానున్న రోజుల్లో నంద్యాల జిల్లాలో టీడీపీకి మ‌రింత డ్యామేజీ క‌లుగుతుంద‌నే ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది.