‘ముందస్తు’గా రెచ్చగొట్టలేవు బాబూ..!

ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తాయి, టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడీగా ఉండండి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన జగన్, అది పూర్తి స్థాయిలో రాకముందే ముందస్తుకు వస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు.  Advertisement…

ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తాయి, టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడీగా ఉండండి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన జగన్, అది పూర్తి స్థాయిలో రాకముందే ముందస్తుకు వస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు. 

వైసీపీలో గందరగోళం సృష్టించడానికి, ముందస్తుకు వెళ్లినా తామే గెలుస్తామని జగన్ తో ప్రకటన చేయించడానికి ఆ దిశగా రెచ్చగొట్టడానికి మాత్రమే బాబు ఈ పాచిక వేశారు. కానీ ఇది పారే పాచిక కాదు. జగన్ ముందస్తుకి వెళ్లే ఆలోచన లేదు, అవసరం అంతకన్నా లేదు.

ఎన్నికలంటే అంత సరదానా..?

గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి వికేంద్రీకరణపై రచ్చ చేశారు బాబు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రండి అంటూ సవాల్ విసిరారు. డెడ్ లైన్ కూడా పెట్టారు, ఆ తర్వాత కళ్లు తేలేశారు. బాబ్బాబు రాష్ట్రమంతా ఎన్నికలు పెట్టకపోయినా కనీసం ఆ రెండు జిల్లాల్లో అయినా పెట్టండన్నారు. 

ఓ దశలో అసలు బాబుకి అంత ధైర్యం ఏంటి అని కొందరు అనుకున్నారు, మతి భ్రమించిందని చాలామంది అంచనా వేశారు. ముందస్తు, ముందస్తు అంటున్న చంద్రబాబుకి నిజంగా ఆ సత్తా ఉంటే స్థానిక ఎన్నికల్లో చూపించాలి కదా. కానీ స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా వైసీపీదే విజయం. చివరకు కుప్పం కూసాలు కూడా కదలిపోవడంతో చంద్రబాబు డీలా పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలంటూ హడావిడి చేస్తున్నారు.

ముందస్తు ఎవరికి అవసరం..?

ఒకరకంగా ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకి అవసరం. రెండేళ్ల తర్వాత తన ఆరోగ్యం ఎలా ఉంటుందోననే భయం ఆయనకు ఉండొచ్చు. ఆ లోగా అన్నీ చక్కబెట్టుకోవాలన్న తాపత్రయం కూడా ఉండొచ్చు. అందుకే బాబు ముందస్తు జపం చేస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం జగన్ కి ఏ మాత్రం లేదు. 

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాలనపై ప్రజల్లో సదభిప్రాయం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 151 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే సత్తా పార్టీకి ఉంది. అలాంటప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం అసలు జగన్ కి ఏముంది.

నామమాత్రపు ప్రతిపక్షం కోర్టు కేసులతో ఇబ్బంది పెట్టొచ్చుగాక, అంతమాత్రాన ముందస్తుకి వెళ్లి ఏం సాధిస్తారు. కానీ చంద్రబాబు మరోవైపు నుంచి గీరుతున్నారు. దమ్ముంటే ముందస్తుకి రండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే భయంతో జగన్ ముందస్తుకి వస్తారంటూ బాబు రెచ్చిపోతున్నారు. 

ఇలా రెచ్చగొడితే అనవసరంగా రెచ్చిపోయేవారెవరూ వైసీపీలో లేరు. ఎన్నికలొస్తే హడావిడి చేద్దామనుకుంటున్న బాబు పాచిక పారేదీ కాదు.