హైకోర్టు అమరావతొక్కటే రాజధానని తీర్పిచ్చింది. అంతే తెదేపా గెలిచినట్టు పసుపుమీడియాకి అనిపించింది. చంద్రబాబు ముఖ్యమంత్రయినట్టు పచ్చకళ్లకి ఒక కల కనిపించింది.
వెంటనే ఉద్యమకారులు, తెదేపా నాయకులు కొందరు అమరావతి ప్రాంతంలో మిఠాయి దుకాణాల మీద పడ్డారు. కేజీల్లెక్కని స్వీట్లు కొనుక్కుని పంచుకుతిన్నారు.
ఇంతకీ స్వీట్లెందుకు పంచారు, ఎందుకింత ఆనందంగా తింటున్నారని అడిగితే ఒక అమరావతి ఉద్యమకారుడు చెప్పిన విషయం ఇది- “అప్పట్లో అమరావతి రాజధానని చంద్రబాబు ప్రకటించగానే ఇక్కడ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని మాలాంటోళ్లని రెచ్చగొట్టి పదిరూపాయలు విలువచేసే భూమిని వందకి కొనిపించారు. రాజధాని నిర్మాణం అయ్యే నాటికి పదివేలకి అమ్ముకోవచ్చన్నారు. అంటే పెట్టిన పెట్టుబడికి వందరెట్లు వస్తుందని చెప్పారు. నమ్మి కొన్నాము. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మూడు రాజధానులనగానే మేము పెట్టిన వంద పెట్టుబడి ముప్పైకి దిగింది. అందుకే మా ఉద్యమం. ఇప్పుడు కోర్టు తీర్పు పుణ్యామా అని మళ్లీ ఊపొచ్చేలా ఉంది. ఆర్నెలల్లో క్యాపిటల్ కట్టేయాలని కోర్టు చెప్పింది కాబట్టి మరో మూడు నాలుగు నెలల్లో భూమిని పదివేలకమ్మేసి బయటపడిపోయే ఆశ కలుగుతోంది. ఈ సంతోషంలోనే షుగరున్నా నాలుగు స్వీట్లు తిన్నాను”.
అదీ పరిస్థితి.
విషయమిదే అయితే మరి ఇదంతా వైసీపీ ఓటమి, తెదేపా గెలుపు కింద మీడియాలో చెబుతున్నారుకదా అనే ప్రశ్న తలెత్తొచ్చు.
ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న తెదేపా పక్షపాతులు అమాంతం మీడియా చానళ్లల్లో దూరి వైసీపీ మీద విజయోత్సాహంతో విరుచుకుడుతున్నారేంటా అనిపించొచ్చు.
అలాంటి ఉత్సాహపరులంతా అమరావతి రియలెస్టేటులో చేతులు పెట్టినవాళ్ళే అని పైన ఉద్యమకారుడు చెప్పిన విషయాన్ని బట్టి అర్థమౌతోంది.
ఎందుకంటే అసలు అమరావతి తీర్పుకి తెదేపా ఆనందానికి దూరపు చుట్టరికం కూడా లేదు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి.
అమరావతి కథ చంద్రబాబు ముఖ్యమంత్రయ్యాక 2014-15 లో మొదలయింది.
పదవున్నంతకాలం అరచేతిలో స్వర్గాన్ని చూపించి, అమరావతిని సింగపూర్ చేస్తానని పిట్టలదొర కబుర్లు చెప్పి కాలక్షేపం చేసారు. అమరావతి కడుతున్నామంటూ కథ ఎంత బాగా రక్తికట్టించినా 2019లో ఘోరమైన పరాజయం పాలయ్యింది తెదేపా.
ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని నిర్మాణం తలకు మించిన భారం అని ఖజానాకేసి చూస్తే అర్థమయింది. రాష్ట్రానికి రాబడి, పోబడి లేక్కేస్తే చంద్రబాబు చెప్పింది “అమరావతి కథ” కాదు “భ్రమరావతి సోది” అని ప్రాక్టికల్ గా తేటతెల్లమయింది.
అందుకే ఏకంగా 35000 ఎకరాలకు గాను అమరావతి రైతులకి కంపెన్సేషన్ చెల్లించడం సాధ్యమయ్యే పని కాదని ఉన్న బిల్డింగుల్లోనే అమరావతిని శాసనరాజధానిగా ఉంచుకుని, ఆల్రెడీ నగరీకరణ చెందిన వైజాగ్ ను పరిపాలనారాజధానిగా చేసుకుందామనుకుంది వైసీపీ ప్రభుత్వం. దీనివల్ల కొత్తగా రోడ్లు వేయడం, బిల్డింగులు కట్టడం వగైరాలు తగ్గించుకోవచ్చని ఆలోచన.
ఈ నిర్ణయంతో కోస్తాకి, ఉత్తరాంధ్రకి న్యాయం చేసి ఊరుకుంటే సరిపోదని రాయలసీమలో కర్నూల్ ని న్యాయరాజధాని చెయ్యాలనుకున్నారు.
ఇదంతా రాష్ట్రంలో మూడు వైపులా రియలెస్టేట్ వ్యాపారం పుంజుకోవాలని, అన్ని చోట్ల సర్వతో ముఖాభివృద్ధి జరగాలని తీసుకున్న నిర్ణయం.
అయితే అభివృద్ధంతా తమ ఒడిలోనే జరగాలని, మిగిలిన వాళ్లంతా తమకంటే కిందస్థాయిలోనె ఉండాలని స్వప్నించే ఒకానొక వర్గం “ఇదంతా జగన్ మోహన్ రెడ్డి కమ్మవారిమీద కక్షగట్టి తీసుకున్న నిర్ణయం” అని పాటందుకున్నారు.
అలా ఏడుపున్నొక్క శ్రుతిలో పాట పాడి అమరావతిని కమ్మరావతిగా మార్చుకున్నారు.
ఈ ఏకపక్షధోరణి వల్ల రాష్ట్రంలోని మిగిలిన వర్గాలవాళ్లకి ఏహ్యభావం కలిగింది. పర్యవసానంగా అమరావతితో సహా రాష్ట్రమంతా తెదేపా స్థానిక ఎన్నికల్లో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది.
నిజంగా అమరావతి ఉద్యమం నిజమైతే కనీసం అమరావతిలోనైనా తెదేపా నెగ్గాలి కదా? అది జరగలేదు.
అయినా కూడా ఇంకా అమరావతిని పట్టుకుని వేలాడుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా సాధిస్తే ఆంధ్రప్రజలు తమ తెదేపాకి మళ్లీ జవసత్వాలిస్తారని నమ్మడం మామూలు భ్రమ కాదు..మహాభ్రమ.
కేసీయార్ తెలంగాణా సాధిస్తే తెలంగాణాలో ఉన్న ఆంధ్రప్రజలు కూడా ఆయనకి ఓట్లేసి నిలబెట్టేసారు. కానీ చంద్రబాబు అమరావతి అని కూస్తే కొంతమంది స్వజాతివర్గం తప్ప మిగిలిన ప్రజానీకమంతా ఓట్లేయకుండా చీకొట్టి మూలన కూర్చోబెడుతున్నారు.
ఈ మర్మం గ్రహించని తెదేపా సానుభూతి పరులకి, తెదేపా గెస్ట్ ఆర్టిస్టులకి లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించడం తప్ప ఇంకేమీ చేయగలిగేది లేదు.
స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్న రియలెస్టేట్ వ్యాపారులకి మాత్రం శుభాకాంక్షలు.
అలాగే కంగారులో వాపో, బలుపో తెలియకుండా అధికరేట్లకి ఇక్కడి భూములు కొనేవారికి ప్రగాఢ సానుభూతి.
ఎందుకంటే ఆర్నెలల్లో కాదు కదా ఆరేళ్లల్లో అయినా రాజధాని కట్టేయడానికి రాష్ట్రఖజానాలో డబ్బులేవు.
ప్రజాధనంతో అమరావతి రాజధాని నిర్మాణం జరగాలంటే సాక్షాత్తు కుబేరుడే ముఖ్యమంత్రయినా ఎప్పటికీ సాధ్యం కాని పని.
హరగోపాల్ సూరపనేని