గీత దాటి అతి చేస్తున్న వైఎస్ సునీత!

కొత్త కొత్త కోణాల్లో కోర్టులో పిటిషన్లు వేయడంలో ఆరితేరిపోయిన వైఎస్ సునీతా రెడ్డి ఇప్పుడు మరో విచిత్రమైన వాదనతో కోర్టులో మెమో దాఖలు చేశారు. సునీతారెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డికి కూతురు. తన తండ్రి…

కొత్త కొత్త కోణాల్లో కోర్టులో పిటిషన్లు వేయడంలో ఆరితేరిపోయిన వైఎస్ సునీతా రెడ్డి ఇప్పుడు మరో విచిత్రమైన వాదనతో కోర్టులో మెమో దాఖలు చేశారు. సునీతారెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డికి కూతురు. తన తండ్రి హత్యకు గురయ్యాడనే ఆరోపణలతో నిందితులను తేల్చాలని ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన మెమో.. ఆమె ఆశించే ప్రయోజనాల గురించి అనుమానాలు కలిగించేలా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డిని హత్యకు సూత్రధారిగా రంగుపులిమి శిక్ష పడేలా చేయడానికి సునీత రెడ్డి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణకు హాజరవుతున్న క్రమంలో, ఇటీవలి అవినాష్ తల్లి గుండెపోటుకు గురికావడం, ఆమెను కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచడం జరిగింది. తల్లికి చికిత్స జరుగుతున్న కారణంగా.. కొన్ని రోజులు విచారణనుంచి మినహాయింపు కావాలని కూడా అవినాష్ అడగడం జరిగింది.

అయితే ఇప్పుడు సునీత రెడ్డి తాజాగా దాఖలు చేసిన మెమోలో అవినాష్ తల్లికి శస్త్ర చికిత్స జరగనేలేదని, సర్జరీ జరుగుతున్నట్టుగా ఆయన కోర్టుకు అబద్ధం చెప్పారని, కాబట్టి ఆయన మీద కోర్టు చర్యలు తీసుకోవాలనేది ఆమె తాజా విజ్ఞప్తి.

అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సంగతి గమనించాల్సి ఉంది. తండ్రిని హత్య చేశారనే బాధ సునీత కు ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. తండ్రిని చంపిన వారిని కటకటాల వెనక్కు పంపి తీరుతానని ఆమె ప్రతిజ్ఞ తీసుకుని ఉండవచ్చు. పోరాటం సాగిస్తోంది. అంతవరకు ఆమెను సమర్థించే వారు కూడా అనగలరు. కానీ అవినాష్ రెడ్డి తల్లికి వారు చెప్పినట్టుగా శస్త్రచికిత్స జరగలేదు గనుక- చర్యలు తీసుకోవాలని సంబంధంలేని విషయంలో డిమాండ్ చేయడం మరీ హేయంగా ఉంది.

ఎందుకంటే- ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు డాక్టరు శస్త్రచికత్స అవసరం అని చెప్పి ఉండొచ్చు.. ఆ సమయానికి అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు ఆమేరకు విన్నవించి ఉండవచ్చు. ఒకటో రెండో రోజుల ట్రీట్మెంట్ తరువాత సర్జరీ అవసరం లేదని డాక్టరు భావించి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు అనూహ్యం కాదని స్వయంగా పెద్ద డాక్టరు అయిన సునీతకు తెలియని సంగతి కాదు. పైగా అక్కడ సర్జరీ జరిగిందా లేదా అనేది వివేకా హత్య కేసుతో సంబంధం లేని సంగతి. అయినా సరే.. ఏదో అవినాష్ ను చికాకు పెట్టడమే తన జీవితాశయం అన్నట్టుగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని సుజాత కోరడం చిత్రమైన సంగతి.

వైఎస్ సునీతా రెడ్డికి రాజకీయ వాంఛలు ఉన్నాయని, అందుకే ఆమె పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ ను, తనకు పోటీ కాగల అవినాష్ రెడ్డిని వీలైనంత బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి. ఆమె ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తే గనుక.. ఆమె రాజకీయ కుత్సిత కోరికలు నిజమే అనుకోవాల్సి వస్తుంది.