‘పిడికిలి’, ‘అరచేయి’ పోయి ‘తీర్థం పార్టీ’ మిగిలింది

తరతరాలుగా దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతోంది. Advertisement ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తుంటే అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ ఆవిరైపోతున్న దీనగాధ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.  ఇన్నాళ్లూ “చేతి”లో ఉన్న…

తరతరాలుగా దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతోంది.

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తుంటే అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ ఆవిరైపోతున్న దీనగాధ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. 

ఇన్నాళ్లూ “చేతి”లో ఉన్న పంజాబ్ ని కూడా ఆం ఆద్మీ పార్టీ తన్నుకుపోతోందని అన్ని సర్వేలూ మైకులో అరుస్తున్నాయి. 

ఊహించినదే అయినా ఉత్తరప్రదేశులో మళ్లీ భాజపా విజయదుందుభి మోగిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా ఎక్కడా యాంటీ ఇన్-కంబెన్సీ మాట లేకుండా అత్యధిక మెజారిటీతో యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ యూపీ ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కబోతున్నాడు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. 

ఇక యూపీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్ లో కూడా భాజపాదే పైచేయి అవుతుందని పోలింగ్ ముగిసిన దరిమిలా సెఫాలజిస్టులు చెబుతున్న విషయం.  

చిన్న రాష్ట్రమైన మణీపూర్ భాజపా చేయి జారినా పర్వాలేదని ఆ పార్టీవాళ్ళే అనుకున్నా కూడా అక్కడా మళ్లీ భాజపాయే జెండా ఎగరేసే వాతావరణం కనిపిస్తుండడం మరో విడ్డూరం. 

అందరూ ఊహించినట్టు గోవాని కూడా భాజపా కోల్పోవట్లేదని, అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించడం ఖాయమని, మహా అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని కలుపుకుని హంగ్ అసంబ్లీని తీసుకొచ్చే అవకాశమైతే ఉందని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి. 

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దేశవ్యాప్తంగా ప్రజలకి ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. పాలకులపై అసంతృప్తి ఉన్నా కొత్తదేవుడికంటే పాత మొగుడే నయమన్నట్టు భాజపాకే ఓట్లేసి గెలిపించే పరిస్థితి ఉంది. 

పంజాబ్ విషయానికొస్తే ఢిల్లీలో ప్రూవ్ చేసుకున్న ఆప్ అయినా పర్లేదు కానీ కాంగ్రెసైతే వద్దనుకునే పరిస్థితి ఉంది. 

అందుకే “హస్త”గతంగా ఉన్న తమ రాష్ట్రాన్ని “చీపురు” కట్టతో శుభ్రం చేయమని ఆం ఆద్మీ పార్టీ ఏలుబడిలో పెట్టేలా ఉన్నారు పంజాబ్ ఓటర్లు. 

కాంగ్రెస్ ఇంతిలా అంతర్ధానమైపోవడానికి ముఖ్యకారణం రాహుల్ గాంధీ అప్గ్రేడ్ కాకపోవడం, ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తాను ప్రత్యామ్నాయశక్తిగా నిరూపించుకోలేకపోవడం, అతను తప్ప మరొక నాయకుడు నడిపించలేని పూర్తిస్థాయి వారసత్వపార్టీ కావడం. 

పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణాలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు అగమ్యగోచరమే. 

కేంద్రంలో భాజపా పరిస్థితి కంటే తెలంగాణాలో టీఆరెస్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకత పెరుగుతున్న దాఖలాలున్నా ప్రత్యామ్నాయ శక్తి లేదు. ఇక్కడ మీడియా కూడా నూరు శాతం పాలకపక్షమే. రోజులు గడుస్తున్నాయి, బడుగు వారికి స్కీములందుతున్నాయి. ప్రజలు 2024లో మళ్లీ తెరాసకే మొగ్గుచూపే అవకాశాలెక్కువ. 

అయితే తెలంగాణాలో అధికార పార్టీ ఎమ్మేల్యేలు కొందరు భూకబ్జాలకు విపరీతంగా తెగబడుతున్న మాట వాస్తవం. ఇక్కడ ఆయాబాధితుల్లో ప్రభుత్వవ్యతిరేకత వచ్చింది కానీ మొత్తం ప్రజానీకంలో కాదు. 

ఎలా చూసుకున్నా రేవంత్ రెడ్డికి ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎగ్జిట్ పోల్ కి అనుగుణంగా వస్తే రాజకీయమనుగడకే పెను సవాల్ అవుతుంది. ఇక గెలిస్తే రేవంత్ ని అడ్డం పెట్టుకుని తన మార్కు రాజకీయం చేసుకుందామనుకున్న చంద్రబాబు ఆశలు కూడా అడియాసలవుతాయి. 

ఇన్నేసి రాష్ట్రాల్లో భాజపా బలపడితే ఆ పార్టీతో శాశ్వతవైరం పెట్టుకున్న తెదేపాకి కలిసొచ్చేదేమీ లేదు. పొత్తులతో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలిగే పరిస్థితి ఉన్న తెదేపాకి ఎవరితో జట్టుకట్టాలో తెలియని అయోమయం తప్పదు. 

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎప్పుడో భూస్థాపితమైపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో కాస్త ఊపిరి పోసుకుంటుందనుకుంటే ప్రస్తుత వాతావరణాన్ని బట్టి పురిట్లోనే పాడెక్కేలా ఉంది. 

గరికిపాటివారు ఏదో సందర్భంలో చెప్పిన ఒక వాక్యాన్ని ఇక్కడ అన్వయించుకుని ఇలా చెప్పుకోవచ్చు- 

పిడికిలి బిగించి శక్తి చాటుకున్న కమ్యూనిస్ట్ పార్టీ నిర్వీర్యమైపోయింది. 

అరచేతిని పూర్తిగా విప్పి చూపించిన కాంగ్రెస్ అంతరించిపోతోంది.

ఇక ప్రస్తుతానికి శక్తి చాటుకుంటున్నదల్లా రెండు వేళ్లు మూసి రెండు వేళ్లు తెరిచి తీర్థం తీసుకునే సంస్కృతికి పట్టుగొమ్మైన కమలం పార్టీ మాత్రమే. 

శ్రీనివాసమూర్తి