భగవంత్ కేసరి.. ఆ సాంగ్ కట్ చేసిన దర్శకుడు

బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబోలో వస్తోంది భగవంత్ కేసరి. ఈ సినిమాలో 'దంచవే మేనత్త కూతురా' సాంగ్ ఉంది. దీనిపై ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చేశాయి కూడా. అయితే ఈ పాటకు సంబంధించి ఓ…

బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబోలో వస్తోంది భగవంత్ కేసరి. ఈ సినిమాలో 'దంచవే మేనత్త కూతురా' సాంగ్ ఉంది. దీనిపై ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చేశాయి కూడా. అయితే ఈ పాటకు సంబంధించి ఓ ట్విస్ట్ ను బయటపెట్టారు దర్శకుడు అనీల్ రావిపూడి. ప్రస్తుతానికి సినిమాలో ఆ సాంగ్ ను కట్ చేశానంటూ బాంబ్ పేల్చారు.

“భగవంత్ కేసరి సినిమాలో డ్యూయట్స్ ఉండవు. ఎందుకంటే, మా స్టోరీ డిమాండ్ చేయడం లేదు. కాబట్టి బాలయ్యతో డ్యూయట్స్ ఆశించొద్దు. చాలా నేచురల్ గా, రియలిస్టిక్ గా వెళ్లాం. కానీ చివర్లో మాత్రం ఓ సిచ్యుయేషన్ సాంగ్ పెట్టాం. అది అలా కుదిరింది కాబట్టి పెట్టాం. కానీ విడుదలైన తర్వాత మొదటి వారం ఆ సాంగ్ ఉండదు. దసరా నుంచి థియేటర్లలో ఆ పాట యాడ్ అవుతుంది. మొదటి వారం నిజాయితీగా సినిమా చూద్దాం.. రెండో వారం దసరా నుంచి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం.”

సో.. ఆ పాట కోసం సినిమాను రెండోసారి చూడ్డానికి ప్రేక్షకులంతా ప్రిపేర్ అవ్వాలని చెబుతున్నారు రావిపూడి. అయితే ఆ పాట తీసేయడం వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ లేదంటున్నారు. ఫ్లో దెబ్బతినకూడదనే అలా చేశారంట.

“భగవంత్ కేసరి వరల్డ్ సృష్టించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అలాంటి టైమ్ లో బలవంతంగా ఓ పాట పెట్టాలని నాకు అనిపించలేదు. చివర్లో మాత్రం సాంగ్ సిచ్యుయేషన్ కుదిరింది. కానీ అంతా ఓసారి చూసుకున్న తర్వాత సినిమా ఫ్లో దెబ్బతింటుందని అనిపించి నేనే పక్కనపెట్టాను. దసరా నుంచి యాడ్ చేస్తాను.”

ఇక సినిమాలో బాలయ్య-కాజల్ మధ్య లవ్ ట్రాక్ కూడా సినిమాటిక్ గా ఉండదంటున్నారు దర్శకుడు. ఓ పెద్దమనిషి, ఓ పెద్దావిడ కలిసి తమ అనుబంధాన్ని ఎలా షేర్ చేసుకుంటారో అలానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే బాలయ్య-కాజల్ మధ్య వచ్చే ఈ ట్రాక్ లో చిన్న ఫన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.