వచ్చే రెండేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారా ? వచ్చే రెండేళ్లలో అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నమాట. బాబు మళ్ళీ సీఎం అవుతారని టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కావాలని కోరుకుంటున్నారు.
రాజకీయాల్లో ఇలాంటి కోరికలు సహజమే కదా. రామతీర్థం రగడ సందర్భంలో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని అన్నాడు. జగన్ పరిపాలన అరాచకంగా ఉంది కాబట్టి ప్రజలు బాబు వైపు చూస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
విజయనగరం జిల్లా రామతీర్థం ఎపిసోడ్ తో ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఒకేరోజు ఇటు టీడీపీ అదినేత చంద్రబాబు, అటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
రామ తీర్థంలో విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు చేసిన కుట్రే కారణమని విజయసాయి రెడ్డి ఆరోపిస్తే.. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని చంద్రబాబు అన్నారు. ఆలయాలను పరిరక్షించే బాధ్యత సీఎం జగన్ కు లేదా అని ప్రశ్నించారు.
రామతీర్థం, ఒంటిమిట్ట ఆలయాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని.., 16వ శతాబ్దంలోనే పూసపాటి వంశీయులు రామతీర్థంలో ఆలయాలను నిర్మించారని చంద్రబాబు గుర్తు చేశారు. విగ్రహాలను ధ్వంసానికి పాల్పడిన వారు పరమ కిరాతకులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవుడి ఆస్తులపై కన్నేస్తే మసైపోతారన్నారు. దేవాలయాల వద్దకు వెళ్లి అన్యమత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో పరమత విద్వేషం ఎందుకు? రాష్ట్రంలో హోంశాఖ, దేవాదాయశాఖ మంత్రులు ఉన్నారా? ఉంటే ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇక కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రామతీర్థంలో విజయసాయి రెడ్డికి ఏం పనని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డిని కొండపైకి అనుమతించిన పోలీసులు… తననెందుకు అడ్డుకున్నారని నిలదీశారు. విజయసాయి రెడ్డి లాంటి నాయకులను నా జీవితంలో చాలా మందిని చూశానని బాబు పేర్కొన్నారు.
విగ్రహాల ధ్వంసం విషయంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తాము అధికారంలోకి వస్తే తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పాపం ఊరికే పోదని.. సీఎం జగన్ కోర్టుల్లో నిలబడే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు.
రామతీర్థం ఘటనలో పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. కొంత మంది పోలీసులు సీఎం జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం, ధర్మం అంటూ రాజకీయం చేసే రోజులు పోయాయన్నారు.
మరో రెండేళ్లలో చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారని.. అప్పుడు పార్టీ కార్యకర్తలందరికీ లైసెన్స్ ఇచ్చేస్తామన్నారు. పోలీసులు చేస్తున్న తప్పులపై చిత్రగుప్తుడి చిట్టా రెడీ అయిందని, ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు.
మరోవైపు రామతీర్థం ఎపిసోడ్ లో టీడీపీ, వైసీపీ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆలయాలపై మాట్లాడే అర్హత అధికార, ప్రతిపక్షాలకు లేదన్నారు.
రెండు పార్టీలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఆలయాలు కూల్చితే.., వైసీపీ హయాంలో హిందూ ధర్మం అవమానాలకు గురవుతోందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో విగ్రహాల విధ్వంస ఘటనలు వరుసగా జరగడం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ కు ఈ ఘటనలతో సంబంధం ఉందని చెప్పలేముగాని హిందూ దేవతల విగ్రహాలు ఇలా వరుసగా ధ్వంసం ఎందుకు అవుతున్నాయని జనం ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక ఘటన జరిగితే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఒకచోట విధ్వసం జరిగిన మరుసటి రోజునే వెంటనే మరో చోట జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
జగన్ ను బద్నాం చేయాలని టీడీపీ వారే ఈ ఘటనలకు పాల్పడుతున్నారని వైసీపీ వారు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళే ఈ అరాచకాలు చేస్తున్నారని అనుకుంటే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించవచ్చు కదా.
జగన్ అండ చూసుకొనే ఆయన మతంవారు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై జగన్ సీరియస్ గా ఆలోచించకపోతే ఆయన పార్టీ నష్టపోయే అవకాశాలుంటాయి.
ఇక హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే బీజేపీకి దేవతా విగ్రహాల విధ్వంస ఘటనలు బాగా ఉపయోపడతాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ఈ అరాచకాన్ని హైలైట్ చేయాలని ఏపీ బీజేపీ నాయకులకు పార్టీ కేంద్ర నాయకత్వం దిశా నిర్దేశం చేసింది.
అంతర్వేది రథం ఘటనతో మొదలుపెట్టి రామ తీర్థం వరకు వరుసగా విధ్వంసకర ఘటనలు జరుగుతున్నా హోమ్ మంత్రిగాని, డీజీపీ గానీ తీవ్ర హెచ్చరికలు చేసిన దాఖలాలు లేవు. విగ్రహాల విధ్వంసకర ఘటనల ప్రభావం ప్రజల మీద పడితే అది వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది.