నిజాల్ని జీర్ణం చేసుకోవడం కష్టం. మరీ పచ్చి నిజాల్ని భరించాలంటే ఇక చెప్పేదేముంది…. అసలు సాధ్యం కాదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ‘2020’ ఏడాది గురించి చక్కటి విశ్లేషణ చేశారు. అందులో ఆయన చెప్పిన అంశాలు బాగున్నాయి.
ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు. అయితే పూరి చెబుతున్న పచ్చి నిజాల్ని ఆరగించుకోవడం ఎలా? అనేదే ప్రశ్నార్థకం. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
‘అందరూ శత్రువులా భావిస్తున్న ‘2020’ నిజానికి మనకు ఎన్నో నేర్పింది. గత ఏడాది మనకు ఓ గురువులాంటిది. అందరూ తిట్టుకుంటున్న 2020 మన జీవితంలో ఉత్తమమైంది. ఎందుకంటే మనకు చాలా నేర్పింది. ఆరోగ్యం ప్రాధాన్యత గురించి అనుభవపూర్వకంగా చెప్పింది.
అలాగే రోగనిరోధక శక్తి చాలా అవసరమని నేర్పింది. పోషకాహార విలువేంటో తెలిసి వచ్చేలా చేసింది. ఇక పరిశుభ్రత గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే మానసిక ఆరోగ్యం చాలా అవసరమని లాక్డౌన్ ద్వారా తెలుసుకున్నాం. మనలో ఓపిక పెరిగింది.
నిజమైన స్నేహితులెవరో తెలియచెప్పింది. అలాగే పొదుపు ప్రాధాన్యం గురించి నేర్పింది. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా ఎలా బతకొచ్చో నేర్పింది. అన్నిటికి మించి ప్రకృతి చాలా శక్తిమంతమైనదని తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని నిరూపించింది.
రెండు నిమిషాలు ఊపిరి ఆగితే చాలు ప్రాణాలు పోతాయి.. చావనేది పెద్ద విషయం కాదు అనేది తెలిసి వచ్చింది. పసుపు, వెల్లుల్లి, తేనె, కషాయం, ఆవిరిపట్టడం వంటివి మంచివని తెలిసింది. ఆయుర్వేద విలువ తెలిసింది. 2020 మహమ్మారి సంవత్సరం కాదు.. ఇది మేల్కొలుపు సంవత్సరం.
అందుకే 2020ని మనం గౌరవించాలి. గత ఏడాది మనకు గురువు. ఏడాది పాటు ప్రపంచాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేసి మనందరికీ పాఠం చెప్పింది. అన్నీ పోతేపోనీ.. బతికున్నాం చాలురా దేవుడా అనే పరిస్థితిలో పెట్టింది. 2021 ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఇంకా ఎన్ని వైరస్లు వస్తాయో అసలు తెలియదు. కానీ, 2020 అనుభవం తర్వాత మనం చాలా మెచ్యూరిటీ సాధించాం. మనలో ఏదో తెలియని విశ్వాసం వచ్చింది.
జీవితంలో ప్రతి రోజునూ పండగలా జరుపుకోవడం నేర్చుకోవాలని గత ఏడాది చెప్పకనే చెప్పింది. గతం, భవిష్యత్ మనవి కావని తెలిపింది. అందుకే ఈ రోజును మనం ఆస్వాదించామా.. లేదా..! అనేది తెలుసుకోవాలి. జంతువుల్లా రోజంతా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుందాం.
మొక్కలు, ఆకులు, చెట్లను పలకరిద్దాం. స్నేహితులతో కలిసి నవ్వుకుందాం. బతికిన ప్రతిరోజూ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ పోవడమే.. ప్రతిరోజునూ పండగ చేసుకుంటూ ఆస్వాదిద్దాం’ అని పూరి పేర్కొన్నారు.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని పూరి తన మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటివి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సహజంగానే ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. అయితే మనిషిని బలహీనతలు ఎప్పుడూ డామినేట్ చేస్తుంటాయి. అందువల్లే వాటికి లొంగిపోయి దేని కోసమో పరుగు పెడుతుంటాడు. మనిషి రుషి అయితే తప్ప… డబ్బు, ద్వేషం, ఆత్మీయతానురాగాలు, పక్షపాతాలకు అతీతంగా జీవించలేడు.