తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ వేదికగా 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చిక్కులు తప్పవు. ఎందుకంటే ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఇటీవల ఏపీ ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించలేకే, ఏపీ ప్రభుత్వం కోరకుండానే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచిందనే విమర్శలున్నాయి.
మరోవైపు ఉద్యోగాల భర్తీ లేకపోవడం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనతో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లేదని ప్రతిపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే …. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఆర్భాటంగా ఇచ్చిన ప్రకటన ఏమైందని జగన్‌ను నిరుద్యోగులు నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, మిగిన 80,039 ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచే నోటిఫి కేషన్ల జారీ చేయడంతో ఏపీ ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. సంక్షేమ పథకాల అమల్లో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అయ్యేలా బటన్ నొక్కుతున్నట్టు జగన్ పదేపదే ప్రకటించడం చూస్తున్నాం. మరి తమ భవిష్యత్ మాటేంటని నిరుద్యోగులు రోడ్డెక్కే అవకాశాలు లేకపోలేదు.
తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అనే డిమాండ్‌తో నిరుద్యోగులు, వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు పోరాటాలకు ఉపక్రమించేందుకు తెలంగాణ సీఎం ప్రకటన ప్రేరణగా నిలిచే అవకాశాలున్నాయి. ఒకవైపు ఉద్యోగులకుకే జీతాలు చెల్లించేందుకే ఏపీ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అలాంటిది కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం లేదు.
తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.7 వేల కోట్ల భారం పడనున్నట్టు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో చిన్న ఆర్థిక భారాన్ని కూడా ప్రభుత్వం భరించే స్థితిలో లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ అనే ప్రక్రియ జోలికి వెళ్లకుండా… నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనేందుకే ప్రభుత్వం సిద్ధపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువతలో వ్యతిరేకత పోగొట్టుకునేందుకు సరైన సమయంలో కేసీఆర్ సంచలన ప్రకటన చేయగా, జగన్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తుండడం గమనార్హం.