రాజకీయాలు ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండవు. రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒక్క మాదిరిగా ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటారు. ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవారు, ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అని వాదించేవారు రాజకీయాలకు పనికిరారు. అందితే జుట్టు …అందకపోతే కాళ్ళు’ అనే ఇది రాజకీయాల్లో పధ్రాన సూత్రం.
ఈ సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా ఒంటబట్టించుకున్నారు. అందుకే ఆయన మారిపోయారు. తనలో మార్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనడం మానేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజాతీర్పు తరువాత మనిషిలో మార్పు వచ్చింది. ఈమధ్య కాలంలో కొన్ని విషయాల్లో ఆయన యూటర్న్ తీసుకున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిన కొద్ది రోజులేక జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసిన కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల సభలో కేంద్రం మీద, బీజేపీ మీద నిప్పులు చెరిగారు. కాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంతో ఆ నిప్పులు గుప్పున చల్లారిపోయాయి. ఆ తరువాత ఢిల్లీకి వెళ్ళి వచ్చారు.
ఇక అంతే…. మనిషి మారిపోయారు. కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. కొన్ని విషయాల్లో కేంద్రం దారిలో నడుస్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారు. అవి రైతులకు ప్రయోజనం కలిగించవన్నారు. రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతు పలికారు.
అయితే నియంత్రిత సాగును ఎత్తేసిన సందర్భంలో రైతల పంటలను ఇక మీద ప్రభుత్వం కొనుగోలు చేయదని, వచ్చే ఏడాది నుంచి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పిన కేసీఆర్ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. అంటే కొత్త వ్యవసాయ చట్టాలను సమర్థించినట్లే కదా.
ఢిల్లీ పోకముందు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కూడా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించలేదు. రైతు సంఘాలతో మాట్లాడలేదు. నియంత్రిత సాగు గురించి గొప్పగా చెప్పిన కేసీఆర్ ఈమధ్యనే దానిపై యూటర్న్ తీసుకున్నారు. గతంలో ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలని, అలా వేయని రైతులకు రైతు బంధు పథకం నిలిపేస్తామని బెదిరించారు.
ఇక మంత్రులు నియంత్రిత సాగు ఎంత గొప్పదో ఊరూవాడా తిరిగి రైతులను ఊదరగొట్టారు. ఇది కేసీఆర్ చేసిన గొప్ప ఆలోచన అంటూ ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడంలో ఇదో కీలక అడుగని అభివర్ణించారు. కాని తాజాగా నియంత్రిత సాగుకు మంగళం పాడారు.
కరోనా కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగలు చేసిందని, వాస్తవానికి ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదన్నారు. రైతులు తమ ఇష్టం వచ్చిన చోట, ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోవచ్చన్నారు. ఎల్ఆర్ఎస్ను శిలా శాసనంగా చెప్పిన ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేకతకు తలవంచి దాన్ని రద్దు చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను నిన్నటివరకు వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. అనేకసార్లు అనేక వేదికల మీద ఆయుష్మాన్ భారత్‌ను కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మీ ఆయుష్మాన్ భారత్ కంటే మా ఆరోగ్యశ్రీ ఎంతో గొప్పదని కేసీఆర్ కేటీఆర్ కేంద్రానికి సవాల్ చేశారు. కాని ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
ఇన్నేళ్ళు అప్రతిహతంగా కొనసాగిన టీఆర్ఎస్ విజయపరంపరకు బ్రేకులు ఎందుకు పడుతున్నాయో కేసీఆర్‌కు అంతుపట్టడంలేదు. అయితే ఆయన దృష్టికి వచ్చిన కొన్ని కారణాల్లో గత రెండేళ్ళుగా కొందరి మంత్రుల పనితీరు బాగాలేదన్నది ఒకటి. దుబ్బాకలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి మంత్రుల పనితీరు కారణమని సీఎం నమ్ముతున్నారు. అందుకే మంత్రుల పనితీరును సమీక్షించి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
ఈ పని త్వరలోనే జరుగుతుందని అంటున్నారు. కొత్తవారికి కొందరికి పదవులు ఇవ్వడంతోపాటు తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి ప్రక్షాళనలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కుమార్తె కవితకు మంత్రి పదవి ఇవ్వరని తెలుస్తోంది.
ఆమెకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని కేసీఆర్ భయపడుతుతున్నారట. ఇప్పటికే బీజేపీ విరుచుకుపడుతోంది. కవితకు పదవి ఇస్తే ఆ విమర్శలు మరింత ఎక్కువ అవుతాయని, దీనివల్ల భవిష్యత్తు ఎన్నికల్లో నష్టం కలగవచ్చని కేసీఆర్ భావిస్తున్నారట.
నాగ్ మేడేపల్లి