పవర్ స్టార్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమా. కానీ అది అలా వెనక్కు జరుగుతోంది. మధ్యలో ఏవేవో సినిమాలు వచ్చి చేరుతున్నాయి. వకీల్ సాబ్ వచ్చి చేరింది పూర్తయింది. భీమ్లా నాయక్ వచ్చింది. విడుదలయింది. లేటెస్ట్ గా పవన్ ప్రత్యేక పాత్రలో నటించే సాయి ధరమ్ తేజ్ -సముద్రఖని కాంబినేషన్ సినిమా వచ్చి చేరింది. ఈ సినిమా ఈనెల నుంచి ప్రారంభం అవుతుందని అనుకున్నారు.
కానీ దానికి సినిమాటోగ్రాఫర్ సెట్ కాలేదు. అందువల్ల ఈ నెలలో షూట్ వుండకపోవచ్చని తెలుస్తోంది. పైగా ఈ సినిమా తరువాత వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో సినిమా అని, అది కాకుండా తెరి రీమేక్ అని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో హరీష్ శంకర్..మైత్రీ మూవీస్ సినిమా ఎక్కడ? అన్నదే పాయింట్.
విశ్వసనీయ వర్గాల సమాచారం చాలా చిత్రంగా వుంది. మైత్రీ మూవీస్ అధినేతలకు పవన్ అభయం ఇచ్చారని, తనకు ఎప్పుడు కథ ఫుల్ నెరేషన్ ఇస్తే అప్పుడు డేట్ లు ఇవ్వడానికి రెడీ అని ఆయన చెప్పారన్నది ఆ సమాచారం. ఇదే ఆశ్చర్యంగా వుంది. ఇంతకాలం ఇంకా కధ రెడీ కాలేదా? అన్నది. నాలుగు సీన్లు మాత్రం నెరేషన్ ఇచ్చారని, పూర్తి కథ కాదు అని ఇంకో గ్యాసిప్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే మరో గ్యాసిప్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అందరూ అనుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ – మైత్రీ మూవస్ కు చేయబోయే సినిమాలో హీరో పోలీస్ కాదని, లెక్చరర్ అన్నది ఆ గ్యాసిప్. ఇప్పటికే విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఒకటి రెండు సినిమాలు ప్రారంభం కావడం, కన్నడంలో యువరత్న, తెలుగులో మరికొన్ని సినిమాల్లో లెక్చరర్ క్యారెక్టర్ వుండడం తెలిసిన సంగతే. అందువల్ల పవన్ కథ మీద ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారన్నది ఆ గ్యాసిప్ సారాంశం.
ఇలా మొత్తం మీద మైత్రీ మూవీస్ -పవన్ సినిమా డోలాయమానంలో చిక్కుకుంది. ఎప్పటికి సెట్ మీదకు వస్తుందో? వాల్మీకి సినిమాతో పెద్ద హిట్ కొట్టిన తరువాత దర్శకుడు హరీష్ ఇప్పటి వరకు ఇదే ప్రాజెక్టు మీద వుండిపోయారు.