ఒక వైపు మహిళా దినోత్సవం. మరో వైపు ఆమె జన్మదినోత్సవం. సరిగ్గా ఇలాంటి ఆనందోత్సవ సమయంలో మావోలు ఆమె మీద గురి పెట్టారు. ఆమె ఎవరో కాదు, పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి. మార్చి 8 న ఆమె పుట్టిన రోజు కూడా. ఒక వైపు మహిళా దినోత్సవాల సంబరాల్లో తలమునకలై ఉండగా ఎమ్మెల్యేకు మావోలు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
తీరు మార్చుకోవాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మన్యాన్ని వదిలి వెళ్ళిపోవాలని పలు రకాలైన కండిషన్లు పెట్టారు. లేకపోతే ప్రజా కోర్టులో కఠిన శిక్ష తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. దీని మీద విశాఖ జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజంగా మావోలు అంతలా హెచ్చరికలు జారీ చేశారా. అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే మీద చేస్తారా అన్న చర్చ కూడా ఒక వైపు సాగుతోంది.
ఇక దీని మీద పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అయితే ఆ లేఖ అసలుదా లేక ఫేకా అన్నది తేలాలని అంటున్నారు. దాని మీద ఇప్పటికే పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. పోలీసులు జరిపే విచారణలో అసలు విషయం తేలుతుందని ఆమె చెబుతున్నారు. ఇంకో వైపు అసలు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలే జరగడంలేదని ఆమె అన్నారు.
అక్కడ జరిగేది రోడ్ల నిర్మాణానికి అవసరమైన మెటల్ తవ్వకాలే అని చెబుతున్నారు. ఇక బాక్సైట్ తవ్వకాలే జరగనపుడు తాను అనుమతులు ఇచ్చానని ఆరోపించడం కూడా దారుణమని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే వెర్షన్ చూస్తే పక్కా క్లారిటీగా ఉంది. మరో వైపు చూస్తే ఆమె కూడా మావోల అభీష్టానికి వ్యతిరేకంగా అంత దూకుడు చేసి ముందుకు వెళ్ళే తత్వం కలిగిన నేత కారని కూడా వినిపిస్తున్న మాట.
ఇక చాలా కాలంగా టీడీపీ నాయకులు మన్యంలో బాక్సైట్ తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఇందులో బడా నాయకులు కూడా ఉన్నారు. ఇక టీడీపీకి రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలో రాజకీయంగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. గెలుపు గుర్రాలు అయితే ఎవరూ లేరు. మొత్తానికి చూస్తే ఏజెన్సీలో వైసీపీ వర్సెస్ టీడీపీగానే రాజకీయం సాగుతూ వస్తోంది.
దాంతో సడెన్ గా మావోల పేరిట విడుదల అయిన లేఖ మాత్రం కలకలమే రేపుతోంది. నిజంగా మావోలు లేఖ రాశారా. లేక దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారు అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెల్లడి అవుతాయని అంటున్నారు.
ఇక ఏజెన్సీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నారు. వీరందరితో పాటు ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులందరికీ సెక్యూరిటీ ఒక్కసారిగా టైట్ చేశారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసుల నుంచి సూచనలు అందినట్లుగా తెలుస్తోంది.