మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలలన్నీ గంగలో కలిసిపోయాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా.. తనకు మంచి రోజులు వస్తాయని చంద్రబాబునాయుడు ఆశపడ్డాడు. కానీ అంతా తేడా కొట్టేసింది. ఆశలన్నీ ఆవిరైపోయాయి.
ఇప్పుడు ఏం చేయాలో తోచని దుస్థితి! ఆల్రెడీ శవాసనం వేసిఉన్న తెలుగుదేశం పార్టీకి.. కొత్త ఊపిరి ఊదడానికి ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ హవా పలచబడితే.. కాస్త కలిసి వస్తుందనుకుంటే.. అది కాస్తా బెడిసి కొట్టింది. చంద్రబాబునాయుడు అయ్యోపాపం అనిపించేలా కుదేలైపోయారు.
తను ఒంటరిగా, అంటే తెలుగుదేశం పార్టీకి ఎవ్వరితోనూ పొత్తులనేవి లేకుండా, ఎన్నికలకు వెళ్లి గెలిచిన చరిత్ర చంద్రబాబునాయుడుకు లేదు! ఇప్పుడు, ఇంకా తన రాజకీయ ప్రస్థానం ఎన్నెన్ని ఎగుడుదిగుడుల మయంగా ఎన్నాళ్లు సాగుతుందో అర్థంకాని సందిగ్ధావస్థలో ముందడుగు వేయడమే చంద్రబాబుకు బ్రహ్మప్రళయం అయిపోతోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పతనం మామూల్ది కాదు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. పడినవాడు మళ్లీ లేస్తాడు లాంటి పడికట్టు మాటలతో ఊరటపొందే పతనం కాదు అది! పైపెచ్చు ఎన్నికల అనంతర పరిణామాలు.. తెలుగుదేశం భవిష్యత్తును శూన్యం చేసేశాయి. చంద్రబాబు నాయకత్వాన్ని తిరుగులేని రీతిలో అంగీకరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయగలిగిన నాయకులు ఆ పార్టీలో పట్టుమని పదిమంది కూడా మిగల్లేదు. అంతా ఎవరిదారి వారు చూసుకున్నారు. మిగిలినవారు సైలెంట్ గా ఉండిపోయారు.
2024 ఎన్నికల్లో పార్టీని శవాసనం నుంచి పైకి లేపకపోతే.. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ సమాధి మాత్రమే అనే సంగతి చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన పవన్ కల్యాణ్ తో ప్రేమబంధానికి కన్నుగీటారు. సిగ్గువిడిచి.. నేను వన్ సైడ్ లవ్ లాగా ప్రేమిస్తున్నా.. అటువైపునుంచి రెస్పాన్స్ లేదు అని చెప్పుకున్నారు.
బీజేపీ హవా ఏ కొంచెం తగ్గినా.. దాన్ని బూచిగా చూపించి.. మైండ్ గేమ్ ఆడి.. పవన్ ను తన జట్టులోకి లాక్కుని.. ఎడ్వాంటేజీ తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నాడు. మోడీ, అమిత్ షా భజన తప్ప.. రాష్ట్ర బీజేపీ నాయకులతో ఎడమొహం, పెడమొహంగా ఉండే పవన్ కల్యాణ్ కూడా.. అందుకు సిద్ధమే. కానీ.. వీరి ఆశలు గల్లంతయ్యాయి. ముందునుంచి కేంద్రంలోని బీజేపీతో అవసరాన్ని బట్టి మంచి చెడు వైఖరిని అవలంబిస్తున్న జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు వారి బలం మరోసారి నిరూపణ అయిన తర్వాత.. అనవసరంగా సున్నం పెట్టుకోరు.
ఈ విజయాలు చూసిన తర్వాత.. పవన్ ఆ పార్టీ పొత్తులు వీడి రాడు. ఇక చంద్రబాబు నాయుడు మనుగడ ఎలాగ? సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ మాజీ ముఖ్యమంత్రి.. పుట్టుకతోనే ఒక వెలుగు వెలిగిన తన పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయడానికి బరిలోకి దిగే యోధులు కూడా లేక, వెతుకులాటలో ఉండడం ఎంతటి దయనీయమైన స్థితి! చంద్రబాబునాయుడు దుస్థితి పగవాడికి కూడా రాకూడదని జాలిపడడం తప్ప ఎవరు మాత్రం ఏం చేయగలరు?