ఉత్తరప్రదేశ్ మైనార్టీ ఓటర్లను తప్పక మెచ్చుకోవాలి. మతం పేరుతో ప్రలోభ పెట్టే నాయకుడి తిక్క కుదిర్చారు. కేవలం మతం ప్రాతిపదికన విస్తరించాలనుకున్న నాయకుడి చేష్టలను తిప్పి కొట్టారు. మతం కంటే విశాలమైంది తమ విజ్ఞత అని ఓటుతో చాటి చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ -ఎ-ఇత్తెహాదుల్ -ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ మతం ఆటలు సాగలేదు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొచ్చినట్టుగానే, ఉత్తరప్రదేశ్‌లో కూడా ముస్లింలు ఎంఐఎంను ఆదరిస్తారని అసదుద్దీన్ ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 403 స్థానాలకు గాను 100 సీట్లలో ఎంఐఎం పోటీ చేసింది. ఇది కూడా మైనార్టీ ఓటర్లు బలంగా ఉన్న ప్రాంతాల్లోనే కావడం విశేషం. బీజేపీకి బి టీంగా ఎంఐఎం పోటీ చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి.
మైనార్టీల ఓట్లను చీల్చి, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే అసదుద్దీన్ తన పార్టీ తరపున అభ్యర్థులను నిలిపారనే విమర్శలొచ్చాయి. ఎన్నికల ప్రచారం సందర్భంలో అసదుద్దీన్‌పై కాల్పులు జరగడం కూడా ఎంఐఎం, బీజేపీ కుట్ర రాజకీయాల్లో భాగమే అనే విమర్శలొచ్చాయి. సానుభూతితో మొత్తం ముస్లిం మైనార్టీ ఓటర్లను తన వైపు తిప్పుకునే కుట్రలో భాగంగానే కాల్పుల నాటకాన్ని రక్తి కట్టించారనే విమర్శలు రావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మరోసారి బీజేపీనే అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఇక్కడ సంతోషించా ల్సిన విషయం ఏంటంటే … ముస్లిం ఓటర్లు ప్రదర్శించిన విజ్ఞత అద్భుతం. మతం పేరు చెప్పుకుని ఓట్లను కొల్లగొట్టాలని ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన అసదుద్దీన్‌కు మైనార్టీలు నిరాకరణతో గట్టి బుద్ధి చెప్పారు. 100 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలుపొందలేదు.
మజ్లిస్‌కు కేవలం 0.43 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అసదుద్దీన్ కుట్రలను ముస్లిం మైనార్టీలు గుర్తించి, దూరం పెట్టారని ఈ ఫలితాలే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ మైనార్టీ ఓటర్ల తీర్పుతో మరో చోట మత రాజకీయాలు చేయడానికి అసదుద్దీన్ ధైర్యం చేయకపోవచ్చు.