జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కొత్త బాధ్యతల్ని అప్పగించినప్పటి నుంచి హుషారొచ్చింది. పార్టీ కోసం కష్టపడుతున్నానని నిరూపించేందుకు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సామాజిక అంశాలపై నాగబాబు తనదైన జబర్దస్త్ కామెడీ చేస్తున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతు న్నాయి. తాజాగా మరోసారి నాగబాబు హాస్యాన్ని పండించారు. ప్యాకేజీపై తాజాగా కళాకళిలో తనదైన స్టైల్లో జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్‌తో డిబేట్ నిర్వహించడం విశేషం.
అయితే ప్యాకేజీపై అడగాల్సిన వ్యక్తిని కాకుండా అమాయకుడైన అజయ్‌ని అడిగితే లాభం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే తెలుగు రాజకీయాల్లో ప్యాకేజీ అంటే పవన్ మాత్రమే గుర్తుకొస్తారనే విమర్శలున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వెయ్యి కోట్ల డీల్‌కు సంబంధించి ఎల్లో మీడియాధిపతి ఏకంగా ఆర్టికల్ రాసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతానికి వస్తే నాగబాబు, అజయ్ మధ్య ప్యాకేజీపై సాగిన హాస్య సంభాషణ ఏంటో తెలుసుకుందాం.
అజయ్ నాకొక సందేహాన్ని నివృత్తి చేయమని జనసేన అధికార ప్రతినిధిని నాగబాబు అడుగుతారు. అసలు ప్యాకేజ్ అంటే అర్థం ఏంటో చెప్పమని నాగబాబు కోరుతారు. ఈ మధ్య బాగా వింటున్నా బ్రదర్ …. పెద్దపెద్దో ళ్లంతా మాట్లాడుతున్నారని అజయ్ చెప్పుకొస్తారు. ఉన్న విషయం మాట్లాడుకుందామన్నాడాయన. ఊ..చెప్పు అని నాగబాబు ఉత్సాహంగా అంటారు. ప్యాకేజ్ అనే మాట విన్నప్పుడల్లా ఒక మనిషి గుర్తుకొస్తాడని అజయ్ అంటారు. ఎవరాయన అని నాగబాబు ప్రశ్నిస్తారు.
రెండేళ్ల క్రితం ఏపీ నుంచి రాజ్యసభకు పెద్ద పారిశ్రామికవేత్తను పంపించారని అజయ్ చెబుతారు. ఆయనకి, ఏపీ రాష్ట్రానికి ఏం సంబంధం? ఆయన్ని ఏరికోరి ఎందుకు రాజ్యసభ ఇచ్చారు? ఆయనేమన్నా ఏపీ గురించి ఏమైనా అడిగారా? అని చూస్తే… ఇప్పటి వరకూ ఏమీ లేదని అజయ్ అంటారు.
అయితే ఏమీ చేయనందుకు ఎందుకు రాజ్యసభ ఇచ్చారని నాగబాబు అమాయకంగా అడుగుతారు. ఏం లేదు …. అంతా ప్యాకేజీ మహిమ అని అజయ్ తనదైన స్టైల్లో చెప్పి నాగబాబుని సంతృప్తి పరుస్తారు. జగన్ ప్యాకేజీ తీసుకుని రాజ్యసభ ఇచ్చాడంటావు అని నాగబాబు అమాయకంగా ఏదో కనిపెట్టిన వాడల్లా చెబుతారు. జగన్ ప్యాకేజీ తీసుకోవడమే కాదు, ఇవ్వడంలో కూడా నిష్ణాణుతుడే అని నాగబాబు అంటూ…జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శల వీడియోని ప్రదర్శిస్తారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతుగా ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేశారు.
అప్పుడు తనకు వైఎస్ జగన్ సీఎం సీటు ఇప్పించేందుకు రూ.15 వేల కోట్లు ఆఫర్ చేశారంటూ చేసిన విమర్శల వీడియోని నాగబాబు ప్రదర్శించి శునకానందం పొందడాన్ని చూడొచ్చు. తన సోదరుడైన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను లోకమంతా ప్యాకేజీ స్టార్‌గా గుర్తిస్తోందనే అక్కసుతో జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం నాగబాబుకు చెల్లిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
నాగబాబు టైమ్ పాస్ కోసం జగన్‌పై కామెడీ ప్రదర్శనలు చేస్తూ, తాను కమెడియన్ అవుతున్న విషయాన్ని గుర్తించలేదని తప్పు పడుతున్నారు. ప్యాకేజీ గురించి పవన్‌కల్యాణ్‌తో మాట్లాడి వీడియో పెట్టి వుంటే, అద్భుతంగా వుండేదని సెటైర్స్ పేలుతున్నాయి. రైట్ సబ్జెక్ట్, బట్ రాంగ్ పర్సన్‌ను ఎంచుకున్నారని నాగబాబుకు నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.