జనసేన నేతల్ని చూస్తే జాలిపడాలో, కోప్పడాలో తెలియని పరిస్థితి. తమ నాయకుడు పవన్‌కల్యాణ్‌ను తిడుతుంటే చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ట్వీట్లు చేసుకోవాల్సిన దయనీయ స్థితి. తమ నాయకుడికి ఈ దుర్గతి పట్టడానికి పవన్‌కల్యాణే కారణమని వారికి అర్థమవుతున్నట్టు లేదు. అర్థమైనా, బయటికి చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ తాజా ట్వీట్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
“టీడీపీ అధినేత సీబీఎన్ గారు….పవన్‌కల్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్, దత్త పుత్రుడు అని వైసీపీ కుక్కలు మొరిగినప్పుడు, పవన్‌కల్యాణ్ గారు తన పల్లకీ మోస్తున్నట్టు రాష్ట్రం అంతా ప్లెక్సీలు పెడితే… ఎందుకు మౌనం వహించారో వివరణ ఇవ్వాలి. దీనిపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి” అని బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదనతో ట్వీట్ చేశారు.
బొలిశెట్టి అమాకత్వంతో నిజాన్ని ఒప్పుకోవడం గమనార్హం. పవన్‌పై జనంలో అపోహలున్నాయని ఆయన స్పష్టం చేశారు. అంటే వైసీపీ వ్యూహం ఫలించిందన్న మాట. పవన్‌కల్యాణ్‌ను తిడితే చంద్రబాబు నాయుడు సంతోషపడతారే తప్ప, మద్దతుగా నిలుస్తారని బొలిశెట్టి ఎందుకు ఆలోచిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. పవన్‌కల్యాణ్‌ను భ్రష్టు పట్టించడమే టీడీపీ లక్ష్యం. ఆ పని వైసీపీ బహిరంగంగా చేస్తుంటే, చంద్రబాబు మాత్రం అనుకూలంగా వుంటూ చేస్తున్నారు.
తమ నాయకుడిని ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే, అసలు ఖండించని చంద్రబాబునాయుడిని సీఎం చేయాలనుకోవడం జనసేన దౌర్భాగ్యం కాకుండా మరేంటని నిలదీతలు ఎదురవుతున్నాయి. కావున ఎవరో వస్తారని, ఏదో చేస్తారని జనసేన నేతలు ఎదురు చూడకుండా, తమ రక్షణ బాధ్యతలని తాము చూసుకోవాలని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది.
చంద్రబాబు మద్దతు కోసం ఎదురు చూస్తూ వుంటే … మరింత అభాసుపాలు కావడం తప్ప, ఒరిగేదేమీ వుండదు.