నాకంత సీన్ లేదు.. ఒప్పేసుకున్న అచ్చెన్న

మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్యే రోజా అచ్చెన్నకు గట్టి సవాల్ విసిరారు. గట్టి చట్నీ తింటే 160 కేజీలు పెరుగుతావు కానీ టీడీపీకి ఎమ్మెల్యే సీట్లు రావని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టెక్కలిలో రాజీనామా…

మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్యే రోజా అచ్చెన్నకు గట్టి సవాల్ విసిరారు. గట్టి చట్నీ తింటే 160 కేజీలు పెరుగుతావు కానీ టీడీపీకి ఎమ్మెల్యే సీట్లు రావని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టెక్కలిలో రాజీనామా చేసి గెలువు అని సవాల్ విసిరారు. కానీ అచ్చెన్న ఆ మాట దాటేశారు, అబ్బెబ్బే నేను చేయలేను నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నగరిలో మళ్లీ గెలువంటూ రోజాకు సవాల్ విసిరారు. అంతే కాదు రోజా మళ్లీ గెలిస్తే నగరిలో టీడీపీని ఇక పోటీకి దించడంట. ఇదో వెరైటీ ఆఫర్.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఏ ఎన్నికలో అయినా ఆ పార్టీకి ఓటమి ఎదురైందా..? స్థానిక సంస్థల దగ్గర్నుంచి, ఉప ఎన్నికల వరకు అన్నిట్లోనూ వైసీపీ విజయ దుందుభి మోగించింది. అంటే ప్రజల్లో ఆ పార్టీకి ఏ స్థాయిలో మద్దతు ఉందో తెలిసిపోయింది. అయితే టీడీపీ తన ఉనికి కోసం పోరాడుతోంది. ఏకంగా అచ్చెన్నాయుడు 160 సీట్లంటూ హడావిడి చేస్తున్నారు. దీంతో రోజా అచ్చెన్నపై గట్టి సెటైర్ వేశారు. బాగా తింటే బరువు పెరుగుతావు కానీ సీట్లు పెరగవు అన్నారు.

సహజంగా అచ్చెన్నాయుడు ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యేరకం కాదు, కానీ “పార్టీ లేదు బొక్కా లేదు” అంటూ తన పాత కథని రోజా తవ్వి తీసే సరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సవాల్ ని స్వీకరించేంత దమ్ము లేదు. టెక్కలిలో రాజీనామా చేసి గెలిచేంత సీన్ లేదు. అందుకే రోజాకు కామెడీగా ప్రతి సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు.

నేను చేయలేను.. నా వల్ల కాదు..

సవాల్ ని స్వీకరించేంత దమ్ములేని అచ్చెన్నాయుడు.. రోజా రాజీనామా చేయాలంటూ కామెడీ చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు, రోజాకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. రోజా రాజీనామా చేసి తిరిగి నగరిలో గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టదట. అసలు టీడీపీకి నిజంగా తానే అద్యక్షుడిని అనుకుంటున్నారేమో. 

అభ్యర్థుల్ని బరిలో దింపడం, టికెట్లు ఇవ్వడం ఇవేవీ అచ్చెన్న చేతిలో పనులు కాదు. జస్ట్ ఏపీకి డమ్మీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారంతే. టెక్కలికి రాజీనామా చేయడం మీ చేతిలో పనే కదా.. అదే చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి మీ సత్తా నిరూపించుకోవచ్చు కదా అచ్చెన్నా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 

చంద్రబాబును దాటి ప్రకటన చేసిన అచ్చెన్నాయుడు, ఈసారి పార్టీలో ఓ మూల కూర్చోవడం ఖాయం అంటున్నారు.