జ‌గన్ ముందు ‘ముందస్తు’ సమస్య

ఆంధ్ర సిఎమ్ జ‌గన్ మోహన్ రెడ్డి రాజ‌కీయ పరిణితికి పరీక్ష పెట్టే సమస్య ఇది. అలా అని ఈ సమస్య వచ్చేసి ఆయన ముంగిట్లో అర్జెంట్ గా కూర్చోలేదు. కూర్చునే అవకాశం వుందని రాజ‌కీయ…

ఆంధ్ర సిఎమ్ జ‌గన్ మోహన్ రెడ్డి రాజ‌కీయ పరిణితికి పరీక్ష పెట్టే సమస్య ఇది. అలా అని ఈ సమస్య వచ్చేసి ఆయన ముంగిట్లో అర్జెంట్ గా కూర్చోలేదు. కూర్చునే అవకాశం వుందని రాజ‌కీయ వర్గాలు భావిస్తున్నాయి. కెేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు మూడ్ లో వున్నా ఈ ముప్పు వచ్చి జ‌గన్ ప్రభుత్వం ముంగిట వాలుతుంది. ఇప్పటికే ఈ మేరకు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ‘ముందు’ జాగ్రత్త క్లియర్ గా కనిపిస్తోంది. కానీ జ‌గన్ పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్నార్ధకం.

కొన్నాళ్ల క్రితం వైఎస్ జ‌గన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వార్తలు వినిపించాయి. ఆ విధంగా ఓ ఏడాది ఆర్థిక సమస్యల నుంచి ముందే గట్టెక్కే అవకాశం వుంటుందని అందరూ లెక్కలు కట్టారు. కానీ ఇప్పుడు చూస్తుంటే అలా ముందస్తుకు వెళ్లడం అన్నది జ‌గన్ కు అనుకూలమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లో భాజ‌పా విజ‌యం సాధిస్తే ముందస్తు ఆలోచన చేస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో భాజ‌పా విజ‌యం కచ్చితంగా ఘనమైనదే అవుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అన్నది సకల రాజ‌కీయ పరిస్థితులకు అద్దం పట్టే రాష్ట్రం. ప్రతిపక్షాలు అన్నీ అక్కడ బలంగా మోహరించాయి. ఒక దశలో అక్కడి యోగి ప్రభుత్వానికి కష్టం అనేంత కలర్ కనిపించింది. కానీ అక్కడే నెగ్గుకు వస్తుంది అంటే కచ్చితంగా ఈ ఊపును కొనసాగించాలనే ఆలోచన చేసే అవకాశం వుంది.

ఇలాంటి నేపథ్యంలో తెలుగు నాట కూడా ముందస్తు డిస్కషన్లు రచ్చబండలను ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే జ‌గన్ మీద అన్ని వైపుల నుంచి నెగటివ్ ప్రచారం ఊపు అందుకుందని, అందువల్ల ఇది ఇంకా పెరగక ముందే ముందస్తుకు వెళ్లడం మంచిది అని కొంతమంది..కాదు కాదు, పరిస్థితులను కాస్త గమనించి, చక్కదిద్దుకుని ముందుకు వెళ్తే మంచిదని మరి కొందరు, ఇలా ఎవరి లెక్కలు వారు కడుతున్నారు.

జ‌నసేన వ్యవహారం

ఆంధ్రలో ఎన్నికల విషయంలో జ‌నసేన నే ట్రంప్ కార్డ్ అని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం భాజ‌పాతో వున్న ఆ పార్టీ అలాగే వుండగానే ఎన్నికలకు వెళ్తే వైకాపాకు బెటర్ అనే భావన రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతానికి పవన్ ను ఎలాగైనా తెలుగుదేశం వైపు లాగే ప్రయత్నాలు గట్టిగా జ‌రుగుతున్నాయి. కానీ ఏ వంక పెట్టుకుని జ‌నసేన భాజ‌పాకు దూరం జ‌రుగుతుంది? భాజ‌పానే తేదేపాకు దగ్గరగా లాగాల్సి వుంటుంది. అదే జ‌రిగితే జ‌గన్ ప్రభుత్వానికి కష్టమే. ప్రస్తుతానికి అయితే భాజ‌పా-తేదేపా కలయిక అన్నది కలే.

కానీ ఇంకా సమయం ఇస్తే సరైన సాకు దొరికితే జ‌నసేన చటుక్కున భాజ‌పాకు విడాకులు ఇచ్చి తేదేపాతో చేతులు కలపడం ఖాయం. ఆ సమయం ఇవ్వకుండా వుండాలి అంటే జ‌గన్ ముందస్తుకు సై అనాల్సి వుంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రలోని అర్బన్ ఓటర్లలో పరిస్థితి అంత సజావుగా వున్నట్లు కనిపించడం లేదు. ఉద్యోగుల వ్యవహారం, అన్ని వైపుల నుంచి జ‌రుగుతున్న నెగిటివ్ ప్రచారం కలిసి జ‌గన్ కు అర్బన్ ఓటర్ ను కాస్త దూరం చేసినట్లు కనిపిస్తోంది.

తేదేపా సమరసన్నాహం

కాస్త ఊపు అదుకున్న తేదేపా సమర సన్నాహాల్లో వుంది. చంద్రబాబు, లోకేష్ ఏదో తరహా యాత్రలతో జ‌నం ముందుకు వెళ్లాలనే ఆలోచనలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అమరావతి ప్రభావం గట్టిగా వుందనే అభిప్రాయాలు వుండనే వున్నాయి. 

నారసింహ యాత్ర పేరుతో కొన్ని ప్రాంతాల్లోని గుడులు సందర్శిస్తా అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించి వున్నారు. తేదేపా నాయకులు ట్విట్టర్ పోరును గట్టిగా సాగిస్తున్నారు. ఆ విధంగా అర్బన్ ఓటర్ ను ఆకట్టుకోవచ్చని ఆలోచన. అయినా గ్రామీణ ఓటర్ మీద అపనమ్మకం ఇంకా అలాగే వుంది. ఈ యాత్రల ద్వారా గ్రామీణ ఓటర్ ను టార్గెట్ చేయాలన్నది తేదేపా నాయకుల ఆలోచన.

జ‌గన్ సన్నాహాలు

జ‌గన్ కూడా ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారనే సూచనలు వున్నాయి. ఎమ్మెల్యేలను ఎలా ముందుకు వెళ్లాలనే దిశానిర్దేశం చేయడం వరకు ఓకె. కానీ జ‌గన్ కు ఇంకా రెండేళ్ల పూర్తి సమయం వుంది. అందువల్ల మరీ ఇంత ముందుగా వెళ్లడం అవసరమా? అన్నదే ఎమ్మెల్యేల్లో వున్న భావన. ఎందుకంటే ఎన్నికలు అన్నది డబ్బుతో కూడుకున్నవి. అందులో ఏం సందేహం లేదు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా అయిదేళ్లు పదవిలో వుండి సంపాదించాలనే కోరుకుంటారు. మంత్రుల భావన కూడా ఇలాగే వుంటుంది. అందువల్ల జ‌గన్ కు ముందస్తు ఆలోచన వున్నా, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఆ దిశగా మద్దతు వుంటుందా? అన్నది అనుమానం.

అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కార్యకర్తలు, నాయకులు మరీ బలపడింది లేదు. అలా అని పక్కన పెట్టిందీ లేదు. ఎమ్మెల్యేలు వీలయినంత సహకారం అదిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అలాంటిది ఏమీ లేదు. అందువల్ల జ‌గన్ ముందుగా ఆ దిశగా దృష్టి పెట్టాల్సి వుంది. ఓటరు మనోగతం ఎలా వున్నా, ఓటరును బూత్ దగ్గరకు రప్పించేది, వీలయినంత వరకు ఓటరు మనోగతం మార్చగలిగింది స్థానిక కార్యకర్తలు, నాయకత్వమే. వీరి విషయం జ‌గన్ గత రెండున్నరేళ్లుగా పట్టించుకోలేదు.

కొందరికి పదవులు ఇచ్చారు తప్ప నామినేటెడ్ వర్క్ లు ఏవీ ఇవ్వలేదు. చేసిన నామినేటెడ్ వర్క్ ల బిల్లులు చెల్లింపు జ‌రగలేదు. ముందస్తుకు వెళ్లాలంటే ముందు దీని మీద దృష్టి పెట్టాలి. స్థానిక కార్యకర్తలను, నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే వారు ముందుకు వస్తారు. అదే సమయంలో అర్బన్ ఓటర్ కు ఇచ్చిన మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు హామీ నిలెబెట్టుకోవాలి. ఇలా చక్కదిద్దుకోవాల్సిన పనులు చాలా వున్నాయి. కానీ వాటన్నింటికీ కనీసం ఆర్నెల నుంచి ఏడాది అయినా సమయం పడుతుంది.

జ‌గన్ దగ్గర సమస్య ఏమిటంటే కేసిఆర్ అంత స్పీడ్ గా క్రైసిస్ మేనేజ్ మెంట్ చేయలేరు. ఆచి తూచి నెమ్మదిగా అడుగులు వేస్తారు. జ‌గన్ మైండ్ రీడ్ చేయడం అన్నది అంత సులువు కాదు. అందువల్ల ముందస్తు విషయంలో జ‌గన్ యాక్టివ్ గా ముందుకు వెళ్తారా? లేక ఏం జ‌రుగుతుందో చూద్దామనే సాచివేత ధోరణితో వుంటారా? అన్నది అంత సులువుగా అంతు పట్టదు.

కానీ ఒకటి మాత్రం వాస్తవం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది ఇప్పుడు ఎలాగూ సాధ్యం కాదు. కానీ వీలయినన్ని రాష్ట్రాలను కలిపి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర భాజ‌పా అనుకుంటే మాత్రం, ఫాలో..ఫాలో అనడం జ‌గన్ కు తప్పకపోవచ్చు.