వ్యూహం సినిమాలో చిరంజీవి ప్రస్తావన ఎందుకు?

వ్యూహం సినిమా ఎవరిపై తీస్తున్నారు.. అందులో కంటెంట్ ఏంటనే విషయాలపై అందరికీ ఓ అవగాహన ఉంది. మరీ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడంటే, అందులో ఏముంటుందో, ఎంత ఉంటుందో చాలామందికి తెలిసిన విషయమే.…

వ్యూహం సినిమా ఎవరిపై తీస్తున్నారు.. అందులో కంటెంట్ ఏంటనే విషయాలపై అందరికీ ఓ అవగాహన ఉంది. మరీ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడంటే, అందులో ఏముంటుందో, ఎంత ఉంటుందో చాలామందికి తెలిసిన విషయమే. “ఫ్రేములు ఎక్కువ, కంటెంట్ తక్కువ” అనే విమర్శ ఆల్రెడీ ఈ దర్శకుడిపై ఉంది.

అయితే ఇక్కడ పాయింట్ అది కాదు. వ్యూహం సినిమాలో చిరంజీవిని చూపించాడు వర్మ. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై, ప్రస్తుత రాజకీయాలపై సినిమాలు తీస్తూ, అందులో చిరంజీవిని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది?

చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. ఇకపై కూడా ఉండబోనని ఆయన ఎన్నోసార్లు విస్పష్టంగా ప్రకటించారు. రాజకీయ అంశాలపై ఆయన స్పందించడం కూడా మానేశారు. మరి అలాంటి వ్యక్తిని వ్యూహం అనే పొలిటికల్ సినిమాలో ఆర్జీవీ ఎందుకు చూపించాడు?

ఇదే ప్రశ్న ఈ దర్శకుడికి ఎదురైంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలున్నట్టుగానే, వర్మ దగ్గర ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. కథ ప్రకారం, 2009కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని చూపించాల్సి వచ్చిందట. ఆ టైమ్ లో చిరంజీవి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి చూపించానంటున్నాడు వర్మ.

కెలకడంలో వర్మ నంబర్ వన్ అనే విషయం తెలిసిందే. ఒక టాపిక్ పై అతడు కెలకడం స్టార్ట్ చేస్తే, ఎక్కడ మొదలుపెట్టి, ఎక్కడ ముగిస్తాడో ఆయనకే తెలియదు. జగన్ రాజకీయ ప్రస్థానం, వైఎస్ఆర్ జీవితంలోని ఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్న ఈ దర్శకుడు, చిరంజీవిని కూడా అందులో కలిపేశాడంటే, సినిమాలో ఆయన ఎన్ని అంశాలు టచ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.