ఏపీ హై కోర్టులో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన జస్టిస్ రాకేష్ కుమార్ రిటైరయ్యారు. 2020 డిసెంబర్ 31వ తేదీ ఆయన ఆఖరి వర్కింగ్ డే. అంతకు ముందు రోజు కూడా తీర్పు సందర్భంగా తన వ్యాఖ్యలతో దుమారం రేపారు జస్టిస్ రాకేష్ కుమార్.
ఏపీలో రాజ్యాంగం విఫలం చెందిందంటూ తను దాన్ని విచారిస్తానంటూ సుమోటోగా రాకేష్ కుమార్ విచారణ చేపట్టడం పై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
సుప్రీం కోర్టులో ఈ అంశం విచారణకు నోచుకునేంత వరకూ హై కోర్టులో విచారణను ఆపాలన్న పిటిషన్ ను కూడా రాకేష్ కుమార్ తిరస్కరించారు. విచారణ జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఏపీలో రాజ్యాంగం విఫలం అయ్యిందన్న జస్టిస్ రాకేష్ కుమార్ విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఆ వ్యాఖ్యల పట్లే సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు స్టే విధించడం, తదుపరి విచారణను వాయిదా వేయడంతో.. ఏపీలో రాజ్యాంగం విఫలం అయిపోయిందన్న రాకేష్ కుమార్ విచారణకు బ్రేక్ పడింది.
మరోవైపు ప్రభుత్వం వినియోగించుకోలేకపోతున్న భూముల అమ్మకం పిటిషన్ లో కూడా రాకేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏపీలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో తమకు తెలుసంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. విచారణకు ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా రాకేష్ కుమార్ వ్యాఖ్యానిస్తున్న తీరును వ్యతిరేకించారు న్యాయవాదులు. ఆ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలంటూ ఆయన ముందుకే మరో పిటిషన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
ఆయన నిస్పాక్షింగా విచారిస్తారనే నమ్మకం తమకు లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన రాకేష్ కుమార్ ధర్మాసనం ఆ తర్వాత మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దీనిపై అనేక మంది స్పందించారు.
అందుకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉన్న సమయంలోనే.. రాకేష్ కుమార్ రిటైరయ్యారు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా టీడీపీ పిటిషన్ల తరఫున వాదించే న్యాయవాదులు ప్రత్యేకంగా వెళ్లి కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అమరావతి రైతులు కూడా రాకేష్ కుమార్ కు వీడ్కోలు పలికారట.
తన సహచర న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిహార్ హై కోర్టు నుంచి బదిలీ కింద ఏపీకి వచ్చారు రాకేష్ కుమార్. ఇక్కడ కూడా విచారణల సందర్భంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన సంచలనం రేపారు. రిటైర్మెంట్ తో ఆయన తిరిగి పట్నా వెళ్లి పోయినట్టుగా తెలుస్తోంది.