సినిమా టికెట్ల కోసం థియేటర్ల యజమానులకు నగర మేయర్ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా చూడాలనే కోరిక బలంగా ఉంటే, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడమో లేక థియేటర్లకు వెళ్లి టికెట్లు కొని సరదా తీర్చుకోవచ్చు. ఇవేవీ చేయకుండా 100 టికెట్లను చాంబర్‌కు పంపాలని మేయర్ కోరడం విమర్శలకు తావిస్తోంది. ఉచితంగా పంపాలని కోరకపోయినా, చిన్న విషయాలపై లేఖ రాయడం చూసి… ఇంత అజ్ఞానం ఏందమ్మా తల్లి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ నగర మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. పాలనపై దృష్టి సారించి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఎందుకంటే విజయవాడ నగరమనేది రాష్ట్ర రాజధాని కేంద్రమనే చెప్పుకోవాలి. అలాంటి నగరానికి ప్రథమ పౌరురాలిగా భాగ్యలక్ష్మి బాధ్యతగా నడుచుకోవాలి.
కొత్తగా విడుదలైన సినిమా ప్రతి షోకు 100 టికెట్లను తన చాంబర్‌కు పంపాలని నగరంలోని మల్టీఫ్లెక్స్ థియేటర్ యజమానులకు మేయర్ హోదాలో రాయన భాగ్యలక్ష్మి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు కొత్త సినిమా టికెట్లు కావాలని ఒత్తిడి తీసుకొస్తున్నందున, ప్రతి షోకు తమకు వంద టికెట్లు కేటాయించాలని ఆమె కోరారు.
టికెట్లకు డబ్బులు చెల్లిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇదేదో మాటగా చెబితే సరిపోయేది కదా. ఈ మాత్రం దానికి లేఖ రాయడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయాలంటే తెలియకపోవడం వల్లే ఇలాంటి పనులు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
నగరంలో పరిష్కరించాల్సిన బోలెడు సమస్యలుంటే, వాటి గురించి పట్టించుకోకుండా సినిమా టికెట్లపై లేఖలు రాయడం ఏంటనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా విడులయ్యే సినిమాలు చూడాలనే కోరిక ఉన్న వాళ్లు, ఆ ఏర్పాట్లు వాళ్లే చూసుకుంటారని, అలాంటివి ఈమెకు ఎందుకని సొంత పార్టీ వాళ్లే ప్రశ్నిస్తుండడం గమనార్హం.