గ‌వర్న‌ర్‌పై…జ‌గ‌న్ ఇలా, కేసీఆర్ అలా!

రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స‌మావేశాలు ఒకే రోజు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌వ‌ర్న‌ర్ల విష‌యానికి వ‌స్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్ర‌హంగా ఉండ‌గా, ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తుండ‌డం విశేషం. అంతేకాదు,…

రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స‌మావేశాలు ఒకే రోజు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌వ‌ర్న‌ర్ల విష‌యానికి వ‌స్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్ర‌హంగా ఉండ‌గా, ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తుండ‌డం విశేషం. అంతేకాదు, తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైని కేసీఆర్ స‌ర్కార్ ఆహ్వానించ‌క‌పోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. సాంకేతిక కార‌ణాల‌ను అడ్డు పెట్టుకుని త‌న‌ను బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ఆహ్వానించ‌ని కేసీఆర్ స‌ర్కార్‌పై త‌మిళ‌సై బ‌హిరంగంగానే నిర‌స‌న‌, ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు.

గ‌వ‌ర్న‌ర్‌తో సంబంధం లేకుండా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్రారంభించ‌డంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అక్క‌డ స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. ఇదే ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే భిన్న‌మైన ప‌రిస్థితుల‌ను చూడొచ్చు.

ఇవాళ ఏపీ శాస‌న‌మండ‌లితో పాటు, శాస‌న‌స‌భ 2022-23 బ‌డ్జెట్ స‌మావేశాల‌ను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత మొద‌టిసారిగా ఆయ‌న ఉభ‌య‌స‌భల‌ను ఉద్దేశించి నేరుగా ప్ర‌సంగించారు. అలాగే శాస‌న‌స‌భ‌లో మొద‌టిసారి ఆయ‌న అడుగు పెట్టారు.

ఇదిలా వుండ‌గా గ‌వ‌ర్న‌ర్‌ను దూషిస్తూ, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప్ర‌తుల‌ను టీడీపీ స‌భ్యులు స‌భ‌లో చించేశారు. వాటిని గ‌వ‌ర్న‌ర్‌పై విసిరేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంత‌రం  ఏపీ అసెంబ్లీ వాయిదా ప‌డింది. బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ స‌మావేశం జరిగింది. బీఏసీ స‌మావేశానికి హాజ‌రైన టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని అచ్చెన్న‌పై సీఎం మండిప‌డ్డారు. గవర్నర్‌ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని సీఎం కోర‌డం విశేషం. 

తెలంగాణ‌లో ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌ను అవ‌మానిస్తోంద‌ని అక్క‌డి ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వాపోతుంటే, ఏపీలో మాత్రం అందుకు రివ‌ర్స్‌లో ప్ర‌తిప‌క్షం అమ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సీఎం ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.