ఉదయం లేవగానే.. చేసే పనులకు సంబంధించి ఒక్కోరికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఉదయం లేవగానే చేసే పనుల విషయంలో తల్లిదండ్రులు కొంత క్రమశిక్షణ అలవాటు చేస్తారు. పిల్లలు మారం చేయడం, తల్లిదండ్రులు అరిచి అయినా పిల్లలకు ఉదయం లేవగానే చేసే పనుల విషయంలో క్రమశిక్షణను అలవరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
పిల్లలుగా ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే, ఉదయం లేవగానే.. చేసే పనుల విషయంలో ప్రతి వయసు వారికీ కొంత క్రమశిక్షణ అవసరం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సక్సెస్ అయినా, ఎంత డబ్బు సంపాదించిన, సంపాదిస్తున్నా.. ఉదయం లేవగానే.. అనే విషయంలో మాత్రం చేయాల్సిన పనులు ఎలా ఉన్నా, చేయకూడదని పనులు మాత్రం కొన్ని ఉన్నాయనేది తెలుసుకోవడం మాత్రం మంచి లైఫ్ స్టైల్ కు బాటలేస్తుంది. ఇంతకీ చేయకూడని ఆ పనుల జాబితా ఏదంటే…
లేవగానే.. ఫోన్ చూసుకోవడం!
ఈ తరానికి బాగా అలవాటైన పని ఇది. ఉదయం లేవగానే .. కనీసం కళ్లు అయినా తెరవకుండానే, పక్కనే ఉన్న ఫోన్ ను చేతికి అందుకోవడం. ప్రస్తుతం ఇలాంటి అలవాటు లేని వారున్నారంటే ఆశ్చర్యపోవాలి కానీ, దాదాపు నూటికి తొంభై మంది చేసే పని ఇది. రాత్రి ఓవర్ నైట్ వరకూ ఫోన్ చూసుకుంటూనే గడిపినా, మళ్లీ ఉదయం లేవగానే ఫోన్ తీసుకుని, అప్ డేట్స్ చెక్ చేసుకోవడం అలవాటు.
ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. మానసికంగా చూసుకున్నా, కళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నా… ఇది నిస్సందేహంగా మానుకోవాల్సిన అలవాటు. ఇదే సమయంలో ఫోన్ లైటింగ్ ను రాత్రి పూట పూర్తిగా తగ్గించుకుని వేసి వాడటం కూడా మంచిది. బ్రైట్ లైటింగ్ తో చీకట్లో ఫోన్ చూడటం, ఉదయాన్నే ఆ బ్రైట్ లైట్ కళ్ల మీద పడటం.. చాలా ఇబ్బంది పడుతుంది.
నైట్ ఈ లైటింగ్ ను పూర్తిగా తగ్గించేసుకుని, పగలు అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవడం ఉత్తమమైన పద్ధతి. అన్నింటకీ మించి ఉదయం లేవగానే ఫోన్ ను పట్టుకోవడం మానుకుంటే మరింత ఉత్తమం.
బ్రేక్ ఫాస్ట్ ను బ్రేక్ చేయొద్దు!
ఉదయాన్నే ఏం తినకపోవడం, తినకుండా ఉండగలగడం ఎంత మాత్రం గొప్ప కాదు. బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయవద్దు. ఇంకా వీలైతే బ్రేక్ ఫాస్ట్ నే ఫుల్ గా లాగించేయడం ఉత్తమం.
ఉదయాన్నే కడుపు నిండా తినడం, ఆ తర్వాత మోతాదును తగ్గించుకుంటూ వెళ్లడమే మంచి పద్ధతి అని వైద్యులు కూడా చెబుతుంటారు. ఉదయం రాజులా తిని, మధ్యాహ్నం సైనికుడిలా తిని, రాత్రి పూట బంటులా తినమనే సామెత ఒకటి ఉంది.
ప్లాన్ చేసుకోవాలి!
ఎంత తీరికగా ఉన్నా, ఎంత బిజీగా గడిపే వారు అయినా.. ఉదయం లేవగానే ఆ రోజులో దేనికి ఏ సమయం అనే విషయం గురించి ప్లాన్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ప్లాన్ చేసుకోవడం ఉంటే ఉపయోగం ఏమిటంటే, దొరికే కొద్ది పాటి ఖాళీ సమయాన్ని అయినా ఆస్వాధించవచ్చు.
అన్ ప్లాన్డ్ గా ఉంటే.. రోజంతా ఖాళీగానే ఉన్నా, ఏదో మిస్ అయ్యిందనే భావనే ఉంటుంది. అన్నీ ప్లాన్ ప్రకారమే జరగకపోవచ్చు. అయితే నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకోవడం మాత్రం మంచి పద్ధతి. ఆఖరికి ఆదివారం, షాపింగులకూ వినోదాలకు వెళ్లే సమయమే అయినా.. టైమింగులను ముందుగానే అనేసుకోవడం మంచి అలవాటు.
స్నానం తప్పనిసరి!
అందరికీ కాకపోవచ్చు. కొద్ధి మందికి రోజూ స్నానం చేయడం అనే అలవాటు ఉండకపోవచ్చు. వారికి చెప్పేదేమిటంటే, ఏమీ లేదు.. రోజూ స్నానం తప్పనిసరి అని. అది కూడా ఉదయం లేవగానే ఆ పని చేసేస్తే.. ఆ రోజుకు ఉల్లాసం మీ చెంతకు చేరినట్టే.
నెగిటివ్ థాట్స్!
ఈ రోజు ఏం జరుగుతుందో.. అనే ఆలోచనలను ఉదయాన్నే దరిచేయనీయవద్దు. ఎన్ని పరీక్షలు ఎదరయ్యే సమయం అయినా.. పాజిటివ్ ఆటిట్యూడ్ రోజును ప్రారంభించడం చాలా సానుకూలతను కలిగించవచ్చు. నెగిటివ్ థాట్స్ ను దరి చేయనీయకుండా చూసుకోవాలి. ఇది అలవరుచుకోవాల్సిన ధోరణి.