విశాఖ రాజధాని కోసం ఎందాకైనా……?

విశాఖను పాలనా రాజధాని చేయాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కూడా కోరుతోంది. ఇక విశాఖ జనాల మద్దతు కూడగట్టి పోరాట దిశగా కూడా కార్యాచరణ రూపొందిస్తామని…

విశాఖను పాలనా రాజధాని చేయాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కూడా కోరుతోంది. ఇక విశాఖ జనాల మద్దతు కూడగట్టి పోరాట దిశగా కూడా కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంటోంది.

విశాఖ రాజధానిగా అన్ని అర్హతలు కలిగి ఉందని, ఏపీ అభివృద్ధి కూడా విశాఖతోనే ముడిపడి ఉందని, అలాంటి సిటీని ఎందుకు పక్కన పెడుతున్నారని అఖిల పక్ష నాయకులు నిలదీస్తున్నారు. విశాఖ రాజధాని కాకుండా పెద్ద ఎత్తున  కుట్ర జరిగింది అని అంటున్నారు.

ఇక విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రా జిల్లాల వెనకబాటుతనం పూర్తిగా సమసిపోతుందని, ఏపీ ప్రగతికి  కూడా గ్రోత్ ఇంజన్ గా మారుతుందని అఖిలపక్షం నేతలు అంటున్నారు. ఏపీలో విశాఖ లాంటి మెగా సిటీ వేరొకటి ఉందా, రాజధాని కాకుండా అడ్డుకోవడం సమంజసమేనా అని కూడా అఖిల పక్ష ప్రతినిధులు నిలదీస్తున్నారు.

విశాఖ రాజధానిగా చేసుకుంటే ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయని, నిరుద్యోగ యువతకు కూడా విశాఖ ఆశాకిరణంగా ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్రా అంటేనే వలసల జిల్లాగా మారిపోవడానికి కారణం అభివృద్ధి లేకపోవడమే అని విశ్లేషిస్తున్నారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం, ఏపీ విశాల ప్రయోజనాల కోసం విశాఖ రాజధానిగా కోరుతూ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని వక్తలు పిలుపు ఇచ్చారు. త్వరలోనే అన్ని విషయాలూ జనాలకు వివరించేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఉత్తరాంధ్రా రక్షణ వేదిక, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలతో పాటు, మేధావులు, విద్యావేత్తలతో విశాఖలో రౌండ్ టేబిల్ సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. విశాఖ రాజధాని కోసం జేఏసీని ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంటున్నారు. 

మొత్తానికి విశాఖ రాజధాని మీద అఖిలపక్షం భేటీ అయింది. మరి ప్రజల మద్దతు కూడగడితేనే ఈ ఉద్యమానికి విజయం లభించేది అని అంటున్నారు.