ఇవి నాదెండ్ల మార్క్ చీప్ ట్రిక్స్ అనుకోవాలా?

డబ్బున్నవాళ్ల దగ్గర చందాలు తీసుకోకుండా.. ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించడం లేదు. అదే సమయంలో– ఖర్మగాలి అధికారంలోకి వస్తే గనుక.. డబ్బున్న వాళ్లకి ఎంతో కొంత ఊడిగం…

డబ్బున్నవాళ్ల దగ్గర చందాలు తీసుకోకుండా.. ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించడం లేదు. అదే సమయంలో– ఖర్మగాలి అధికారంలోకి వస్తే గనుక.. డబ్బున్న వాళ్లకి ఎంతో కొంత ఊడిగం చేయకుండా కూడా ఏ పార్టీ అధికారంలో నిలబడడం లేదు. కాబట్టి.. పార్టీల కార్యక్రమాలకు చందాలెత్తడం తప్పు కాదు. కాకపోతే.. ఒక్కొక్కరూ ఒక్కొక్క రూపంలో చందాలెత్తుతుంటారు. 

సాధారణంగా పార్టీ పట్ల, పార్టీ నాయకుడి పట్ల (పార్టీ సిద్ధాంతాల పట్ల అనే పదం చెప్పుకోడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఇవాళ్టి రోజుల్లో ఏ పార్టీలకూ సిద్ధాంతాలే ఉండడం లేదు కాబట్టి) ప్రేమ, అభిమానం ఉండేు సంపన్నుల బ్యాచ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా.. చందాలు తీసుకుంటారు. పైగా రాజకీయ పార్టీలు చందాలు వైట్ మనీలో మాత్రమే తీసుకోవాలనే నిబంధన కూడా లేదు. ఫలానా పార్టీకి ఎవరు ఫండింగ్ చేసి తెరవెనుకనుంచి దన్నుగా నిలిచి నడిపిస్తున్నారో.. కామన్‌గా అందరికీ తెలియకుండానే వ్యవహారం సాగిపోతుంటుంది. 

పవన్ కల్యాణ్ ఇప్పుడు వెరైటీగా ఓపెన్‌గా మంగళగిరి పార్టీ ఆవిర్బావ సభకు చందాలివ్వాలని కోరుతున్నాడు. పవన్ స్వయంగా పిలుపు ఇవ్వకపోయినా.. పవన్ సంతకం మినహా.. ఆయన తరఫున పార్టీ పనులన్నీ తనవే అయినట్టుగా చక్కబెట్టేస్తూ ఉండే నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా ఎన్ఆర్ఐలు అయిన పవన్ అభిమానులు పార్టీకి దండిగా విరాళాలు ఇవ్వాలంటూ ఓపెన్‌గా ఓ పిలుపు ఇచ్చారు. 

పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు సాయం అందించాలని ఎన్ఆర్ఐ జనసైనికులకు ఒక వీడియో సందేశంలో పిలుపు నిచ్చారు. పవన్ కల్యాణ్ చాలా సుద్దులు చెబుతూ ఉంటారు. పార్టీ నిర్వహణ కోసమే, పార్టీ వారికి తన సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం మాత్రమే తాను సినిమాలు చేస్తున్నానని పవన్ అంటూ ఉంటారు. 

ఒక్కో సినిమాకు యాభైకోట్ల రూపాయలు ప్లస్ వాటాలు తీసుకునే ఈ నటుడు.. ఒక్క సభ పెట్టాల్సి వచ్చేసరికి.. విదేశాల్లో కూడా చందాలు పోగేయాలని చూస్తుండడమే తమాషా. పవన్ కల్యాణ్ గతంలో భాగ్యనగరంలోని ఒక అయిదు నక్షత్రాల హోటల్లో తన కులానికి చెందిన పారిశ్రామికవేత్తల్ని, ప్రముఖుల్ని, సంపన్నులను అందరినీ పిలిచి.. అందరికీ విందు ఇచ్చి.. పార్టీకోసం విరాళాలు ఇవ్వాలని అడగడం వివాదాస్పదం అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 

గుట్టుచప్పుడు కాకుండా చందాలెత్తే ప్రయత్నం చేసి ఓసారి అభాసుపాలయ్యారు. ఇప్పుడు అధికారికంగా చందాలెత్తే పనిని నాదెండ్ల మనోహర్ తీసుకున్నట్టుంది. అందుకే.. ఎన్నారైల మీద ఫోకస్ పెట్టారు. 

ఎన్నారైలంటే.. వారి వద్ద బోలెడంత డబ్బు మూలుగుతూ ఉంటుందని, అడగ్గానే ఇచ్చేస్తారని చాలా మందికి ఓ అభిప్రాయం ఉంటుంది. వారికి డబ్బు చెట్లకు కాస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్ పార్టీ ఎన్నికల బరిలో నిజంగానే సీరియస్ గా ఉంటుందనే నమ్మకం కలిగితే.. టికెట్ల మీది ఆశతో డబ్బు కుమ్మరించడానికి ఎన్నారై అమాయకులు చాలామందే ఉంటారు. మరి.. ఇలాంటి చందాలు సేకరణ ట్రిక్స్ ప్రయోగించడం ద్వారా.. నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ ఆవిర్భావ సభ పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు పోగేయడానికి స్కెచ్ వేశారో వేచిచూడాలి.