బాబు, జ‌గ‌న్ మ‌ధ్య‌ తేడా ఇదే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా గుర్తించొచ్చు. ఏదైనా కొత్త‌గా చేయాల‌ని, ప్ర‌త్య‌ర్థి పార్టీ ఆలోచ‌న‌లు, ప‌థ‌కాల‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా త‌న‌దైన సొంత ముద్ర…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా గుర్తించొచ్చు. ఏదైనా కొత్త‌గా చేయాల‌ని, ప్ర‌త్య‌ర్థి పార్టీ ఆలోచ‌న‌లు, ప‌థ‌కాల‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా త‌న‌దైన సొంత ముద్ర వేయాల‌నేది ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం. కానీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు మాత్రం ప‌ది ఓట్లు వ‌స్తాయ‌నుకుంటే ఎవ‌రినైనా కాపీ కొట్టేందుకు వెనుకాడ‌ని నైజం. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీడీపీ మొద‌టి మేనిఫెస్టోను చెప్పుకోవ‌చ్చు.

భ‌విష్య‌త్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ మొద‌టి విడ‌త మేనిఫెస్టోను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి, అలాగే అడ‌బిడ్డ నిధి, రైతు భ‌రోసా ప‌థ‌కాలు వేరే పేర్ల‌తో చోటు చేసుకోవ‌డం విశేషం. అలాగే కర్నాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల తీసుకొచ్చిన ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌లకు ఉచిత ప్ర‌యాణ ప‌థ‌కం కూడా వుంది. చంద్ర‌బాబు దేశంలోని వివిధ పార్టీల మేనిఫెస్టోల‌ను ప‌రిశీలించి, అందులో జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి, టీడీపీ మేనిఫెస్టోగా ప్ర‌క‌టించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే… అస‌లు చంద్ర‌బాబు ఉనికిని గుర్తించ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అది పాల‌నైనా, ప‌థ‌కాలైనా, ఏవైనా కావ‌చ్చు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ఏ ఒక్క ప‌థ‌కాన్ని ఆయ‌న కొన‌సాగించ‌క‌పోవ‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌. ఇది మంచా, చెడా అనేది కాసేపు ప‌క్క‌న పెడితే, వైఎస్ జ‌గ‌న్ నైజాన్ని అర్థం చేసుకోడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జావేదిక కూల్చేశారు. అలాగే అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి అంద‌రికీ తెలిసిందే.

చంద్ర‌బాబు 14 ఏళ్ల పాల‌న‌లో ఏ ఒక్క‌టీ త‌న‌దంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకునేలా ఒక్క ప‌థ‌కాన్ని కూడా తీసుకురాలేదు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ ఎన్నో రోజులు క‌స‌ర‌త్తు చేసి న‌వ‌ర‌త్నాల పేరుతో మేనిఫెస్టోను తీర్చిదిద్దారు. వాటిపై విమ‌ర్శ‌లు, సానుకూల అంశాలున్నాయి. సంక్షేమ ప‌థ‌కాల‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల‌పై చంద్ర‌బాబు, లోకేశ్‌తో పాటు టీడీపీ నాయ‌కులు, ఆ పార్టీ అనుకూల మీడియా ప్ర‌తినిధులు ర‌క‌ర‌కాలుగా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్ సంక్షేమ పాల‌న వ‌ల్ల ఏపీ శ్రీ‌లంక‌, వెనుజులా, పాకిస్తాన్‌, ఆప్ఘ‌నిస్తాన్ అవుతుంద‌ని భారీ విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఎన్నిక‌ల్లో ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డానికి చివ‌రికి చంద్ర‌బాబు త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌నే ఆశ్ర‌యించాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నాయ‌కులే, ఏ మాత్రం సిగ్గుప‌డ‌కుండా త‌మ‌కు అధికారం ఇస్తే అవే ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని హామీలివ్వ‌డం చంద్ర‌బాబుకే చెల్లింది.

ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీలు ఇచ్చార‌నే విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా… సంప‌ద సృష్టించి ప్ర‌జ‌ల‌కు సంక్షేమ పాల‌న అంద‌జే స్తామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. క‌నీసం రెండు సంక్షేమ ప‌థ‌కాల‌ను కొత్త‌గా కనిపెట్ట‌లేక‌, జ‌గ‌న్‌ను అనుస‌రిస్తున్న‌ చంద్ర‌బాబు నాయ‌క‌త్వం ….సంప‌ద సృష్టిస్తానంటే న‌మ్మేదెలా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వాల్సి వుంటుంది. చంద్ర‌బాబు విజ‌న‌రీ అనే గొప్ప‌ల‌న్నీ ఉత్తుత్తిదే అని తాజా మేనిఫెస్టోతో తేలిపోయింది.

జ‌గ‌న్ పాల‌న‌లో లోపాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ జ‌గ‌న్ తీసుకొచ్చిన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌లేని ప‌రిస్థితిని తీసుకొచ్చారు. అలాగే వ‌లంటీర్లపై అవాకులు చెవాకులు పేలిన నోళ్లు, వారిని కొన‌సాగిస్తామ‌ని చెప్పుకోవాల్సి వ‌స్తోంది. ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే ఒక్క‌టంటే ఒక్క టీడీపీ ప‌థ‌కాన్ని కూడా జ‌గ‌న్ కాపీ అనే మాటే వుండ‌దు. చంద్ర‌బాబుకు మాత్రం అలాంటివేవీ ఉండ‌వు. రానున్న రోజుల్లో అమ్మ ఒడి, ఆడ‌బిడ్డ నిధి, స‌చివాల‌య వ్య‌వ‌స్థ లాంటివ‌న్నీ చంద్ర‌బాబు మేధో సృష్టే అని ప్ర‌చారం చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు. ఎవ‌రో అద్భుతాలు సృష్టిస్తే… మేడ్ బై చంద్ర‌బాబు/టీడీపీ అని ప్ర‌చారం చేసే బాప‌తు వారిది.