ర‌ఘురామ అతి…జ‌గ‌న్‌పై సానుభూతి!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అతి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై సానుభూతి పెంచేలా ఉంది. ర‌క‌ర‌కాల వ్య‌వ‌స్థ‌ల్ని అడ్డం పెట్టుకుని జ‌గ‌న్‌ను వేటాడుతున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డితే మాత్రం, అందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ భారీ…

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అతి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై సానుభూతి పెంచేలా ఉంది. ర‌క‌ర‌కాల వ్య‌వ‌స్థ‌ల్ని అడ్డం పెట్టుకుని జ‌గ‌న్‌ను వేటాడుతున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డితే మాత్రం, అందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. జ‌గ‌న్‌ను శాశ్వ‌తంగా జైల్లో పెట్టాల‌నే కుట్ర‌లు ర‌ఘురామ చేత‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. 

ఈయ‌న‌కు ఎల్లో బ్యాచ్ మ‌ద్దతు ఎలాగూ వుంది. దేన్నైనా ప్ర‌కృతి ఒక ప‌రిధి వ‌ర‌కూ భ‌రిస్తుంది. అంత‌కు మించితే మాత్రం త‌న ప‌ని తాను చేస్తుంది. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ర‌ఘురామ‌కృష్ణంరాజు, త‌న పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కేసుల‌పై తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఏ కోర్టులోనైనా పిల్ వేసే ర‌ఘురామ‌కృష్ణంరాజు హ‌క్కును ఎవ‌రూ కాద‌న‌లేరు. అలాగ‌ని విచ‌క్ష‌ణ‌ను మ‌రిచిపోవ‌ద్దు. త‌న మాట‌ల‌కు, కేసుల‌కు విలువ లేదా చ‌ర్చ‌కు ప్రాధాన్యం ల‌భించ‌డానికి తాను వైసీపీ ఎంపీ కావ‌డ‌మే కార‌ణ‌మ‌ని ర‌ఘురామ గుర్తిస్తే మంచిది. మ‌రో రెండేళ్ల‌లో ప‌ద‌వీ కాలం పూర్త‌యితే త‌న‌ను ప‌ట్టించుకునే వారెవ‌రూ ఒక్క‌సారి ఆయ‌న ఆలోచించుకుంటే మంచిది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ రఘురామ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి (పిల్‌) రెగ్యులర్‌ నంబర్‌ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ పిటిషన్‌ విచారణార్హతపై జగన్‌ సహా ప్రతివాదులంద‌రి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. గతేడాది జూలైలో పిటిష‌న్ దాఖ‌లు కాగా రిజిస్ట్రీ అభ్యంత‌రం చెప్ప‌డంతో విచార‌ణ‌కు రాలేదు. ఆ అభ్యంతరాలను  ధర్మాసనం తోసిపుచ్చింది. ర‌ఘురామ మ‌రో ప‌నేదీ లేన‌ట్టు కేవ‌లం జ‌గ‌న్‌పై న్యాయ‌పోరాట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. 

జ‌గ‌న్‌కు కేసులు, జైలు కొత్తేమీ కాదు. కొన్ని వ్య‌వ‌స్థ‌లు, కొంద‌రు వ్య‌క్తులు ఎవ‌రెవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నాయో, చేస్తున్నారో జ‌నానికి బాగా తెలుసు. అంతిమంగా జ‌నాన్ని మేనేజ్ చేయ‌లేమ‌ని తెలుసుకుని, జ‌గ‌న్‌పై వేధింపుల విష‌యంలో సంయ‌మ‌నం పాటిస్తే వారికే మంచిది. లేదంటే జ‌గ‌న్‌పై కేసుల అస్త్రాలు చివ‌రికి త‌మకే రివ‌ర్స్ అవుతాయ‌నే స‌త్యాన్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.