తమ నాయకుడు చంద్రబాబునాయుడు లేని అసెంబ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ సజావుగా సాగనీయకూడదనే కుట్రపూరిత ఎత్తుగడతోనే టీడీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తోంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే టీడీపీ తన వ్యూహాన్ని అమలుకు శ్రీకారం చుట్టింది. ఏపీ అసెంబ్లీని కౌరవ సభతో పోల్చి, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కౌరవ సభగా అభివర్ణించిన సభకు హాజరు కావాలా? వద్దా? అని కొన్ని రోజులుగా టీడీపీ నేతలు తర్జనభర్జనపడ్డారు. చివరికి సభకు వెళ్లాలని, ప్రజాసమస్యలపై నిలదీయాలని నిర్ణయించకున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సభలో కీలక నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. నిజమే కాబోలు అని అందరూ అనుకున్నారు.
తీరా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత టీడీపీ ఎజెండా ఏంటో తెలిసొచ్చింది. రచ్చే ఎజెండాగా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చట్టసభలోకి అడుగు పెట్టారని అధికార పక్ష సభ్యులకు అర్థమైంది.
రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడలేని గవర్నర్ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున అసెంబ్లీలో నినదించారు. ఒకవైపు గవర్నర్ ప్రసంగిస్తుండగా, మరోవైపు టీడీపీ సభ్యులు పట్టించుకోకుండా, బడ్జెట్ ప్రతుల్ని చించి, విసిరేస్తూ నానా రభస సృష్టించారు. దీంతో సభలో అయోమయం నెలకుంది.
ప్రతిపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనపై అధికార సభ్యులు అసహనానికి లోనయ్యారు. బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటే …ఎంత ఆగ్రహానికి గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.