ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ అధిష్టానానికి ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారు. మీ ఖేల్ ఖతం, గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ ఇక గతమేనని వారు స్పష్టత ఇచ్చారు. యూపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్.. ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పై పూర్తి విముఖత వ్యక్తం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని వచ్చినా తాము ఆమోదించే పరిస్థితుల్లో లేమని ప్రజలు ప్రస్తుతానికి పూర్తిగా తేల్చి పడేశారు.
రాహుల్ గురించి ఇంకా ఎవరైనా పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసినా వారిది వ్యర్థ ప్రయత్నమే. సోనియా నాయకత్వం అంటూ ఇంకా ఎవరైనా మాట్లాడినా వారిది కంఠ శోషే. ఇంతకు మించి కాంగ్రెస్ ను ప్రజలు ఆమోదించే పరిస్థితిలో లేరు. ఉత్తరాదినే కాదు సౌత్ లో కూడా కాంగ్రెస్ కు ఆమోదం లేదని కేరళ ఎన్నికలు క్లారిటీ ఇచ్చాయి.
మహా అంటే రాహుల్ గాంధీని ఎంపీగా లోక్ సభలో కూర్చోబెట్టింది కానీ కేరళ కూడా కాంగ్రెస్ కు పాస్ మార్కులు వేయలేదు. కర్ణాటకలో ఉన్న వర్గపోరు ఫలితంగా మళ్లీ కాంగ్రెస్ అక్కడ అధికారం అందుకుంటుందనే ధీమా కాంగ్రెస్ కార్యకర్తల్లోనే ఉన్నట్టుగా కనిపించదు.
కాంగ్రెస్ కు కొద్దో గొప్పో ఊపు ఉందనుకున్న ఉత్తరాఖండ్, గోవాల్లో కూడా ఆ పార్టీ అధికారానికి ఆమడదూరంలో నిలిచింది. మణిపూర్ లో దెబ్బ తింది. యూపీ లో అయితే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పోటీలో ఉందనే భావనే లేదు. అందుకు తగ్గట్టుగానే వచ్చాయి ఫలితాలు.
ఏడాది కిందటి వరకూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందనుకున్న పంజాబ్ లో కాంగ్రెస్ అధిష్టానం ఆఖర్లో చేసిన మార్పులు ఫలితాన్ని ఇవ్వకపోగా, మొత్తానికే మోసం తెచ్చాయి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని దేశానికి చాటి చెప్పారు.
ఇప్పుడు ఏతావాతా కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు రాజస్తాన్, చత్తీస్ గడ్. మహారాష్ట్ర, తమిళనాడుల్లో అధికార కూటముల్లో కాంగ్రెస్ భాగం. ఇవి కాక ఏమైనా అధికారం ఉన్నా.. అది వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ అది నిలుస్తుందా? అనేది కూడా ప్రశ్నార్థకమే.
కాంగ్రెస్ రహిత భారతదేశం అంటూ బీజేపీ వాళ్లు ఇక నినాదాలు ప్రత్యేకంగా ఇవ్వనక్కర్లేదు. కాంగ్రెస్ పేరుకు ఉన్నా లేనట్టే! దీనికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. ఆ కారణాలన్నింటికీ కారణం మాత్రం నిస్సందేహంగా సోనియా, రాహుల్ లే! ఇందులో మాత్రం అణువంతైన అనుమానం, కల్పన లేదు.