గౌరవం.. కులాన్ని బట్టి దక్కదు డిప్యూటీ!

డిప్యూటీ ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణ స్వామి నిత్యశోకితుడు, నిత్యశంకితుడు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయననున అందలం ఎక్కించి ఉపముఖ్యమంత్రిగా గౌరవాన్ని కట్టబెడితే.. నిత్యం కులాల రంధిలో పడి ఎవరిమీదనో ఒకరి…

డిప్యూటీ ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణ స్వామి నిత్యశోకితుడు, నిత్యశంకితుడు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయననున అందలం ఎక్కించి ఉపముఖ్యమంత్రిగా గౌరవాన్ని కట్టబెడితే.. నిత్యం కులాల రంధిలో పడి ఎవరిమీదనో ఒకరి మీద పడి ఏడుస్తుంటారు. 

అంతగా నిత్య నైరాశ్యంలో ఉండే సాధారణ వ్యక్తులు కూడా మనకు కనిపించరు. నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు.. కొన్నిచోట్ల ప్రజలు నిలదీయడం సహజం. అలాగే నారాయణస్వామికి అలాంటి చేదు అనుభవాలు తన నియోజకవర్గంలో అనేకం ఎదురవుతుంటాయి. 

అలాంటి సందర్భాల్లో దళితులో, బీసీలో తనను నిలదీసినప్పుడు మొహం చాటేసి పలాయనం చిత్తగించే ఈ డిప్యూటీ సీఎం, యాదృచ్ఛికంగా తనను నిలదీసిన వారు రెడ్డి కులానికి చెందిన వారైతే మాత్రం.. ‘మీ రెడ్లు మమ్మ్నలి బతకనీయరు’ అంటూ సూటిపోటి మాటలు అంటారు. తన సొంత పార్టీలో రెడ్డి వర్గం నేతలతో ఆయన ఇబ్బంది పడుతున్నారో లేదా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా పాలన సాగిస్తున్నారు గనుక.. రాష్ట్రంలో రెడ్డి కులానికి చెందిన వారెవ్వరూ కూడా.. కనీసం ఎమ్మెల్యేలను నిలదీయడానికి అవకాశం లేదని ఆయన సిద్ధాంతీకరిస్తున్నారో తెలియదు.
 
కానీ నిత్యం కులం రంధిలో రెడ్ల మీద విమర్శలు చేస్తూ ఉండడం నారాయణ స్వామికి అలవాటు అయిపోయింది. తాజాగా ఆయన తమ జిల్లాలో ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అంటూ ఆడిపోసుకున్నారు. 

తనను పిలిచిన సమావేశంలో తనకు ఇరువైపులా రెడ్లే ఎక్కువగా కూర్చుని ఉన్నారంటూ.. ప్రత్యేకించి ఒక కులం మీద తన అక్కసు వెళ్లగక్కారు. అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉండడంతో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

అయినా, ప్రాధాన్యం గౌరవం అనేది కులాన్ని బట్టి రాదు.. నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నారు, తనను గెలిపించిన ప్రజలకు ఏం చేస్తున్నారు అనేదానిని బట్టి వస్తుంది. తన నియోజకవర్గంలో పేదలకు కొండలు గుట్టలు ఉన్న చోటనే ఇంటి స్థలాలు ఇచ్చారని అంటున్న నారాయణ స్వామి.. అలా జరగడం అనేది లోకల్ ఎమ్మెల్యేగా పూర్తిగా తన చేతగానితనంగా నిరూపణ అవుతుందని, తన వైఫల్యం అని ఎందుకు గుర్తించడం లేదో తెలియదు. 

జగన్ ఎంతో గౌరవంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే.. అది కూడా అమర్యాద అనుకుంటే రాజీనామా చేసి దిగిపోవాలి. అంతే తప్ప, అంతపెద్ద హోదాలో ఉంటూ.. ప్రజలకోసం నిర్దిష్టంగా పనిచేయకుండా.. తనకు ప్రాధాన్యం దక్కలేదని విలపించడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు.