తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజే సస్పెన్షన్ల పర్వం మొదలైంది. బీజేపీ తరపున ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టిన ఈటల రాజేందర్ తన మాతృ రాజకీయ పార్టీ టీఆర్ఎస్‌పై నిరసనకు దిగడం గమనార్హం. రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టే సందర్భంగా గవర్నర్ తమిళసైని ఆహ్వానించకపోవడంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది.
ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు త్రిబుల్ ఆర్(RRR)గా పిలుచుకునే ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు తమ నిరసన తెలిపారు. తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశ పెట్టగా, బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు.
హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. అంతటితో ఆగలేదు. బడ్జెట్ కాపీలను చించేసి గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఏంటంటూ బీజేపీ సభ్యులు నిలదీశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతున్న బీజేపీ ఎమ్మెల్యే త్రయంపై చర్యలకు సర్కార్ ఉపక్రమించింది.
రాజేందర్, రాజాసింగ్, రఘునందర్‌రావులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ముగ్గురు సభ్యులపై అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.