గుంటూరు జిల్లాలో నిన్న ఓ చిన్న సంఘటన. కానీ ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను, రైతుల్లో గూడు కట్టుకున్న ఆగ్రహావేశాలను ప్రతిబింబిస్తోంది. మరి ఈ సమస్య జగన్ సర్కార్కు అర్థమవుతున్నదో లేదో తెలియదు కానీ, చాలా తీవ్రమైనదని చెప్పక తప్పదు. అందులోనూ రెవెన్యూ కార్యాలయానికి తాళం వేసింది కూడా వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కావడం గమనార్హం. అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం.
గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన యలగాల వెంకటేశ్వర్లు 2015లో 2.46 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే సర్వే కొలతల్లో 2.23 ఎకరాలే ఉన్నట్టు తేలింది. దీంతో తనకు ఇంకా రావాల్సిన 23 సెంట్ల స్థలం విషయమై తేల్చాలని ఏడు నెలలుగా ఆ కుటుంబం మాచవరం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అసలే రెవెన్యూ సమస్య. తలకిందలు తపస్సు చేసినా రెవెన్యూలో ఒక పట్టాన సమస్యను పరిష్కరించరని అందరికీ తెలిసిందే.
అయితే నెలల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యకు ఓ పరిష్కారం చూపకపోవడంతో బాధిత రైతు కుటుంబానికి సహనం నశించింది. దీంతో రైతు భార్య లక్ష్మమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు రెవెన్యూ కార్యాలయానికి గురువారం వెళ్లారు. తహశీల్దార్ గురించి సిబ్బందిని ఆరా తీశారు. గురజాల ఆర్డీవో కార్యాలయానికి సమావేశ నిమిత్తం వెళ్లారని సిబ్బంది చెప్పారు.
దీంతో సమస్యకు పరిష్కారం చూపలేదనే ఆగ్రహానికి గరైన రైతు కుటుంబ సభ్యులు కొంత మంది సిబ్బందిని గదిలోపలే పెట్టి రెవెన్యూ కార్యాలయానికి తాళం వేశారు. అనంతర రెవెన్యూ కార్యాలయ ఆవరణలో బైఠాయించారు.
ఇది కేవలం ఆ ఒక్క రైతు సమస్య మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏ రెవెన్యూ కార్యాలయం చూసినా ఇలాంటివి లెక్కలేనన్ని సమస్యలున్నాయి. భూమి కొలతల్లో ఎక్కువ తక్కువలు, పేర్లలో తప్పిదాలు ఇలా అనేక సమస్యలతో అడంగల్ కరెక్షన్ పెట్టుకున్న రైతులకు రెవెన్యూ అధికారులు చుక్కలు చూపుతున్నారు.
నెలల తరబడి సమస్య ఉన్నా ఉన్నతాధికారులకు కనీసం చీమ కుట్టినట్టైనా లేదనే విమర్శలున్నాయి. కాగా మాచర్లలో రెవెన్యూ కార్యాలయానికి తాళం వేసిన లక్ష్మమ్మ కుమారుడు కృష్ణంరాజు వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అని తెలుస్తోంది.
అధికార పార్టీ నాయకుడిలోనే ఇంత అసంతృప్తి ఉంటే, ఇక మిగిలిన ప్రజానీకం ఎలాంటి ఆలోచనతో ఉంటారో ప్రభుత్వం అర్థం చేసుకుని, రెవెన్యూ సమస్యలకు పరిష్కార మార్గం చూపాల్సి ఉంది.