కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో ఉండాలో, లేదో తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ బలహీనపడుతున్నా, నాయకుల్లో మాత్రం మార్పు రాలేదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి ఇవాళ జగ్గారెడ్డి మరోసారి తెరలేపారు. సోమవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ జరిగింది.
ఈ భేటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్‌కాట్ చేయడం గమనార్హం. ఇందుకు దారి తీసిన పరిస్థితులను గమనిస్తే… పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణం. తనకు తెలియకుండానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ మెదక్‌లో పర్యటించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీలు రేవంత్‌రెడ్డి ధోరణిపై దుమ్ము దులపాలని భావించిన జగ్గారెడ్డికి నిరాశే ఎదురైంది.
సమావేశంలో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా… వద్దన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నానని ఆయన తెలిపారు. తనను అవమానించే దమ్ము ఎవరికి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని జగ్గారెడ్డి ప్రకటించారు.
ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో విసుగుచెందినట్టు సమావేశంలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటనపై తనకు సమాచారంలేదని చెప్పారు.