పృష్ట తాడనాత్ దంత భంగః అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపు మీద తంతే మూతి పళ్లు రాలాయని దాని అర్థం. ఎక్కడో వీపు మీద తంతే.. మూతి పళ్లు ఎందుకు రాలుతాయి? అని లాజిక్ అడగకూడదు. కానీ.. అలాగే జరుగుతుందని స్వానుభవంలో తెలుస్తుంది. ఇప్పుడు అదే సామెత గుర్తుకొస్తోంది.
ఎక్కడో యూపీలో, ఉత్తరాఖండ్ లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటే.. ఏపీలో పార్టీ నాయకులు మురిసిపోయి ఎందుకు స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఎందుకంటే అదంతే! ఆ మురిసిపాటును ప్రదర్శించుకోవడం కూడా ఒక రాజకీయ ప్రచార టెక్నిక్! తమ పార్టీ చాలా చాలా బలపడిపోతోందని.. ప్రజలు అనుకునేలా చేసే టెక్నిక్! చక్కగా స్వీట్లు తినిపించుకోవచ్చు.. అందుకు తగిన రీతిలో వారికి విజయాలు దక్కాయి. అయిదింట నాలుగుచోట్ల గద్దె ఎక్కబోతున్నారు. మరి మురిసిపాటు ఎందుకు దాచుకుంటారు.?
కాకపోతే ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. ఇలా ఎక్కడో పార్టీ గెలుస్తూ ఉంటే స్వీట్లు పంచుకోవడం మాత్రమేనా.. ఏపీలో కూడా పార్టీని గెలిపించడానికి తగినంత కృషి చేసేది ఏదైనా ఉందా? అని!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు బీజేపీ శల్యావశిష్టంలాగా మిగిలిఉన్నదనే సంగతి అందరికీ తెలుసు. అంటే, పార్టీఅనే ట్యాగ్ లైన్ తో చెప్పుకోడానికి, నాయకులు పార్టీ జెండాలు పెట్టుకున్న కార్లలో తిరగడానికి అది పార్టీ మాత్రమే తప్ప.. ప్రజల్లో దానికి ఉన్న ఆదరణ సున్నా!.
ఆ సంగతి వారికి చాలా స్పష్టంగా తెలుసు. ఇటీవలి కాలంలో ఎన్నికలు కూడా ఆ విషయాన్ని పదేపదే నిరూపించాయి. గెలిచి తీరుతాం అని సవాలు చేసి బరిలోకి దిగిన ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా భంగపడడం ఏపీ బీజేపీకి మాత్రమే చెల్లిన విద్య.
ఇంత దారుణమైన పరిస్థితిలో ఆ పార్టీ ఎందుకున్నదో కూడా వారికి తెలుసు. విభజన తర్వాత.. ఎన్నికల నాడు బోలెడు వరాలు గుప్పించి- ప్రత్యేక హోదా దగ్గరినుంచి అనేక రూపాల్లో మోడీ సర్కారు ఎంత వంచించిందో వారికి తెలుసు. అంత దారుణమైన వంచనను తెలుగు ప్రజలు మరచిపోగలరని వారు అనుకుంటే భ్రమ.
కనీసం దానికి పరిహారంగా.. కేంద్రం నుంచి కొత్త వరాలైనా ఏపీకి దక్కేలా వారు ప్రయత్నించాలి. ఏపీని కేవలం ఒక ఓటు బ్యాంకు రాష్ట్రంగా మోడీ చూడడం లేదని, ఏపీ పట్ల కూడా మోడీ సర్కారుకు ప్రేమ ఉన్నదని వారు నిరూపించగలగాలి. అలా చేయలేనప్పుడు.. జీవితపర్యంతమూ.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకోవడమే తప్ప.. ఇక్కడ సీట్లు గెలవడం వారికి సాధ్యం కాదు!!