సైలెంట్ గా స్ట్రీమింగ్ కొచ్చిన భారీ చిత్రం

ఫ్లాప్ అయిన సినిమా తమకు కూడా అక్కర్లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి ఓటీటీలు. ఎలాంటి ఆర్భాటం లేకుండా కామ్ గా స్ట్రీమింగ్ కు పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా వచ్చింది. రవితేజ కెరీర్…

ఫ్లాప్ అయిన సినిమా తమకు కూడా అక్కర్లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి ఓటీటీలు. ఎలాంటి ఆర్భాటం లేకుండా కామ్ గా స్ట్రీమింగ్ కు పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా వచ్చింది. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సినిమాను ఎలాంటి ప్రకటన చేయకుండా స్ట్రీమింగ్ కు పెట్టేసింది. అలా రవితేజ నటించిన సినిమా రిలీజైన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ప్రచారం లేకుండా. కనీసం సినిమా యూనిట్ కూడా దీనిపై ప్రకటన చేయకపోవడం బాధాకరం. 

దసరా బరిలో గ్రాండ్ గా రిలీజైంది టైగర్ నాగేశ్వరరావు సినిమా. ఓవైపు భగవంత్ కేసరి సినిమాతో పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ పై నమ్మకంతో రంగంలోకి దిగారు. అయితే భారీ రన్ టైమ్ ఈ సినిమాకు అతిపెద్ద సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ దెబ్బకొట్టింది.

దీంతో ఉన్నఫలంగా అమాంతం సినిమా రన్ టైమ్ ను కుదించేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు భగవంత్ కేసరికి హిట్ టాక్ రావడంతో టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయింది. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. 

నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రేణుదేశాయ్ కీలక పాత్ర పోషించింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా ఏ ఏరియాలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీలో దర్శనమిచ్చింది.