అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు మళ్లీ సభకు ఎందుకు రాదలచుకున్నట్టు? తమ అధినాయకుడికి జరిగిన అవమానానికి నిరసనగా.. అసలు సమావేశాలను వెలివేస్తున్నామని వారు ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సభలో సంప్రదాయాలు చెరగిపోయి దుర్మార్గం రాజ్యమేలుతున్నదని అన్నారు. ఇలాంటి సభలో ఉండడమే చాలా అవమానంగా, బాధగా ఉన్నదని పతివ్రతాశిరోమణి డైలాగులు కూడా వల్లించారు. మరి ఇప్పుడు సభ మొదలు కాబోతుండగా.. తగుదునమ్మా.. అంటూ సభకు హాజరవడానికి ఎందుకు సిద్ధపడ్డారు? పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. సభకు రావాలని నిర్ణయించుకోవడం వెనుక వారికి ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి. ఆ రెండూ కూడా ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ అసెంబ్లీ అనే అవకాశాన్ని వినియోగించుకోవాలనే కోరిక మాత్రమే.
ఒకటి– వివేకానందరెడ్డి హత్య. వివేకా హత్య విషయంలో పచ్చ మీడియా పత్రికలు డైలీ సీరియల్ కథనాలను ప్రచురిస్తూనే ఉన్నాయి. ఒక్కరోజు కూడా చిన్న గ్యాప్ తీసుకోవడం లేదు. పచ్చమీడియాతో ఎంతో గొప్ప సమన్వయంతో పనిచేస్తున్నట్టుగా.. అక్కడ కథనాలు వచ్చిన వెంటనే.. వాటికి అనుగుణంగా రాష్ట్రమంతా ఒక విషప్రచారాన్ని కొనసాగించడానికి.. వైసీపీపై ఆరోపణల్ని వెల్లువెత్తించడానికి టీడీపీ దళాలు సన్నద్ధంగా ఉంటున్నాయి.
అయితే ఇదే రాద్ధాంతాన్ని అసెంబ్లీలో చేయాలనేది టీడీపీ కోరిక. అసెంబ్లీలో.. వైఎస్ అవినాష్ రెడ్డి మీద నిందలు వేస్తూ.. ముఖ్యమంత్రే ఈ హత్య చేయించాడు అని ఆరోపించడం ద్వారా.. అధికార పార్టీని భ్రష్టు పట్టించాలనే వ్యూహంతో వారు సభకు వెళుతున్నారు.
రెండు– అమరావతి రాజధాని విషయంలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత.. టీడీపీలో జోష్ పెరిగింది. ఈ కోర్టు తీర్పును, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి విస్తృతంగా వాడుకోవాలనేది వారి లక్ష్యం. అమరావతి పై హైకోర్టు తీర్పును.. సభలో సెలబ్రేట్ చేసుకుంటూ.. అదేదో తమ ఘనతగా టముకు వేసుకోవడానికే వారు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. న్యాయస్థానంలో సత్యమే గెలిచిందని, తాము సత్య సంధులమని చాటుకోవాలి. ఆ రెండో లక్ష్యంతో వారు సభకు వస్తున్నారు.
నిజానికి ఇవి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ ప్రతిపాదనలు వాటికి సంబంధించిన చర్చలు, వ్యవహారాలకే సమయం ఉండదు. బడ్జెట్ గురించి టీడీపీ వారు ఏదో అవాకులు చెవాకులు పేలుతారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టినప్పుడు.. అందులో అమరావతికి కేటాయింపుల కోసం రభస చేయాలని, అమరావతి కేటాయింపులు చేయకపోతే.. కోర్టు ధిక్కరణ అవుతుందంటూ యాగీ చేయాలని వారు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం.
ప్రభుత్వం ఏ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతూ ఉన్నా సరే, వివేకా హత్య, అమరావతి రాజధాని అంశాల గురించి గోల చేయడం ద్వారా.. సభలో రభస టీడీపీ వ్యూహం. పైగా సభలో తమ మీద సస్పెన్షన్ వేటు పడాలని కూడా వారు కోరుకుంటున్నారు. తద్వారా నిజాలపై నిలదీస్తే ప్రభుత్వం అసహనానికి గురవుతోందని, భయపడుతోందని రంగుపులిమి విమర్శలు చేయడానికి టీడీపీ దళాలు వ్యూహరచన చేసుకున్నట్టుగా తెలుస్తోంది.