నిరుద్యోగులు కెవ్వు కేక‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించారు. “రేపు ఉద‌యం టీవీల ముందు కూచోండి. నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెబుతా” అని అన్న‌మాట‌కు కేసీఆర్ క‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌లో 91,142 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించారు. “రేపు ఉద‌యం టీవీల ముందు కూచోండి. నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెబుతా” అని అన్న‌మాట‌కు కేసీఆర్ క‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌లో 91,142 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో … తెలంగాణ వ్యాప్తంగా సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. నిరుద్యోగ యువ‌త కెవ్వు కేక అంటూ త‌మ ఆనందాన్ని వీధుల్లోకి వ‌చ్చి ప్ర‌ద‌ర్శించింది.

ఒక‌వైపు అసెంబ్లీలో భారీ సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి కేసీఆర్ ప్ర‌క‌ట‌న పూర్తి కాకుండానే, తెలంగాణ వ్యాప్తంగా విశ్వ‌విద్యాల‌యాలు, ఇత‌ర విద్యా సంస్థ‌ల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచా పేల్చ‌డంతో పాటు రంగులు చ‌ల్లుకుంటూ సంబ‌రాలు మొద‌లు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. మిగిన 80,039 ఉద్యోగాల భ‌ర్తీకి వెంట‌నే నోటిఫికేష‌న్లు జారీ చేయ‌నున్న‌ట్టు కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించడం విశేషం. ఈ సంద‌ర్భంగా స్థానిక‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న‌ట్టు కేసీఆర్ వెల్ల‌డించారు. 

అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆయ‌న స్పష్టం చేశారు. అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్‌ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ప్రత్యేక ఘట్టమని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. రాజకీయాలంటే వేరే పార్టీలకు గేమ్‌.. టీఆర్‌ఎస్‌కు ఒక టాస్క్‌ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం చేపట్టామని చెప్పారు. 

తెలంగాణ సాకారం చేసుకున్నామ‌ని, నేడు రాష్ట్ర ఆవిర్భావ ఆశ‌యానికి త‌గిన‌ట్టు నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ను కూడా పూర్తిస్థాయిలో సాధించుకునేందుకు ముందుకెళుతున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉద్యమ సమయంలో తాను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ తెలిపారు.