కేజ్రీవాల్… పంజాబ్‌లో ఆప్ ఘన విజయంతో మరోసారి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మోదీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఏకైక నాయకుడు. విశాల భారతావనిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించడం కేజ్రీ వాల్ సాధించిన అసాధారణ విజయంగా చెప్పొచ్చు. మన దేశంలో రాజకీయాలు కులం, మతం, డబ్బు చుట్టూ తిరుగుతుంటే, అందుకు భిన్నంగా నీతి, అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా ఓటర్ల మనసులను గెలుచుకోవడం చిన్న విషయం కాదు.
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరలించాలని ఆలోచిస్తున్న వాళ్లకు కేజ్రీవాల్ ఓ రోల్ మోడల్. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని పదేపదే చెప్పుకునే పవన్‌కల్యాణ్ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. 2012లో కేజ్రీవాల్ ఆప్‌ను స్థాపించారు. దాని గుర్తు చీపురు. 2013లో మొదటిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేసింది. కాంగ్రెస్, బీజేపీలు ఆప్‌ను లైట్ తీసుకున్నాయి. కానీ 70 స్థానాలకు గాను 28 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించి, జాతీయ పార్టీలను ఖంగుతినిపించింది.
కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ పదవి 49 రోజుల ముచ్చటే అయ్యింది. ఈ నేపథ్యంలో 2015లో మరోసారి ఢిల్లీలో తన పార్టీ అదృష్టాన్ని పరీక్షకు పెట్టారు. ఈ సారి ఢిల్లీ ఓటర్లు ఆప్‌నకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఏకంగా 70కి 67 సీట్లు కట్టబెట్టారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలుకు శ్రీకారం చుట్టారు. ఉచిత విద్య, వైద్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో రాయితీలు తదితర సౌకర్యాలు కల్పించారు. 2020లో మళ్లీ ఢిల్లీ ప్రజల హృదయాలను ఆయన గెలుచుకున్నారు. 70కి 62 స్థానాల్లో ఆప్ గెలుపొందింది. ఇప్పుడు పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుని కేజ్రీవాల్ దేశ ప్రజల మనసులను చూరగొన్నారు.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ఆర్భాటంగా ప్రకటించిన పవన్‌కల్యాణ్ చేసింది, చేస్తున్నదేంటి? 2014లో జనసేనను స్థాపించారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికి, అధికారంలోకి వచ్చేందుకు కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత 2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసి ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాను రెండు చోట్ల నిలిచి, కనీసం ఒక్క చోట కూడా గెలవలేనంతగా ప్రజావ్యతిరేకతను చవి చూడాల్సి వచ్చింది. ఇదంతా స్వయంకృతాపరాధమే. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు.
జగన్‌పై ద్వేషం, చంద్రబాబుపై అకారణ ప్రేమే పవన్‌కల్యాణ్ రాజకీయ పతనానికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. ప్రజల మనసులను చూరగొనేందుకు ఇప్పటికైనా తన రాజకీయ పంథాను పవన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే వచ్చానంటూ పవన్ చెప్పడంతో సరిపోదు. ముందు తనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. తమ కోసమే ప్రజలు రాజకీయాల్లోకి వచ్చారని ప్రజలు విశ్వసించేలా నడుచుకోవాలి. అందుకు ఎంతో శ్రమించాలి.
జగన్‌ను సీఎం కాకుండా చేయడానికో, చంద్రబాబుకు అధికారం తేవడానికో పవన్ రాజకీయాలు చేయకూడదు. అంతిమంగా ప్రజల శ్రేయస్సే కేంద్రంగా పవన్ ముందుకు సాగాలి. ఇదే కేజ్రీవాల్ నుంచి పవన్ నేర్చుకోవాల్సిన గుణపాఠం. తప్పులు చేయడం తప్పు కాదు. వాటిని సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం. ఈ నెల 14న నిర్వహించే బహిరంగ సభ తనలోని లోపాలను సరిదిద్దుకునే వేదిక కావాలి. అలాగే ప్రజలకు ఓ భరోసా ఇవ్వాలి.
ఇదంతా చెప్పడం ఎందుకంటే పవన్ మంచి మనిషి కాబట్టి. కొన్ని బలహీనతలను అధిగమిస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం కోరుకునే ఆదర్శ నాయకుడు అవుతారనే ఆశతో…