తెలుగుదేశం పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ బతికే ఉంటుందా.. తెలంగాణలో మాదిరిగా అంతర్ధానమైపోతుందా? అనేది వారందరిలో మెదలుతున్న భయం. చంద్రబాబునాయుడు పుత్రవాత్సల్యం.. యావత్తు పార్టీని సర్వనాశనం చేసేస్తుందేమోనని భయపడుతున్నారు.
చంద్రబాబునాయుడు గోడమీద పిల్లిలాగా.. అటూ ఇటూ కాకుండా మాట్లాడుతూ ఉన్నంత కాలం పార్టీని ప్రజలు నమ్మరని.. రాజకీయంగా ఒక స్పష్టమైన విధానానికి రావాలని.. కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు కోరుతున్నారు. పవన్ కల్యాణ్, బీజేపీ పట్ల అర్థం పర్థం లేని మెతకవైఖరిని అవలంబిస్తూ.. కేవలం జగన్ మోహన్ రెడ్డి మీద మాత్రమే విరుచుకుపడుతూ ఉంటే.. పార్టీకి సర్వనాశనం తప్పదని అందరూ హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబునాయుడు పేరుకు తాను నలభై నాలుగేళ్ల సీనియారిటీ ఉన్న తిరుగులేని నాయకుడిని అని చెప్పుకుంటూ ఉంటారు గానీ.. రాజకీయంగా ఏదైనా వివాదాస్పదమైన విషయం తెరమీదకు వచ్చినప్పుడు.. ఆయనంత పిరికివాడు మరొకడు ఉండరు. డొంకతిరుగుడు, అస్పష్ట విధానాలను ఆశ్రయిస్తూ.. స్పష్టంగా తమ విధానం ఏంటో చెప్పడం వలన రెండో వర్గానికి దూరం అవుతామనే పిచ్చి భయాలతో ఆయన పార్టీని పాతర పెట్టేస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ బలంగా వినిపిస్తున్నప్పుడు.. ఈ సీనియర్ నాయకుడు.. తనది రెండు కళ్ల విధానం అన్నారు. తెలంగాణ, ఆంధ్ర రెండూ తనకు రెండు కళ్లు అన్నాడు. అంతే తప్ప.. రాష్ట్ర విభజన జరగాలా? వద్దా? ఏ సంగతీ తన అభిప్రాయం తేల్చి చెప్పలేదు. అంతరంగంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేకోరిక, అలా చెబితే- తెలంగాణలో తమ పార్టీ బతికి బట్టకట్టదని భయం! ఈ డొంకతిరుగుడు మాటలు చెప్పారు. అలాంటి అవకాశవాద మాటల వలన ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజనను ఆయన ఆపలేకపోయారు. అదే సమయంలో.. తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.
ఇప్పుడు ఏపీ రాజకీయాల విషయంలో అదే తరహా గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారు. జనసేన, పవన్ కల్యాణ్ పొత్తు లేకుండా తాను నెగ్గలేనని ఆయన భయం. నిర్ణయాత్మకతలేని, పైపై మాటల, పంచ్ డైలాగుల పవన్ కల్యాణ్ ఒక నాయకుడిగా ప్రజలకు, రాష్ట్రానికి ఏమీ చేయలేడనే సంగతి మాట్లాడాలంటే భయం. పవన్‌తో జట్టు కట్టి కులం ఓట్లు వేయించుకోవాలని కోరిక.
అలాగని ఆ విషయం పైకి చెప్పలేరు. బీజేపీ అంటే ద్వేషం. కానీ.. దేశంలో మోడీ హవా చూస్తూ చూస్తూ.. బీజేపీని పల్లెత్తు మాట అంటే.. మళ్లీ వారితో అవసరం పడుతుందేమో అని భయం. బీజేపీతో పొత్తుల్లో ఉన్న పవన్ ను బయటకు తీసుకురావడం కుదురుతుందా? అనం శంక! పవన్ ను పావుగా వాడుకుని, 2014లాగా బీజేపీ–జనసేన–టీడీపీ కూటమిగా పోటీచేసి.. జగన్ ను ఓడించడానికి అందరినీ కలుపుకోవాలని అత్యాశ! ఇన్ని భయాల మధ్య ఆయన పార్టీ విధానం ఏంటో తేల్చకుండా నష్టం చేస్తున్నారనేది పార్టీ శ్రేణుల భావన.
ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కూడా బీజేపీతో కలిసి అడుగులు వేయగలం.. వారిని తన జట్టులోకి తెచ్చుకోగలం అని నమ్మితే చంద్రబాబు పార్టీని ముంచేస్తాడని వారు అనుకుంటున్నారు. బిజెపి తమను దగ్గరకు రానివ్వదనేది వారి నమ్మకం. బిజెపి మీద ఆశలు వదలుకుని, పవన్ ను చంకకెత్తుకునే అతి తెలివి విడిచిపెట్టి.. చావో రేవో సొంతంగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా తయారుకావాలని వారు ఆశిస్తున్నారు.