ఆలోచన భేష్! ఆచరణే అసలు సవాలు!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లకు ఒక ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. పార్టీని పట్టుకుని దశాబ్దాలుగా వేళ్లాడుతూ, ‘సీనియర్ నాయకులు’ అనే బోర్డు మెడలో తగిలించుకుని, తమకు ప్రాధాన్యం దక్కాల్సిందేనని, తమ మాట చెల్లాల్సిందేనని ఎగబడుతూ…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లకు ఒక ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. పార్టీని పట్టుకుని దశాబ్దాలుగా వేళ్లాడుతూ, ‘సీనియర్ నాయకులు’ అనే బోర్డు మెడలో తగిలించుకుని, తమకు ప్రాధాన్యం దక్కాల్సిందేనని, తమ మాట చెల్లాల్సిందేనని ఎగబడుతూ ఉండే ప్రజాదరణ లేని నాయకులను పక్కన పెట్టాలని డిసైడ్ అయింది. 

పార్టీలో పెద్ద నాయకుడనే పేరు తప్ప, ప్రజల్లో దానికి తగిన ఆదరణ లేని వారిని ఎన్నికల బరిలోకి దించరాదని, వారి స్థానే ప్రత్యామ్నాయంగా యువనాయకులను మోహరించాలని భావిస్తోంది. ఇలాంటి వ్యూహం కాంగ్రెస్ కు చాలా మేలు చేస్తుంది. కానీ ఆచరణలో దీనిని అమలు చేయడం అసలే ముఠాకక్షలకు నిలయమైన ఆ పార్టీకి సాధ్యమేనా? కొత్త చిక్కులు రాకుండా ఉంటాయా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠా కక్షలకు, కుమ్ములాటలకు, నాయకుల మధ్య గోతులు తవ్వుకునే వైఖరులకు పెట్టింది పేరు. అలాంటి పార్టీని బాగుచేసి, అధికారం దిశగా నడిపించడానికి చేస్తున్న ఈ కొత్త ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందనేది ప్రశ్న!

సీనియర్లు అయిన అనేక మంది నాయకులు గత ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయి ఉంటే, పార్టీ చేయిస్తున్న సర్వేల్లో సీనియర్ల నియోజకవర్గాల్లో వారిపట్ల వ్యతిరకత కనిపిస్తోంటే వారికి ముందే సర్ది చెప్పి, మరొకరికి టికెట్ ఇవ్వడం ద్వారా గెలవాలని పార్టీ ఆలోచిస్తోంది. పార్టీ ప్రభుత్వంలోకి వస్తే.. వారికి ఏం చేయగలమో ముందే హామీ ఇచ్చి బుజ్జగించాలని అనుకుంటోంది. ఈ కేటగిరీలో చాలా మంది నాయకులే ఉంటారు. పార్టీ బుజ్జగించినంత మాత్రాన వారందరూ లొంగుతారా? అనేదే సందేహం. ఇప్పటినుంచే ఇతర పార్టీల్లోకి గెంతుతూ, సొంత పార్టీ ఓటమికి గోతులు తవ్వకుండా ఉంటారా? అనేది డౌటు!

పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి.. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మల్లు రవికి కూడా ఈసారి టికెట్ ఇవ్వకుండా మార్చాలని ఆలోచిస్తున్నారట. ఆయనను బుజ్జగించడం రేవంత్ కు సాధ్యం కావొచ్చు. కానీ, రేవంత్ పై ఎగిరి పడుతూ ఉండే.. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లు వెనక్కు తగ్గుతారా? సర్వేల తర్వాత వీహెచ్, దామోదర వంటి నాయకులు కూడా ప్రజాదరణలో వెనకబడ్డట్టుగా సర్వేల్లో తేలితే.. వారినందరినీ కూడా పక్కన పెట్టి.. వారి ఎదురుదాడిని, వారి సూటిపోటి మాటలను తట్టుకోవడం కాంగ్రెస్ పెద్దలకు సాధ్యమేనా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది. 

ఒక్కో నియోజకవర్గంలో రెండేసి గ్రూపులు ఉండి, ఆ ముఠాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులిద్దరూ టికెట్లు ఆశిస్తున్న చోట కూడా ఇప్పటినుంచే వారి మధ్య సయోధ్య కుదిర్చాలనేది పార్టీ ప్లాన్. కానీ, కాంగ్రెసు పార్టీలో దశాబ్దాల తరబడి సెగ్మెంట్లలో ఉండే ముఠాకక్షలకు ఇంత సింపుల్ గా మాటలతో సయోధ్య సాధ్యమేనా? అని పలువురు అనుకుంటున్నారు.